iDreamPost
android-app
ios-app

చంద్రబాబుకు మరో “స్టే” – అమరావతి భూముల కుంభకోణం

  • Published Mar 19, 2021 | 12:38 PM Updated Updated Mar 19, 2021 | 12:38 PM
చంద్రబాబుకు మరో   “స్టే” – అమరావతి భూముల కుంభకోణం

టీడీపీ అధినేత చంద్రబాబు తన రికార్డుని తానే సవరించినట్టుగా పలువురు భావిస్తున్నారు. న్యాయస్థానాల విషయంలో విచారణ నిలుపుదల కోరుతూ ఆయన పలు కేసుల్లో వేసిన పిటీషన్లు ఫలించాయి. కేసు విచారణ ముందుకెళ్లకుండా స్టే లు సాధించడంలో ఆయన సిద్ధహస్తుడిగా గుర్తింపు పొందారు. తాజాగా అమరావతి అసైన్డ్ ల్యాండ్ విషయంలో కూడా ఆయన మరోసారి స్టే సాధించారు. అయితే ఇది తాత్కాలిక ఊరట మాత్రమే కావడం విశేషం. నాలుగు వారాల పాటు మాత్రమే ఈసారి ఆయనకు స్టే దక్కింది. దాంతో మరో నెల తర్వాత ఈ కేసు ఎలాంటి మలుపులు తీసుకున్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.

చంద్రబాబు తొలిసారి సీఎం అయిన నాటి నుంచి అంటే పాతికేళ్ల క్రితం నుంచి ఆయకు అవినీతి కేసులు ఆయన చుట్టూ ఉన్నాయి. అయితే ఒక్క కేసులో కూడా ఆయన మీద విచారణ పూర్తి కాలేదు. చివరకు సీబీఐ విచారణ విషయంలో కూడా సిబ్బంది లేరని చెప్పి విచారణ జరపకుండా ఆపేసిన చరిత్ర కూడా ఉంది. ఏలేరు స్కాం నుంచి తాజా అమరావతి అసైన్డ్ ల్యాండ్ వరకూ అదే పరంపర సాగుతోంది. ఆయనపై ఉన్న కేసు విషయంలో సాధించిన స్టే లతో ఓ రికార్డు నెలకొల్పినట్టు అంతా భావించే స్థితి వచ్చేసింది.

Also Read:ఆధారాలు చూపమంటూనే, అధికారం లేదంటున్న నిమ్మగడ్డ

తాజాగా చంద్రబాబుతో పాటుగా,అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మీద ఏపీ సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ని క్వాష్ చేయాలని ఇరువురూ విడివిడిగా పిటీషన్లు వేశారు. వాటిపై కోర్టు విచారణ జరిపింది. చంద్రబాబు తరుపున ఢిల్లీకి చెందిన ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదించగా, నారాయణ తరుపున దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు. ఆ తర్వాత సీబీఐ, ఏపీ ప్రభుత్వ వాదనలను కూడా కోర్టు ముందుంచారు. 2016 ఫిబ్రవరి 17న జీవో ఇచ్చిన తర్వాత మాత్రమే.. అప్పటి సీఎం చంద్రబాబు ర్యాటిఫికేషన్‌కు పంపించడం జరిగిందని ఆయన తరుపు న్యాయవాదులు కోర్టుకి తెలిపారు. అప్పటి వరకు చంద్రబాబుకు ఆ విషయం తెలియదని వివరించారు. ఫిర్యాదులో ఎక్కడి నుంచి ఎస్సీఎస్టీలకు చెందిన భూములు..బలవంతంగా తీసుకున్నారో తెలపలేదని పేర్కొన్నారు.

ఆ తర్వాత కోర్టు సీఐడీ న్యాయవాదిని పలు వివరాలు కోరింది. అయితే ప్రాధమిక ఆధారాల గురించి ఆరా తీసింది. అయితే పూర్తిస్థాయిలో ఆధారాలు సహా కేసు వివరాలను వెల్లడించేందుకు సమయం అవసరమని చెప్పడంతో ఈ కేసులో విచారణను తాత్కాలికంగా నిలిపివేస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. విచారణ రద్దు చేయాలని పిటీషనర్లు చంద్రబాబు, నారాయణ కోరగా కోర్టు దానికి నిరాకరించింది. నాలుగు వారాల పాటు విచారణ నిలిపివేసి సీఐడీ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. దాంతో చంద్రబాబుకి ఈ వ్యవహారంలో స్వల్ప ఊరట మాత్రమే దక్కింది.

Also Read:“తిరుపతి” వ్యూహం మార్చుకుంటున్న విప‌క్షాలు

ప్రస్తుతం సీఐడీ జారీ చేసిన నోటీసుల ప్రకారం ఈనెల 23న చంద్రబాబు విచారణకు హాజరుకావాల్సిన అవసరం లేదు. కానీ తదుపరి కోర్టు నిర్ణయం మేరకు ఈ కేసులో ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయన్నది ఆసక్తికరమే. ముఖ్యంగా సీఐడీ సమర్పించే కౌంటర్ లో పేర్కొనే ఆధారాలను బట్టి విచారణ ఆధారపడి ఉంటుందని అంతా భావిస్తున్నారు