iDreamPost
iDreamPost
వచ్చే ఏడాది ప్రథమార్థంలో దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితి ముగుస్తుంది. ఆ లోగానే అంటే ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తుండగా.. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల కసరత్తు ప్రారంభించింది. అయితే నిర్ణీత సమయానికి ఎన్నికలు జరుగుతాయా.. వాయిదా పడతాయా.. అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న తరుణంలో అలహాబాద్ హైకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు తాజా సందేహాలను రేకెత్తిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలను వాయిదా వేయాలని కోర్టు సూచించగా.. అదే తరుణంలో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ‘ఆశ్చర్యపడకండి.. ఎన్నికలు వాయిదా పడతాయి.. యూపీలో రాష్ట్రపతి పాలన విధిస్తారు’ అంటూ చేసిన ట్వీట్ కూడా ఎన్నికలు వాయిదా పడవచ్చన్న అభిప్రాయాలకు తావిస్తోంది.
హైకోర్టు ఏం చెప్పిందంటే..
ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నందున ఫిబ్రవరిలో జరగాల్సిన ఐదు రాష్ట్రాల ఎన్నికలను కనీసం రెండు నెలలు వాయిదా వేయాలని అలహాబాద్ హైకోర్టు ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది. ఒక కేసు విచారణ సందర్భంగా జస్టిస్ శేఖర్ యాదవ్ బెంచ్ ఈ సూచన చేసింది. విచారణ సమయంలో కోర్టు హాలు న్యాయవాదులు, కక్షిదారులతో నిండిపోవడం.. భౌతిక దూరం నిబంధన ఎవరూ పాటించకపోవడాన్ని గమనించిన న్యాయమూర్తి కోవిడ్, ఒమిక్రాన్ పరిస్థితిపై స్పందించారు. ఎన్నికల కోసం ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో ర్యాలీలు, సభల పేరుతో వేలల్లో జనాన్ని సమీకరిస్తున్నారని.. దీనివల్ల వైరస్ మరింత విజృంభించే ప్రమాదం ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికలను కనీసం రెండు నెలలు వాయిదా వేసే అంశాన్ని పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని సూచించారు.
ర్యాలీలు, సభలను నిషేధించాలని, కావాలనుకుంటే వర్చువల్ గా ప్రచారం చేసుకోవాలని, దీనికి టీవీలు, పత్రికలను ఉపయోగించుకోవాలని సూచించారు. గతంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కోవిడ్ విజృంభించిన విషయాన్ని న్యాయమూర్తి గుర్తు చేశారు.
సెకండ్ వేవ్ లో జరిగిందదే .ఆ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో కోవిడ్ రెండో దశ మొదలైన తరుణంలోనే పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అసోం ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో పార్టీలు పోటాపోటీగా వేల సంఖ్యలో ప్రజలను తరలించి ర్యాలీలు, సభలు నిర్వహించాయి. కోవిడ్ నిబంధనలు గాలికి వదిలేశాయి. తత్ఫలితంగానే మే నెలలో కోవిడ్ ఒక్కసారిగా విజృంభించి లక్షల్లో కేసులు నమోదయ్యాయి.
ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. జనవరి, ఫిబ్రవరి నాటికి మరింత వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఆంక్షలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఫిబ్రవరిలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు నిర్వహిస్తే గత పరిస్థితి పునరావృతం అవుతుందన్న ఆందోళన నెలకొంది. ఈ తరుణంలో అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ కలకలం
సరిగా ఇదే తరుణంలో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి చేసిన ట్వీట్ వైరల్ అయ్యి కలకలం రేపుతోంది. ఆశ్చర్యపడకండి యూపీ ఎన్నికలు వాయిదా పడతాయి.. ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారు.. అంటూ ట్విట్టర్ లో ఆయన పెట్టిన పోస్ట్ కలకలం రేపుతోంది. కేంద్ర ప్రభుత్వం తొందరలోనే ఈ నిర్ణయం ప్రకటించనుందని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతున్న తరుణంలో ఈ నిర్ణయం తప్పదని పేర్కొన్నారు.