iDreamPost
iDreamPost
మలయాళంలో గత ఏడాది వచ్చిన బ్లాక్ బస్టర్ల రీమేక్ హక్కులు మనవాళ్ళు ఎప్పుడో కొనేసి సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. లూసిఫర్ కోసం కసరత్తులు జరుగుతుండగా అయ్యప్పనుం కోశియం క్యాస్టింగ్ లో సదరు టీం తలమునకలై ఉంది. హెలెన్ ద్వారా సౌత్ కు జాన్వీ కపూర్ ని పరిచయం చేసేందుకు బోనీ కపూర్ రెడీ అవుతున్నారు. మొన్న ఏడాది వచ్చిన డేవిడ్ కోసం కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా మరో క్రేజీ రీమేక్ కోసం రంగం సిద్ధమవుతోంది. కప్పేలాకు తారాగణం ఒక్కొక్కరుగా సెట్ అవుతున్నారు. తక్కువ బడ్జెట్ లో రూపొంది గత ఏడాది సంచలనం రేపిన ఈ సినిమా గట్టి వసూళ్లు కూడా దక్కించుకుంది.
ముందుగా విశ్వక్ సేన్ ని ఒప్పించారట. పాగల్ పూర్తికాగానే ఇందులో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందులో కీలకమైన ఆటో డ్రైవర్ పాత్ర కోసం నవీన్ చంద్రను లాక్ చేసినట్టుగా తెలిసింది. ఒరిజినల్ వెర్షన్ లో హీరొయిన్ గా తన అసమాన నటనతో మెప్పించిన అన్నా బెన్ రోల్ కోసం ఉప్పెన ఫేం కృతి శెట్టిని ఫైనల్ చేశారని సమాచారం. ఇప్పటికే తను శ్యాం సింగ రాయ్, సుధీర్ బాబు సినిమాలకు కమిట్ అయ్యింది. ఇది నాలుగోది. ఫస్ట్ మూవీ రిలీజ్ కాకుండానే ఈ అమ్మడికి ఇంత డిమాండ్ రావడం పట్ల ఇప్పటికే పరిశ్రమ వర్గాలు ఆశ్చర్యపోతున్నారు.
కప్పేలాలో కథ మొత్తం తన చుట్టే తిరుగుతుంది. ఒక ఆటో డ్రైవర్ ప్రేమలో పడిన అమ్మాయి జీవితంలో కలిగే మార్పుల ఆధారంగా దీన్ని రూపొందించారు. సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ దీన్ని నిర్మించబోతోంది. దర్శకుడు ఎవరనే విషయం బయటికి రాలేదు కానీ సుకుమార్ శిష్యులలో ఒకరు దీని ద్వారానే డెబ్యు చేయబోతున్నట్టు తెలిసింది. అధికారిక ప్రకటన రావడానికి కొంత టైం పడుతుంది. ఎలాంటి రిస్క్ లేకుండా స్టొరీ కోసం బుర్రలు బద్దలు కొట్టుకోకుండా ఇలా రీమేకుల మార్గం పట్టడం బాగానే ఉంది కానీ వీటిలో ఎన్ని ఒరిజినల్ స్థాయిలో విజయం అందుకుంటున్నాయనేదే ఆలోచించాల్సిన ఇష్యూ.