iDreamPost
android-app
ios-app

విదేశాల్లో షూటింగ్ కు సిద్ధమైన మొదటిసినిమా

  • Published Jul 06, 2020 | 6:41 AM Updated Updated Jul 06, 2020 | 6:41 AM
విదేశాల్లో షూటింగ్ కు సిద్ధమైన మొదటిసినిమా

ఇప్పుడున్న పరిస్థితిలో ఇక్కడి లొకేషన్లలో షూటింగ్ చేయడానికే మనవాళ్ళు ముందువెనకా ఆలోచిస్తుంటే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ మాత్రం ఏకంగా విదేశాల్లో తన కొత్త సినిమా మొదలుపెట్టబోతున్నాడు. గత ఏడాది కన్నడలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన బెల్ బాటంని అదే పేరుతో అక్షయ్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దీన్ని వచ్చే ఆగస్ట్ లో యుకేలో స్టార్ట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఈయన నమ్మదగిన సమాచారమే ఇస్తాడు కాబట్టి ఇందులో అబద్దమని చెప్పడానికి అవకాశం తక్కువ. బెల్ బాటంకి రంజిత్ ఎం తివారి దర్శకత్వం వహిస్తున్నారు.

వాణి కపూర్ హీరొయిన్ గా నటిస్తుండగా హ్యుమా ఖురేషి, లారా దత్తా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాదే విడుదల కాబోతున్న బెల్ బాటంని హింది ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్టు కొన్ని కీలకమైన మార్పులు చేస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ లో ఫారిన్ లొకేషన్ ఉండదు. కాని హిందీలో మాత్రం దాన్ని జోడించారు. ముఖ్య తారాగణంతో పాటు కీలకమైన యూనిట్ మొత్తం యుకేకు బయలుదేరబోతోంది. అంతర్జాతీయ విమాన సర్వీసులు ఇంకా ప్రారంభం కాకుండానే ఇలా అనౌన్స్ మెంట్ ఇచ్చేయడం ఆశ్చర్యంగానే ఉంది. టికెట్స్ బుకింగ్, వీసా వ్యవహారాలు ఆల్రెడీ జరుగుతున్నట్టుగా తెలిసింది. ఇది ఒకరకంగా మంచిదే. ఇతరులకూ ధైర్యం కలుగుతుంది. తెలుగులోనూ రంగ్ దే, రాధే శ్యాం లాంటి సినిమాలు ఖచ్చితంగా బయటి దేశాల్లో తీయాల్సిన షెడ్యూల్స్ పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఒకరు అడుగు వేశారంటే ఆటోమేటిక్ గా మరికొందరికి స్ఫూర్తి కలుగుతుంది.

ప్రస్తుతం యుకెలో సిచువేషన్ కంట్రోల్ లోనే ఉంది. అక్కడి నిబంధనలకు అనుగుణంగా బెల్ బాటం టీం క్వారెంటైన్ ని పాటించడంతో పాటు షూటింగ్ ని చేయబోతోంది. కాకపోతే చివరి నిమిషం ఫ్లైట్ ఎక్కే దాకా ఇది జరుగుతుందని చెప్పలేని పరిస్థితి. బెల్ బాటం విషయానికి వస్తే ఇదొక డిటెక్టివ్ తరహా క్రైమ్ థ్రిల్లర్. నేర పరిశోదనలో విపరీతమైన ఆసక్తి ఉన్న హీరో తండ్రి మాట మీద బలవంతంగా పోలీస్ అవుతాడు. కాని అతనిలో ఉన్న చురుకైన పరిశోధకుడు కొన్ని కీలకమైన కేసులని సులభంగా పరిష్కరిస్తాడు. ఆ సమయంలో వస్తుందొక ఛాలెంజ్. దాన్ని అతను ఎలా ఎదుర్కున్నాడు అనేదే బెల్ బాటం కథ. అక్షయ్ కుమార్ బాగా మనసుపడి కొన్న రీమేక్ ఇది. మరి మిగలిన సినిమాల దర్శక నిర్మాతలు హీరోలు ఇప్పటి నుంచి ఇలాంటి ప్లానింగ్ తో ఉండటం అవసరమేమో.