iDreamPost
iDreamPost
ఖేలా హోబే.. అంటూ ఏడు నెలల క్రితం పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని ఉర్రూతలూగించిన పాట చాలామందికి ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అదే పాట.. అదే ట్యూన్ తో అర్థం మార్చుకుని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. అప్పుడే ప్రజాబాహుళ్యంలోకి చొచ్చుకుపోయి.. హుషారెత్తిస్తోంది. నాడు బెంగాల్ ఎన్నికల రంగాన్ని ఊపేసిన ఖేలా హోబే.. తాజాగా ఖడేరా హోబే..గా మారింది. మార్చిన ఈ పాటను యూపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ తన ప్రచారం కోసం విడుదల చేసింది.
తరిమికొడదాం..
ఖేలా హోబే అంటే బెంగాలీలో ఆట మొదలైంది అని అర్థం. దాన్నే భోజపూరీ భాషలోకి మార్చారు. ఆ భాషలో ఖడేరా హోబే అంటే తరిమికొడదాం.. అని అర్థం. తూర్పు యూపీలో ఎక్కువగా భోజపూరీ భాష వాడుకలో ఉంది. అందుకే తూర్పు యూపీలోని మౌ జిల్లాలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, మిత్రపక్షమైన ఎస్బీఎస్పీ అధ్యక్షుడు ఓం ప్రకాష్ రాజ్ బర్ తో కలిసి ఖడేరా హోబే పాటను విడుదల చేశారు. ఈ పాట వీడియో,ఆడియో అప్పుడే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రాష్ట్రంలో అన్నిచోట్లా అదే పాట వినిపిస్తోంది. ఎస్పీ, మిత్రపక్షాలతో పాటు బీజేపీయేతర పార్టీల కార్యకర్తలందరినీ ఆకట్టుకుంటోంది. ఉర్రూతలూగిస్తోంది.
బెంగాల్ ప్రయోగం ఇక్కడ ఫలిస్తుందా?
గత మార్చి,ఏప్రిల్ నెలల్లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బంగ్లాదేశ్ కు చెందిన ఖేలా హోబే పాటను మమతాబెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ దిగుమతి చేసుకుని ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా వాడుకుంది. హోరాహోరీగా జరిగిన ఎన్నికల యుద్ధంలో ఈ పాట బీజేపీని తీవ్ర అసహనానికి గురి చేసింది. ఆ ఎన్నికల్లో మమత పార్టీ హ్యాట్రిక్ విజయంతో మళ్లీ అధికారంలోకి వచ్చింది. తాజాగా అఖిలేష్ యాదవ్ కూడా తమ రాష్ట్రంలో బీజేపీపైకి అదే పాటను అస్త్రంగా ప్రయోగించారు. పాట అర్థానికి తగినట్లు బీజేపీని రాష్ట్రం నుంచి తరిమికొడదామని పిలుపునిచ్చారు. ఈ పిలుపు, ఆ పాట ఆయన్ను ఎంతవరకు విజయతీరాలకు చేర్చగలవోగానీ.. ఎన్నికల ప్రచారం, పొత్తుల విషయంలో మాత్రం సమాజ్‌వాదీ పార్టీ మిగతా పార్టీలకంటే చాలా ముందంజలో ఉంది.