iDreamPost
android-app
ios-app

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బ్యాచిలర్

  • Published Sep 19, 2020 | 5:49 AM Updated Updated Sep 19, 2020 | 5:49 AM
రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బ్యాచిలర్

కరోనా లాక్ డౌన్ వచ్చి థియేటర్లు మూతబడ్డాక ఏ ఒక్క తెలుగు సినిమా ఓటిటి కాకుండా నేరుగా హాళ్లలోకి వచ్చే తమ కొత్త చిత్రాల విడుదల తేదీలు ఇప్పటిదాకా ప్రకటించలేదు. దానికి అఖిల్ బ్రేక్ వేశాడు. తన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రిలీజ్ డేట్ ని ఓ టీవీ ఛానల్ తో జరిపిన ముఖాముఖీలో బయట పెట్టాడు. 2021 జనవరి 21న రాబోతున్నట్టు ప్రకటించాడు. అదేంటి సంక్రాంతి సీజన్ ని వదులుకోవడం ఏమిటి అనుకుంటున్నారా. ఇక్కడో కారణం కనిపిస్తోంది. పండగను టార్గెట్ చేసుకుని భారీ సినిమాలు బరిలోకి దిగబోతున్నాయి. అందులో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కూడా ఉంటుందని ఇప్పటికే టాక్ ఉంది. అదే నిజమైతే ఆ ప్రభంజనాన్ని తట్టుకోవడం అంత ఈజీ కాదు. 

మాములుగా సంక్రాంతికి రెండు మూడు సినిమాలకు మంచి కలెక్షన్లు వచ్చే స్కోప్ ఉన్నప్పటికీ అఖిల్ టీమ్ ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధ పడటం లేదు. వైరస్ భయం ఇంకా పొంచి ఉన్న నేపథ్యంలో జనం థియేటర్లను గతంలోలా హౌస్ ఫుల్ చేస్తారా అనేది ఆ టైంలో కూడా అనుమానమే. అందుకే సాధ్యమైనంత మేర రిస్క్ లేని గేమ్ ఆడటం మంచిది. అందుకే జనవరి 21 సేఫ్ డేట్ గా భావించవచ్చు. అందులోనూ అఖిల్ కు ఇది హిట్ కావడం చాలా చాలా అవసరం. ఐదేళ్లలో వచ్చిన మూడు సినిమాలు ఫ్లాప్ కావడంతో నాలుగోది మేజర్ బ్రేక్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకోవడానికి కారణం కూడా అదే. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఫామ్ లో లేనప్పటికీ అతను చెప్పిన కథ విపరీతంగా నచ్చడంతో గీతా కాంపౌండ్ దీని నిర్మాణానికి రెడీ అయ్యింది.

డైరెక్టర్ పరంగా అంచనాలు లేకపోయినా విషయం లేనిదే అల్లు అరవింద్ అంత సులభంగా ప్రాజెక్ట్ కు జెండా ఊపడు కదా అనే టాక్ కూడా ఫిలిం నగర్ లో ఉంది. ఈ లెక్కన పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ ఆల్బమ్ లో ఓ పాట లాక్ డౌన్ కు ముందే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. రేపు ఏఎన్ఆర్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ లేదా ఏదో ఒక కానుక విడుదల చేయబోతున్నారు. మరి అఖిల్ చెప్పిన డేట్ ని ఇందులోనే ఫైనల్ చేస్తారా లేదా అనేది వేచి చూడాలి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ డేట్ ఇంతపక్కాగా హీరోనే చెప్పాడు కాబట్టి ఇక మిగిలినవాళ్లు కూడా థియేట్రికల్ అనౌన్స్ మెంట్లు మొదలుపెడతారేమో చూడాలి. అదే జరిగితే మూవీ లవర్స్ కి వరసగా శుభవార్తలు వినిపించడం ఖాయం.