iDreamPost
android-app
ios-app

లేటు వయసులో అజిత్ క్రేజీ రిస్క్

  • Published Jan 19, 2021 | 4:39 AM Updated Updated Jan 19, 2021 | 4:39 AM
లేటు వయసులో అజిత్ క్రేజీ రిస్క్

తమిళనాడులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో అభిమానులు తలా అని ప్రేమగా పిలుచుకునే అజిత్ కు ఇక్కడ మార్కెట్ తక్కువగానే ఉండొచ్చు కానీ అతనంటే పిచ్చగా ఫీలయ్యే వాళ్ళకు కొదవలేదు. తన స్టైల్, యాక్టింగ్ తోనే కాక వ్యక్తిగత ప్రవర్తనతోనూ ఆకట్టుకునే అజిత్ తన వయసు సీనియర్ హీరోలు ఎవరూ చేయలేని ఓ అరుదైన స్టంట్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. అర్ధశతాబ్దపు వయసుకు కేవలం ఏడాది దూరంలో ఉన్న అజిత్ నిజానికి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కరోనా లాక్ డౌన్ సమయంలోనూ ఒకటికి పది సార్లు ఆలోచించి షూటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే విషయంలో ఆలస్యం చేశారు.

దీని సంగతలా ఉంచితే ప్రస్తుతం తను వలిమై చేస్తున్న సంగతి తెలిసిందే. కార్తీతో ఖాకీ ద్వారా తెలుగులోనూ పేరు తెచ్చుకున్న వినోత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇందులో ఆరెక్స్ 100 ఫేమ్ కార్తికేయ విలన్ గా చేయడం మరో ప్రధాన ఆకర్షణ. వేసవికి రిలీజ్ ని ప్లాన్ చేసుకున్నారు. తెలుగులోనూ సమాంతరంగా డబ్బింగ్ వెర్షన్ రూపంలో వస్తుంది. కాకపోతే రిలీజ్ ఎప్పుడనేది ఇంకా తెలియాల్సి ఉంది. హ్యూమా ఖురేషి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు టైటిల్, నిర్మాత ఇంకా డిసైడ్ కావాల్సి ఉంది.

తాజాగా అజిత్ 5000 కిలోమీటర్ల బైక్ జర్నీ చేయడం ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది. తన డుకాటీ బైక్ మీద పూణే నుంచి సిక్కిమ్ దాకా ఏకధాటిగా నడుపుతూ మధ్యమధ్యలో చిన్న బ్రేకులు తీసుకుంటూ సాగించిన ప్రయాణం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏదో వంద రెండు వందలు అంటే పర్లేదు కానీ ఇన్నేసి మైళ్ళ దూరాన్ని అలవోకగా పూర్తి చేయడం నిజంగా మెచ్చుకోదగిన విషయమే. మధ్యలో కాశీ విశాలాక్షుడి దర్శనం కూడా పూర్తి చేసుకున్నాడు అజిత్. సిక్కిం నుంచి చెన్నై ఇంటి దాకా అదే బైక్ లో తిరిగి వచ్చిన అజిత్ మొత్తంగా ఏ హీరో చేయని సాహసం చేశారు. ఫ్యాన్స్ కు ముందే తెలియకుండా చేయడం మంచిదయ్యింది.