iDreamPost
android-app
ios-app

తమిళనాడులో వెనక్కి తగ్గిన బీజేపీ

తమిళనాడులో వెనక్కి తగ్గిన బీజేపీ

తమిళనాడు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది తమ పార్టీ అధిష్ఠానమే నిర్ణయిస్తుందంటూ ఇన్నాళ్లూ చెబుతూ వచ్చిన బీజేపీ.. ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. ముఖ్యమంత్రిగా ఎడప్పాడి పళనిస్వామి పేరు ఖరారు చేస్తూ అన్నాడీఎంకే ప్రకటించడంపై తమకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. తమినాడులో అన్నాడీఎంకే పెద్ద పార్టీ అయినందున సీఎం అభ్యర్థిత్వం నిర్ణయం తీసుకునే అధికారం ఉందని, ఇక్కడ తమది చిన్న పార్టీ అయినందున ఆ నిర్ణయాన్ని గౌరవించాల్సిందేనని పేర్కొంది. ఈ మేరకు ఆ పార్టీ తమిళనాడు ఇన్‌చార్జ్‌ సీటీ రవి మీడియాకు స్పష్టం చేశారు.

ఆ విషయంలో సందేహాలు లేవు..

ఆయన సోమవారం తిరుచ్చిలో విలేకరులతో మాట్లాడుతూ… గతంలో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం అమిత్‌షాతో భేటీ అయినప్పుడు తాము ఎన్‌డీఏ కూటమిలోనే ఉంటామని, కలసి పని చేద్దామని చెప్పినందున ఆ విషయంలో ఎలాంటి సందేహాలు లేవన్నారు. దీనిపై అన్నాడీఎంకే సీనియర్‌ మంత్రి డి.జయకుమార్‌ మాట్లాడుతూ… బీజేపీ ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు. తాము మొదటి నుంచీ ఇదే చెబుతున్నామని, కానీ మధ్యలో కొంతమంది గందరగోళం సృష్టించారన్నారు. సీటీ రవి ప్రకటనతో కూటమిలో సమస్య సమస్యలన్నీ తీరిపోయినట్లేనన్నారు. కాగా ఇన్నాళ్లూ సీఎం అభ్యర్థిత్వంపై బీజేపీ అభ్యంతరం చెబుతుండగా, ఇటీవల జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య మండలి సమావేశం ఏకగ్రీవంగా ఎడప్పాడి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. అంతేగాక దీనిని గౌరవించే పార్టీలే తమ కూటమిలో ఉంటాయని, లేకుంటే ఎవరి దారి వారు చూసుకోవచ్చంటూ అన్నాడీఎంకే సీనియర్‌ నేతలు ఈ సమావేశంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ వైఖరి మార్చుకోవడం గమనార్హం.