iDreamPost
android-app
ios-app

అగ్రిగోల్డ్ ను ఇత్తడి చేసేశారు కదా!

  • Published Aug 25, 2021 | 2:23 PM Updated Updated Aug 25, 2021 | 2:23 PM
అగ్రిగోల్డ్ ను ఇత్తడి చేసేశారు కదా!

అధికారంలో ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ యాజమాన్యానికి కొమ్ము కాశారు. ఆస్తులు కాజేయడానికి ఎన్నో కుట్రలు చేశారు. సంస్థ బోర్డు పెట్టడం నుంచి.. దాన్ని తిప్పేయడం వరకు అంతా గత టీడీపీ పెద్దల కనుసన్నల్లోనే సాగింది. లక్షలాది మంది డిపాజిటర్ల సొమ్ముతో కూడబెట్టిన అగ్రిగోల్డ్ ఆస్తులపై కన్నేసిన టీడీపీ పెద్దలు.. మాయమాటలతో డిపాజిటర్లకు చెల్లింపులు జరపకుండా మోసం చేశారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంటే తగుదునమ్మా అంటూ వంకలు పెడుతున్నారు. ఒక్క పైసా కూడా చెల్లించనివారు దశాలవారీ చెల్లింపులను తప్పుపడుతున్నారు.

తాజాగా టీడీపీ నరసరావుపేట పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు చేసిన వ్యాఖ్యలు మొగుడిని కొట్టి మొగశాలకు ఎక్కిన చందంగా ఉన్నాయి. రూ.20 వేల లోపు డిపాజిట్ల చెల్లింపునకే రెండున్నరేళ్లు పడితే మొత్తం చెల్లింపులు పూర్తి చేయడానికి ఎంతకాలం పడుతుందని ఆయన గారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం సొంత సొమ్ము ఇవ్వడం లేదని.. అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి చెల్లిస్తోందని వంక పెడుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ పనులైనా చేస్తోంది.. గత చంద్రబాబు ప్రభుత్వం ఇదైనా ఎందుకు చేయలేకపోయిందో ముందు చెప్పాలని బాధితులు నిలదీస్తున్నారు. అసలు లక్షలాదిమంది బాధితులు కావడానికి అప్పటి బాబు ప్రభుత్వ నిర్వాకమే కారణమని గుర్తుచేస్తున్నారు.

ఇదీ టీడీపీ సర్కారు నిర్వాకం

తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలోనే 1996లో సెబీ అనుమతి లేకుండా అగ్రిగోల్డ్ డిపాజిట్ పథకాలు మొదలుపెట్టింది. చంద్రబాబు ప్రభుత్వం వారిని వెనుకనుంచి ప్రోత్సహించింది. డిపాజిటర్ల సొమ్ముతో పలు ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డగోలు అనుమతులు ఇచ్చింది. తిరిగి 2014లో అధికారం చేపట్టాక అదే ఏడాది డిసెంబరులో 32 లక్షల మంది డిపాజిటర్లను ముంచేసి బోర్డు తిప్పేసినా యాజమాన్యంపై చర్యలు తీసుకోలేదు. ఆరు లక్షలమంది ఏజెంట్ల ద్వారా వసూలు చేసిన రూ.6800 కోట్లు తిరిగి డిపాజిటర్లకు చెల్లించకుండా కాపాడింది. గుంటూరు సమీపంలోని హాయ్ ల్యాండ్ తదితర విలువైన ఆస్తులను కాజేసేందుకు కుట్రలు పన్నింది. వ్యవహారం కోర్టుకు వెళితే అవి తమవి కావని యాజమాన్యంతో అబద్ధాలు చెప్పించేందుకు కూడా వెనుకాడలేదు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించగా.. డబ్బులు చెల్లిస్తామని మాయమాటలతో కాలక్షేపం చేసి చివరికి మోసం చేసింది.

వైఎస్సార్సీపీ ఏం చేసింది..

లక్షలాది అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వైఎస్సార్సీపీ నిలబడింది. 2017లో అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీని ఏర్పాటు చేసి పోరాటం ప్రారంభించింది. హాయ్ ల్యాండ్ ను కాజేసేందుకు టీడీపీ పెద్దలు చేస్తున్న కుట్రలకు నిరసనగా ఆందోళన చేపడితే.. 2500 మంది బాధితులపై అక్రమ కేసులు బనాయించింది. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా దశలవారీగా బాధితులకు చెల్లింపులు జరుపుతోంది. మొదటి దశలో రూ. 10 వేల లోపు డిపాజిట్లు ఉన్న 3.40 లక్షల మంది బాధితులను గుర్తించి గత ఏడాది రూ.240 కోట్లు చెల్లించింది. మలి దశలో రూ. 20 వేలలోపు డిపాజిట్లు ఉన్న 13,83,574 మందికి ఈ నెల 24న సుమారు రూ. 500 కోట్లు చెల్లించింది. గతంలో టీడీపీ ప్రభుత్వం కోర్టు కేసుల సాకుతో చెల్లింపులకు తిరస్కరిస్తే.. ప్రస్తుత ప్రభుత్వం అదే కోర్టు అనుమతితో చెల్లింపులు జరుపుతోంది.

Also Read : ఒకే నియోజకవర్గం.. 267 మంది వాలంటీర్లు డిస్మిస్‌.. టీడీపీ నేతలు ఇప్పుడేమంటారో..?