Idream media
Idream media
అగ్రిగోల్డ్ డిపాజిట్ బాధితుల నేడు గురువారం రాష్ట్ర ప్రభుత్వం నగదు చెల్లించనుంది. తొలివిడతలో 3,69,655 మందికి సంబంధించిన డిపాజిట్లు తిరిగి చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇందులో భాగంగా.. గుంటూరులోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా గురువారం అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బుల పంపిణీ కార్యక్రమం జరగనుంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలోనే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు చేసే నిర్ణయంపై తీర్మానం చేశారు. మొదటి బడ్జెట్లోనే వారికి రూ.1,150 కోట్లు కేటాయించారు. ముందుగా రూ.10 వేలలోపు డిపాజిట్ చేసిన బాధితులకు చెల్లింపులు చేసేందుకు గతనెల 18న రాష్ట్ర ప్రభుత్వం రూ.263.99 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కెఆర్‌ఎం కిశోర్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.
సర్కారు నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 13జిల్లాల్లో ఒకేసారి చెల్లింపుల ద్వారా 3,69,655 మందికి సాంత్వన కలుగుతుంది. డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీ (డీసీఎల్) ప్రతిపాదనల ప్రకారం జిల్లాల వారీగా ఈ సొమ్మును అందజేయనున్నారు. అలాగే, రూ.20 వేలలోపు వున్న మరో 4 లక్షల మంది డిపాజిటర్లకు కూడా త్వరలో చెల్లింపులు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.