iDreamPost
android-app
ios-app

నిమ్మగడ్డకు బిగ్‌ షాక్‌.. మీడియా ముందుకొచ్చిన ఏజీ ఎస్‌.శ్రీరామ్‌

నిమ్మగడ్డకు బిగ్‌ షాక్‌.. మీడియా ముందుకొచ్చిన ఏజీ ఎస్‌.శ్రీరామ్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. హైకోర్టు తీర్పు ప్రకారం ఎన్నికల కమిషనర్‌గా తాను పునరుద్ధరించబడ్డానని నిమ్మగడ్డ స్వయంగా ధృవీకరించుకున్నారు. అయితే రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పులో రమేష్‌కుమార్‌ను తిరిగి పదవిలో తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌ పేర్కొన్నారు. కానీ రమేష్‌కుమార్‌ తనకు తాను తిరిగి బాధ్యతలు తీసుకుంటున్నట్లు ఎలా ప్రకటించుకుంటారని శ్రీరామ్‌ ప్రశ్నించారు. రమేష్‌కుమార్‌ అలా ప్రకటించుకోవడమే కాకుండా.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇంచార్జి కార్యదర్శికి తాను తిరిగి నియమించబడ్డానని సర్కూలర్‌ జారీ చేయాలని కూడా రమేష్‌కుమార్‌ పత్రం పంపించినట్లు శ్రీరామ్‌ తెలిపారు. విజయవాడ నుంచి ఈ పత్రం పంపిన రమేష్‌కుమార్‌.. హైదరాబాద్‌లోని తన క్యాంపు ఆఫీస్‌కు వాహనాలను పంపాలని చెప్పారన్నారు.

రమేష్‌కుమార్‌ను ఎప్పటి లోపు తిరిగి నియమించాలో హైకోర్టు తీర్పులో గడువు లేదని, అలా లేకపోతే రెండు నెలల వరకూ ఆగవచ్చన్నారు. సాంకేతికపరమైన కారణాలు ఉన్నందున తీర్పు ఇచ్చిన రోజునే తీర్పు అమలుపై హైకోర్టును స్టే కోరామని శ్రీరామ్‌ తెలిపారు. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు తీర్పు చెప్పిందన్న ఎస్‌.శ్రీరామ్‌.. రమేష్‌కుమార్‌ నియామకం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టిందని చెప్పారు. హైకోర్టు తీర్పు రమేష్‌కుమార్‌కు కూడా వర్తిస్తుందని చెప్పారు. 2016లో అప్పటి రాష్ట్ర మంత్రి మండలి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సిఫార్సుతో రాష్ట్ర గవర్నర్‌ రమేష్‌కుమార్‌ను నియమించారని చెప్పారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సుప్రింలో హైకోర్టు తీర్పును సవాల్‌ చేయబోతున్నట్లు అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ పేర్కొన్నారు.

ఎన్నికల కమిషనర్‌గా తనకు తాను ధృవీకరించుకున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. స్టాండింగ్‌ కౌన్సిల్‌గా ఉన్న ప్రభాకర్‌ను వెంటనే రాజీనామా చేయాలని కోరానని.. ఈ విషయంలో ప్రభాకర్‌ తన సలహా తీసుకున్నారని చెప్పారు. స్టాండింగ్‌ కౌన్సిల్‌కు కొత్త వారిని సోమవారం నియమించాలనుకుంటున్నట్లు.. వెంటనే రాజీనామా చేయాలని ప్రభాకర్‌ను.. రమేష్‌కుమర్‌ కోరారని శ్రీరామ్‌ తెలిపారు. సమయం అడిగితే.. ఇవ్వలేమని రమేష్‌కుమార్‌ అన్నారని ప్రభాకర్‌ తనకు చెప్పినట్లు ఏజీ శ్రీరామ్‌ చెప్పారు. అయితే ప్రస్తుతం రమేష్‌కుమార్‌కు ఆ అధికారం లేనందున.. ఆయన ఆదేశాలు పాటించాల్సిన అవసరం లేదని తాను చెప్పినట్లు శ్రీరామ్‌ పేర్కొన్నారు.