iDreamPost
android-app
ios-app

గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఎఫెక్ట్ : వెలుగులోకి కొవిడ్ కేసులు

గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఎఫెక్ట్ : వెలుగులోకి కొవిడ్ కేసులు

క‌రోనా విజృంభణ మళ్లీ మొదల‌వుతోంది. కేసుల సంఖ్య పెరుగుతోంది. చాలా మంది ప్రజలు కోవిడ్‌ నిబంధనలను పాటించకుండా రోడ్లపై తిరుగుతున్నారు. భౌతిక దూరాన్ని మరిచారు. దీంతో వైరస్‌ వ్యాప్తి చెందుతుందని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూనే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మార్కెట్, రైతుబజార్, దుకాణ సముదాయాల ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించకపోవడం, మాసు్కలు ధరించకపోవడంతో కేసుల సంఖ్య పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. అయితే చాలా మందికి కరోనా వైరస్‌ లక్షణాలు లేకుండానే వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. ఇటీవల హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగుల్లో కొంత మందికి క‌రోనా ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డుతుండ‌డం క‌ల‌వ‌రానికి గురి చేస్తోంది. ప్ర‌భుత్వం ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కొంద‌రు మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డారు. ముఖ్యంగా పోలీసుల్లో ఎక్కువ మంది బాధితులు క‌నిపిస్తున్నారు. ఏపీలో కూడా స్థానిక ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఈసీ ఉత్సాహం చూపుతోంది. తెలంగాణ‌లో వెలుగులోకి వ‌స్తున్న కేసుల‌ను దృష్టిలో పెట్టుకుని పున‌రాలోచించాల‌ని ఉద్యోగ సంఘాలు కోరుతుండ‌డం గ‌మ‌నార్హం.

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల విధుల్లో పాల్గొన్న పోలీసుల్లో కొంత మంది క‌రోనా బారిన ప‌డ్డారు. సెంట్ర‌ల్ జోన్ ప‌రిధిలోని ఓ పోలీస్ స్టేష‌న్ లో 5గురు సిబ్బందికి వైరస్ సోకిన‌ట్లు ఇటీవ‌ల బ‌య‌ట‌ప‌డింది. వారిలో ముగ్గురికి రెండో సారి కావ‌డం మ‌రింత క‌ల‌క‌లం రేపుతోంది. సైబ‌రాబాద్ ప‌రిధిలో మ‌రో 23 మంది క‌రోనా బారిన ప‌డ్డారు. రాచ‌కొండ‌లో 14 మంది పోలీసులు క‌రోనా బారిన ప‌డిన‌ట్లు తెలుస్తోంది. కొంత మందికి వైర‌స్ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డం లేదు. ప‌రీక్ష‌లు చేయించుకుంటే బాధితుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని అధికారులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 1949 మందికి కరోనా పరీక్షలు చేయగా 65 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వారిలో 14 మంది పోలీసులు ఉన్న‌ట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ఇటీవ‌ల చేస్తున్న ప‌రీక్ష‌ల్లో పోలీసుల సంఖ్య ఉంటోంద‌ని వెల్ల‌డిస్తున్నారు. అలాగే కొంత మంది ఇత‌ర ప్ర‌భుత్వ ఉద్యోగులు కూడా క‌రోనా బారిన ప‌డ్డారు.

అప్రమత్తంగా లేకుంటే ఇబ్బందులే..

సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో అప్రమత్తంగా లేకుంటే ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. పెండ్లీలు, విందులు, ఇతర కార్యక్రమాలకు హాజరైన వారు లక్షణాలు లేకున్నా పరీక్షలు చేయించుకుంటే మంచిదని వైద్యాశాఖాధికారులు పేర్కొంటున్నారు. సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో శుభకార్యాలు, ఇతర వాటికి వెళ్లకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. వృద్ధులు, పిల్లలు మరింతగా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. మాసు్కలు లేనిదే బయటకు రావద్దని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ నరేందర్‌ రాథోడ్‌ తెలిపారు.