iDreamPost
android-app
ios-app

దశాబ్ధాల కాలం నాటి కల.. సాకారం కాబోతున్న వేళ

  • Published Jan 27, 2022 | 3:19 AM Updated Updated Jan 27, 2022 | 3:19 AM
దశాబ్ధాల కాలం నాటి కల.. సాకారం కాబోతున్న వేళ

గోదావరి నదీపాయల మధ్య కొలువైన కోనసీమను జిల్లా చేయాలని ఈ ప్రాంతవాసులు దశాబ్ధాల కాలంగా కోరుతున్నారు. ఆదాయం, రాజకీయ చైతన్యం కలిగిన ఈ ప్రాంతాన్ని జిల్లా చేయాలని కొంతమంది నాయకులు డిమాండ్‌ చేయడం, చిన్నచిన్న ఉద్యమాలు కూడా చేయడం కూడా జరిగింది. కాని ఏ రాజకీయ పార్టీ వీరి డిమాండ్‌ను పట్టించుకోలేదు. అయితే పరిపాలనా సౌలభ్యం కోసం జగన్‌ ప్రభుత్వం చిన్న జిల్లాలను ఏర్పాటు చేయనుండడంతో కోనసీమ జిల్లా కల సాకారం కాబోతోంది.

అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లాను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ప్రస్తుత అమలాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో జిల్లా ఏర్పడనుంది. కొత్తగా ఏర్పడబోయే జిల్లా వైశాల్యం 2 వేల 615 చ.కిమీలు. మొత్తం జనాభా 18లక్షల 73 వేల మంది. అమలాపురం, ముమ్మిడివరం, కొత్తపేట, రాజోలు, పి.గన్నవరం, రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాలు ఉన్నాయి. అమలాపురం, రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ల ఉన్నాయి. అమలాపురం గ్రేడ్‌`1 మున్సిపాలిటీ కాగా, రామచంద్రపురం, మండపేట మున్సిపాలిటీలు, ముమ్మిడివరం నగర పంచాయతీలున్నాయి. ఇవి కాకుండా 24 మండలాలతో కొత్త జిల్లా ఏర్పడనుంది.

గతంలో రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాలతో సంబంధం లేకుండా అమలాపురం డివిజన్‌ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఉండేది. మాజీమంత్రి, స్వర్గీయ డాక్టర్‌ మెట్ల సత్యనారాయణరావు దీనిపై ఉద్యమానికి సిద్ధమని ప్రకటించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే పార్టీ నుంచి వత్తిడి వల్ల ఆయన వెనుకడుగు వేశారు. ఆయనతోపాటు మరికొంత మంది ప్రత్యేక జిల్లా కావాలని కోరుతూ వస్తున్నారు. నియోజకవర్గ పునర్విభజనకు ముందు కోనసీమలో అమలాపురం, అల్లవరం, నగరం, రాజోలు, కొత్తపేట, ముమ్మిడివరం ఇలా ఆరు నియోజకవర్గాలు ఉండేవి. గోదావరి నదీపాయలైన గౌతమీ, వశిష్ఠ, వైనతేయ నదీపాయల మధ్య కొలువై ఉన్న కోనసీమ (మధ్యడెల్టా) అంతా కలిపి ప్రత్యేక జిల్లా చేయాలని కోరేవారు. ఆదాయం పరంగా జిల్లాలో కోనసీమ అగ్రస్థానంలో ఉంది. రాజకీయ చైతన్యం ఎక్కువ. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక జిల్లా ఇవ్వాలనే డిమాండ్‌ జగన్‌ ప్రభుత్వ హాయాంలో నెరవేరుతోంది.