పశ్చిమ బెంగాల్ మరో స్టార్ వార్ కు సిద్ధం అవుతోంది. గత మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతాబెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీ మధ్య హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ నాయకుల మూకుమ్మడి దాడులను ఒంటి చేత్తో ఎదుర్కొని విజయం సాధించిన మమతాబెనర్జీ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆనాటి ప్రచారంలోను, ఫలితాల అనంతరం చెలరేగిన హింస, విధ్వంసాలు, ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా చల్లారక ముందే మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. వాటిలో భవానీపూర్ నుంచి స్వయంగా సీఎం మమత బరిలోకి దిగుతుండటంతో ఆమెను మరోసారి మట్టికరిపించాలన్న లక్ష్యంతో బీజేపీ బలమైన అభ్యర్థిని రంగంలోకి దించి.. సర్వశక్తులు ఒడ్డెందుకు సన్నాహాలు చేస్తోంది. దాంతో మమత, బీజేపీల మధ్య రాజకీయ యుద్ధం అనివార్యంగా కనిపిస్తోంది. మమతను సవాల్ చేసేందుకు బీజేపీ తమ పార్టీ మహిళా నేత, ప్రముఖ న్యాయవాది ప్రియాంక టిబ్రేవాల్ ను అభ్యర్థిగా ప్రకటించింది.
ఫలితాల అనంతర హింస కేసుల్లో పోరాడుతున్న నేత ముఖ్యమంత్రిపై పోటీకి ప్రియాంక పేరును బీజేపీ ప్రకటించడంతో అందరి దృష్టి ఆమె పైకి మళ్లింది. ఆమె ఎవరన్న ఆసక్తి వ్యక్తమవుతోంది. 41 ఏళ్ల ప్రియాంక టిబ్రేవాల్ కలకత్తా హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. 1981 జులై ఏడో తేదీన జన్మించిన ఆమె హజ్రా లా కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించారు. ఎంబీఏ కూడా చేసిన ఆమె కేంద్ర మాజీమంత్రి బాబుల్ సుప్రియోకు న్యాయ సలహాదారుగా ఉన్నారు. ఆయన ద్వారానే 2014లో బీజేపీలో చేరారు. భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) బెంగాల్ రాష్ట్ర విభాగం ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.
పార్టీలో పలు పదవులు నిర్వహించిన ఆమె 2015లో కోల్‌కతా నగరపాలక సంస్థ ఎన్నికల్లో 58వ డివిజన్ నుంచి, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంటల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రిపై పోటీ చేసే అవకాశం దక్కించుకుని రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చెలరేగిన అల్లర్లలో బాధితుల తరఫున దాఖలైన పలు కేసులను ప్రియాంక వాదిస్తున్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని.. నరేంద్ర మోదీ దూతగా తాను ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నానని ప్రియాంక వ్యాఖ్యానించారు. న్యాయవాదిగా న్యాయం పక్షాన నిలబడిన తనను ప్రజలు గెలిపిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
మమత కోసమే ఈ ఉప ఎన్నిక
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని ఒంటి చేత్తో మట్టి కరిపించి అధికారాన్ని నిలబెట్టుకున్న మమత వ్యక్తిగతంగా మాత్రం నందిగ్రామ్ లో బీజేపీ అభ్యర్థి, తన మాజీ మంత్రివర్గ సహచరుడు సువేందు అధికారి చేతిలో 1959 ఓట్ల తేడాతో ఓడిపోయారు. చట్టసభకు ఎన్నిక కాకపోయినా రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు ఆధారంగా తృణమూల్ లేజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నికై మూడోసారి సీఎం పదవి చేపట్టారు. నిబంధనల ప్రకారం ఆమె ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాల్సి ఉంది.
దాంతో మమత పోటీకి వీలుగా ఆమె సొంత నియోజకవర్గం భవానీపూర్ నుంచి ఎన్నికైన శోభనదేవ్ చటర్జీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దాంతో అక్కడ ఉపఎన్నిక ప్రకటించారు. ఈ నెల 30న అక్కడ పోలింగ్ జరుగుతుంది. భవానీపూర్ దీదీకి కంచుకోటలాంటిది. గతంలో ఆమె ఇక్కడి నుంచి రెండుసార్లు ఎన్నికయ్యారు. మొన్నటి ఎన్నికల్లో మాత్రం సువేందు అధికారితో చేసిన సవాల్ కు కట్టుబడి భవానీపూర్ వదిలి అతని నియోజకవర్గమైన నందిగ్రామ్ లో పోటీ చేశారు. అక్కడ ఓటమితో మళ్లీ సొంత నియోజకవర్గానికి వచ్చారు. ఇక్కడ కూడా మమతను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు బీజేపీ తుదికంటా ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు. మమతను ధీటుగా ఎదుర్కొనేందుకే మహిళా అభ్యర్థిని, అందులోనూ ఎన్నికల హింస కేసుల్లో తృణమూల్ సర్కారుపై కోర్టులో పోరాడుతున్న న్యాయవాదిని బరిలో దించి తొలి సవాల్ విసిరింది.