Idream media
Idream media
ఉద్యోగం సంపాదించాలంటే 99 శాతం కష్ట పడాలి. దానికి తోడు 1 శాతం అదృష్టం ఉండాలి.. ఈ మాటలు ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం అవుతున్న వారు తరచూ చెప్పేవి. ఇది వాస్తవం. కానీ సచివాలయ ఉద్యోగాల భర్తీ లో మాత్రం మూడో విడత లో ఉద్యోగాలు పొందుతున్న వారి విషయం లో మాత్రం ఈ మాటలు తిరగబడ్డాయి. 1 శాతం మేర కష్టపడితే.. వీరికి 99 శాతం అదృష్టం కలసి వచ్చింది. అసలు అర్హత మార్కులు సాధించని వీరు ఇప్పుడు ఉద్యోగాలు పొందడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు .
గ్రామ, వార్డు సచివాలయాల్లో 19 కేటగిరీల కింద 1, 26,728 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దాదాపు 22 లక్షల మంది పరీక్షలు రాస్తే.. సుమారు 1.95 వేల మంది అర్హత మార్కులు సాధించారు. వీరిలో చాల మంది రెండు, మూడు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. 3 ఏళ్ళు తప్పకుండా పని చేయాలన్న నిబంధన వల్ల గ్రూప్స్ కి సిద్ధమయ్యేవాళ్ళు ఈ పోస్టుల్లో చేరలేదు. 6 క్యాటగిరి ల్లో అర్హత సాధించిన వారు లేక 60 శాతం పోస్టులు మిగిలి పోయాయి. అన్ని పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం.. మొదటగా ఎస్సి, ఎస్టీ అభ్యర్థులకు అర్హత మార్కులు (45) ఎత్తి వేసింది. ఆయా జిల్లాల్లో ఎస్సి, ఎస్టీ అభ్యర్థుల్లో ఎవరికీ ఎక్కువ మార్కులు వస్తే వారికి ఉద్యోగాలు ఇచ్చారు. అప్పటికి బీసీ, ఓసి క్యాటగిరి లో ఉద్యోగాలు మిగిలిపోయాయి. దాదాపు 25 వేల పోస్టులు మిగిలిపోవడం తో వాటి భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మిగిలిన 25 వేల పోస్టులు భర్తీ చేసేందుకు బిసి, ఓసి అభ్యర్థులకు 15 మార్కులు కలిపి ఎవరికీ ఎక్కువ వస్తే వారికి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియను శనివారం నుంచి ప్రారంభించారు. మార్కులు కలపగా ఉద్యోగానికి ఎన్నికైన వారికి సందేశాలు పంపించి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు పిలిచారు. మొదటి రోజు శనివారం అగ్రికల్చర్ అసిస్టెంట్, అదివారం డిజిటల్ అసిస్టెంట్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టులకు 15 మార్కుకులు కలపగా ఎన్నికైన వారి సర్టిఫికెట్ల పరిశీలన ముగిసింది. మరో రెండు, మూడు రోజుల్లో మిగిలిన పోస్టులు కూడా అర్హత ఉన్న అభ్యర్థుల్ని పిలవనున్నారు. ఆయా జిల్లా కేంద్రాలలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అస్సలు వచ్చే అవకాశం లేని ఉద్యోగం రావడం తో అభ్యర్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.