iDreamPost
android-app
ios-app

లీగల్ చిక్కుల్లో గూఢచారి హీరో

  • Published Dec 28, 2020 | 7:11 AM Updated Updated Dec 28, 2020 | 7:11 AM
లీగల్ చిక్కుల్లో గూఢచారి హీరో

చిన్న పాత్రలతో కెరీర్ మొదలుపెట్టినా గత కొంతకాలంగా విభిన్న చిత్రాలతో దూసుకుపోతున్న అడవి శేష్ లీగల్ చిక్కుల్లో పడ్డట్టు ఫిలిం నగర్ టాక్. వివరాల్లోకి వెళ్తే గతంలో తను హీరోగా రాజశేఖర్ కూతురు శివాని హీరోయిన్ గా హిందీ సూపర్ హిట్ మూవీ 2 స్టేట్స్ రీమేక్ షూటింగ్ కొంత కాలం జరిగింది. సగానికి పైగానే పూర్తయ్యాక ఏవో కారణాల వల్ల షూటింగ్ ఆగిపోయింది. కొత్త దర్శకుడు సరిగా హ్యాండిల్ చేయలేదనే టాక్ వచ్చింది. కానీ ఖచ్చితంగా ఏం జరిగిందనే క్లారిటీ మాత్రం రాలేదు. ఆ తర్వాత దాని గురించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా టీమ్ సైలెంట్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఇది వార్తల్లోకి వచ్చింది.

ఆ సినిమా నిర్మాత ఎంఎల్వి సత్యనారాయణ కోర్టుకు వెళ్లడంతో పాటు తనకు సానుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలను మెరుగు పరుచుకున్నారట. ఒకవేళ ఇదే కనక జరిగితే శేష్ మిగిలిన బ్యాలన్స్ పూర్తి చేయడమో లేదా ఇంకో మూవీకి కమిట్ మెంట్ ఇవ్వడమో చేయాలి. అలా కాదు అంటే నిర్మాణానికి జరిగిన వ్యయం మొత్తాన్ని భరించాల్సి ఉంటుంది. గూఢచారి ఫలితానికి శేష్ ఇమేజ్ లో చాలా మార్పులు వచ్చాయి. ఎవరు రిజల్ట్, అంతకు చాలా ముందు వచ్చిన క్షణం బ్రేక్ తదితర కారణాలు ఏకంగా మహేష్ బాబు ప్రొడక్షన్ లో మేజర్ ప్రాజెక్ట్ చేజిక్కించుకునే దాకా తీసుకెళ్లాయి.

సో అడవి శేష్ కి రాజీ తప్ప మరో మార్గం ఉండకపోవచ్చు. పోనీ అదే సినిమా పూర్తి చేస్తే అది ఎలా వస్తుందో అన్న అనుమానాలు రాక మానవు. అసలే ఆ 2 స్టేట్స్ ఎప్పుడో ఏళ్ళ క్రితం వచ్చిన సినిమా. సక్సెస్ అయినప్పటికీ ఇప్పుడీ సబ్జెక్టు వర్కౌట్ అవ్వడం అనుమానమే. దీనికి సంబంధించి శేష్ వైపు నుంచి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదు. మేజర్ పనుల్లో తలమునకలైన శేష్ దాంతోనే పాన్ ఇండియా లెవెల్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ముంబై ఎటాక్స్ ని ఆధారంగా చేసుకుని మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న మేజర్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది వేసవిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు