iDreamPost
android-app
ios-app

కొత్తగా సీఎస్ ఆయనే ఖరారు, అధికార ప్రకటనలకు సన్నాహాలు

  • Published Dec 11, 2020 | 4:45 AM Updated Updated Dec 11, 2020 | 4:45 AM
కొత్తగా సీఎస్ ఆయనే ఖరారు, అధికార ప్రకటనలకు సన్నాహాలు

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిని పలువురు సీనియర్లు ఆశిస్తున్నారు. అయినప్పటికీ సీఎం వైఎస్ జగన్ ఎవరివైపు మొగ్గు చూపుతారోననే చర్చ మొదలయ్యింది. ఎన్నికలకు ముందు సీఎస్ గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం తర్వాత సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని ఇప్పటికే ఆరు నెలల పాటు తన పదవీకాలం పొడిగింపు మూలంగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది జూన్ నాటికే ఆమె రిటైర్ అయినప్పటికీ ఏపీ ప్రభుత్వ ప్రతిపాదన మేరకు కేంద్రం ఆమెకు రెండు విడతల్లో మూడు నెలలు చొప్పున అవకాశం కల్పించారు.

ఇక డిసెంబర్ నెలాఖరుతో ఆమె పదవీకాలం ముగుస్తున్న తరుణంలో కొత్త సీఎస్ ఎవరూ అనే చర్చ మొదలయ్యింది. ప్రస్తుతం సీనియర్ ఐఏఎస్ లుగా ఉన్న వారిలో సతీష్‌ చంద్ర, నీరబ్ కుమార్ ప్రసాద్, జేఎస్వీ ప్రసాద్‌‌ సహా పలువురు దానికోసం ప్రయత్నాల్లో ఉన్నారు .కానీ జగన్ మాత్రం ఆదిత్యానాథ్ దాస్ వైపు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన పేరుని ఖారారు చేసినట్టు అధికార వర్గాల్లో చర్చ మొదలయ్యింది. అధికార ప్రకటన మాత్రమే తరువాయి అన్నట్టుగా అంతా అంచనా వేస్తున్నారు. జగన్ ప్రభుత్వం రెండేళ్ల పదవీకాలం ముగుస్తున్న వేళ రాబోయే కాలం అత్యంత కీలకంగా మారబోతోంది. ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలకు తోడుగా అదనంగా మరిన్ని కొత్త పథకాలను తెరమీదకు తీసుకురాబోతోంది. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి సమపాళ్లలో ప్రాధాన్యతనిస్తూ ముందుకెళ్లే లక్ష్యంతో ఉంది. దానికి తగ్గట్టుగా సమన్వయంతో పనిచేసే సీఎస్ కోసం జగన్ ఆలోచన చేస్తున్నట్టు చెబుతున్నారు.

పాలనా వ్యవహారాల్లో సీఎం తర్వాత అధికారికంగా సీఎస్ ప్రధాన భూమిక పోషిస్తారు. దానికి తగ్గట్టుగా నీలం సాహ్ని సీఎస్ గా తన పదవీకాలంలో ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించారు. ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణలో సమస్యలు రాకుండా చూసుకున్నారు. దాంతో ఆమె తీరుకి కొనసాగింపుగా రేసులో ముందున్న ఆదిత్యానాథ్ దాస్ అయితే సమన్వయ సమస్యలు రాకుండా ఉంటాయనే అభిప్రాయం వినిపిస్తోంది. దానికి అనుగుణంగా ఇప్పటికే జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్‌ దాస్‌ను సీఎస్‌ కార్యాలయంలో ఓఎస్డీగా నియామకం ఉందని భావిస్తున్నారు. ఓఎస్డీగా ఉంటూ పాలనా వ్యవహారాలపై అవగాహన పెంచుకోడానికి ఈ ఏర్పాట్లు చేస్తున్నారనే వాదన ఉంది.

బీహార్ కి చెందిన ఆదిత్యానాద్‌ దాస్‌ 1987 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. బెనారస్‌ హిందూ యూనివర్సిటీలో బీఎస్సీ హానర్స్‌ (1980-84), ఢిల్లీలోని జేఎన్‌యూలో ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ (1984-86) చేశారు. విజయనగరం, విజయవాడ అసిస్టెంట్‌ కలెక్టర్‌గా, కృష్ణాజిల్లా జేసీగా, వరంగల్‌ కలెక్టర్‌గా, మురికివాడల అభివృద్ధి పథకం పీడీ, అదనపు కమిషనర్‌, మునిసిపల్‌ పరిపాలన కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌, నీటి పారుదల శాఖ సెక్రటరీ, ప్రిన్సిపల్‌ సెక్రటరీగా కూడా ఆయన సేవలందించారు. గతంలో వైఎస్ హయంలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు. అదే సమయంలో జగన్ తో ఆయనకు సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా ఆయన పనిచేయగలరనే అభిప్రాయంతో ఆయనకే అవకాశం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నారనే సమాచారం సచివాలయ వర్గాల్లో ఉంది.