Idream media
Idream media
మహారాష్ట్ర లో సీఎం కుర్చీలాట మొదలైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్య థాకరే అంటూ ప్రచారం ఊపందుకుంటోంది. ‘మహారాష్ట్ర భావి సీఎం’ అంటూ వర్లి నియోజకవర్గంలో తాజాగా పోస్టర్లు వెలుగులోకి వచ్చాయి. శివసేన కుటుంబం నుంచి తొలిసారి వర్లి నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన ఆదిత్య థాకరే 65 వేలకు పైగా ఓట్ల భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆయన అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్దఎత్తున పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. ‘యువసేకు, భారీ మెజారిటీతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన భావి ముఖ్యమంత్రి ఆదిత్య థాకరేకు హృదయపూర్వక అభినందనలు’ అంటూ పోస్టర్లు వెలిశాయి.
మహారాష్ట్ర విధానసభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకు ముందు ’50-50′ ఫార్ములాను ఆదిత్య థాకరే ప్రతిపాదించారు. ఈ ఫార్ములా కింద భాగస్వామ్య పక్షాలు రెండూ చెరో రెండున్నరేళ్లు అధికారం పంచుకోవాలని ఆయన కుండబద్ధలు కొట్టారు. మరోవైపు, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే రాష్ట్రంలోని రాజకీయ పరిణామలపై పార్టీ అగ్రనేతలతో మంతనాలకు సిద్ధమవుతున్నారు.
288 స్థానాలకు జరిగిన అసెంబ్లీకి ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి 161 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 105 సీట్లు, శివసేన 56 సీట్లు దక్కించుకున్నాయి. విపక్ష నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) 54 సీట్లు, ఎన్‌సీపీ భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్ పార్టీ సైతం 44 సీట్లు గెలుచుకుంది. ఎంఐఎం, ప్రహర్ జనశక్తి పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ రెండేసి సీట్లు చొప్పున గెలుచుకున్నాయి. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన, స్వాభిమాన్ షెట్కారి పార్టీ, సీపీఎం, రాష్ట్రీయ సమాజ్ పార్టీ, జన్ సూరజ్య పార్టీ, క్రాంతికారి షెట్కార్ పార్టీ తలో సీటు గెలుచుకున్నాయి. మరో 13 మంది ఇండిపెండెంట్లు కూడా విజయాలను కైవసం చేసుకున్నారు.