iDreamPost
iDreamPost
మద్య నియంత్రణపై మాట్లాడినందుకు సోషల్ మీడియాలో తనను విపరీతంగా ట్రోల్ చేస్తూ కొందరు పోస్టులు పెట్టారని, మద్య నియంత్రణ గురించి మహిళలు మాట్లాడకూడదా అంటూ అసెంబ్లీలో ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని. దిశా చట్టం అమలును నా నుండే మొదలుపెట్టాలని, తనని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై దిశ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను ఆదిరెడ్డి భవాని కోరారు.
నిన్న భవాని గారు మద్యం మీద మాట్లాడటం మీద రాసిన అభిప్రాయంలో సరిగ్గా ఇదే రాశాను . 22 మంది పురుష ఎమ్మెల్యేలు అందులో వెలగపూడి రామకృష్ణ లాంటి మద్యం వ్యాపారి, “మామా ఏక్ పెగ లా” అని పాటలు పాడిన బాలకృష్ణ ,మాటల యుద్ధంలో బాబు కు కవచంలా నిలుస్తున్న అచ్చం నాయుడు,పైలెట్ గా బాబు ముందు నడుస్తున్న రామా నాయుడు వీరందరిని మించి గుండు సూది నుంచి ప్రపంచపటం వరకు ప్రతి విషయం మాట్లడే చంద్రబాబు ఇంతమందిని కాదని టీడీపీ తరుపున గెలిచిన ఏకైక మహిళా ఎమ్మెల్యే భవాని గారితో మద్యం బ్రాండ్ల మీద, ధరల మీద మాట్లాడించటంలోనే చంద్రబాబు రాజకీయం ఉంది.
Also Read : మద్యం బ్రాండ్స్ ,రేట్లు
సభలో చర్చను కొనసాగిస్తూ దిశా చట్టాన్ని ఆంధ్ర ప్రదేశ్ లో ప్రవేశ పెట్టిన తర్వాత కూడా ఇలాంటివి జరుగుతున్నాయని టీడీపీ నేత అచ్చం నాయుడు విమర్శించారు. దిశా చట్టం ఇంకా అమలు చేయడం ప్రారంభించలేదని అప్పుడే దిశా చట్టంలో లోపాలను వెతకడం సరికాదని వైసీపీ నేత ఆర్థిక, ప్రణాళిక మరియు శాసన వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి వ్యాఖ్యానించారు. చట్టాన్ని తాము తప్పు పట్టడం లేదని కానీ తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని అచ్చం నాయుడు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ ఆదిరెడ్డి భావానిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. దిశా చట్టాన్ని అమలు చేసిన వెంటనే మొదటి కేసుగా ఆదిరెడ్డి భవాని కేసును నమోదు చేస్తామని స్పష్టం చేసారు. ప్రతి జిల్లాకి సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ను ఏర్పాటు చేసి సోషల్ మీడియాను పర్యవేక్షిస్తున్నామని సుచరిత పేర్కొన్నారు.