Idream media
Idream media
దేశంలో కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరికీ పాకుతోంది. ఉధృతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. సామాన్యుడి నుంచి సెలబ్రెటీల వరకూ అందరినీ వెంటాడుతోంది. వైరస్ ధాటికి సామాన్యులు, ప్రముఖులు అందరూ భయాందోళనకు గురవతున్నారు. దేశంలో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కరోనా బారినపడ్డారు.
తాజాగా సీనియర్ నటి, మాండ్య ఎంపీ సుమలత కరోనా బారిన పడ్డారు. తాజాగా పరీక్షలు చేయించుకున్న ఆమెకు కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. ఈ విషయాన్ని ఆమె ట్విటర్ ద్వారా తెలియజేశారు. `డియర్ ఫ్రెండ్స్.. శనివారం నుంచి నాకు తలనొప్పి, గొంతు నొప్పి మొదలయ్యాయి. నా నియోజకవర్గ పర్యటన సందర్భంగా నేను కోవిడ్-19 బారిన పడ్డానేమోననే సందేహంతో పరీక్షలు చేయించుకున్నాను. ఈ రోజు ఫలితం వచ్చింది. నాకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. లక్షణాలు స్వల్పంగానే ఉండడంతో ఇంటి నుంచే చికిత్స తీసుకోమని వైద్యులు సూచించారు. కాబట్టి నేను హోమ్ క్వారంటైన్‌లోనే ఉంటూ వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నా. దేవుడి దయతో, మీ అందరి మద్దతుతో నేను దీని నుంచి సులభంగానే బయటపడతానని నమ్మకంగా ఉన్నాన`ని సుమలత వరుస ట్వీట్లు చేశారు.
ప్రజలందరి ఆశీర్వాదంతో..త్వరలోనే కరోనా నుంచి బయటపడతానని ఆమె చెప్పారు. ఇటీవల తాను కలిసిన వారందరి వివరాలను అధికారులు వెల్లడంచానని తెలిపారు. వారంతా వీలైనంత త్వరగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాలం భాషల్లో పలు చిత్రాల్లో నటించిన సుమలత 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాండ్యా లోక్‌సభ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. జేడీఎస్ అభ్యర్థి, దేవెగౌడ మనవడు నిఖిల్‌పై గెలిచి, పార్లమెంట్‌లో అడుగుపెట్టారు.