iDreamPost
iDreamPost
సినీనటులు రాజకీయాల్లో రాణించాలి అంటే గ్లామర్ కన్న గ్రామర్ ముఖ్యం. ఇది చాలాసార్లు రూఢీ అయిన సత్యం. గ్లామర్ అనేది సభలకు జనాన్ని రప్పించడానికో, ఒకసారి గెలిపించడానికో పనికొస్తుంది. అదే రాజకీయాల్లో నిలదొక్కుకోవాలన్నా , కొనసాగాలన్నా గ్రామర్ నేర్చు కోవాలి. అంటే జనం మధ్య ఉండాలి. వారి గొంతుకై ప్రతిధ్వనించాలి. వారి కష్టాలు, కన్నీళ్లకు కారణాలు తెలుసుకోవాలి. అవి పార దోలేందుకు నడుం బిగించాలి. వారి తరుఫున పోరాడాలి. తను ఉన్నది తన కోసం కాదు జనం కోసమని వారు అనుకునేటట్టు తను పరిశ్రమించాలి. తమ సమస్యలు నాయకుడికి చెప్పుకుంటే పరిష్కారం దొరుకుతుంది అనే నమ్మకం కలిగించాలి. ఇలా జనం మనిషిగా తనను తాను మలచుకోవడమే రాజకీయ గ్రామర్. ఈ విషయాన్ని తెలుసుకున్న కొద్దిమంది సినీనటులు మాత్రమే రాజకీయాల్లో హిట్టయ్యారు. మిగిలినవారు అట్టర్ ఫ్లాప్ అయ్యారు.
తమిళనాడులో ఇలా..
మన పక్క రాష్ట్రం తమిళనాడులో ఎందరో సినీనటులు రాజకీయాల్లోActors Who Success In Politicsకి రాగా ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి మాత్రమే రాణించారు. మిగిలినవారు కనుమరుగయ్యారు. ఇందుకు తాజా ఉదాహరణ కమల్ హాసన్. నలభై ఏళ్ల సినీ అనుభవం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమాన గణము ఇవేమీ ఆయనకు అక్కరకు రాలేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ అయితే చాలా కూడికలు, తీసివేతలు అనంతరం తాను రాజకీయాల్లోకి రావడం లేదని తేల్చేశారు. శివాజీగణేశన్, వైజయంతి మాల లాంటి వారు విఫలమయ్యారు.
తెలుగులో ఎన్టీఆర్ ఒక్కరే..
తెలుగులో కొంగర జగ్గయ్య మొదలు పవన్ కల్యాణ్ వరకూ చాలామంది రాజకీయ తెరపైకి వచ్చినా రాణించింది ఒక్క ఎన్టీఆర్. జగ్గయ్య 1967లో ఒంగోలు నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కృష్ణ. కృష్ణంరాజు, జమున, మోహన్ బాబు, జయప్రద, హరికృష్ణ, బాలకృష్ణ, మురళీమోహన్, రామానాయుడు, బాబూమోహన్ ఎంపీలు, ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కూడా పనిచేశారు. వీరిలో కొందరు ప్రత్యక పరిస్థితుల్లో, మరి కొందరు అనివార్య కారణాలతో రాజకీయాల్లోకి వచ్చారు. బాలకృష్ణ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండగా మిగిలిన వారంతా అలా ఒక మెరుపు మెరిసిన వారే తప్ప రాజకీయాలను సీరియస్ గా తీసుకున్నవారు కాదు. అయితే తెలుగునాట ఎన్టీఆర్ ఒక్కరే రాజకీయాలను సీరియస్ గా తీసుకొని పనిచేసి రాణీంచారు.
Also Read : రాజమండ్రిలో రేపు చిరంజీవి, ఎల్లుండి పవన్ కళ్యాణ్
అదో ప్రభంజనం..
తెలుగు రాజకీయాల్లోకి ఎన్టీఆర్ ఆగమనం ఒక ప్రభంజనం సృష్టించింది. ప్రాంతీయ పార్టీని నెలకొల్పడం, తొమ్మిది నెలల్లో దాన్ని అధికారంలోకి తీసుకురావడం ఒక చరిత్ర. నాదెండ్ల వెన్నుపోటుతో కోల్పోయిన పదవిని నెల్లాళ్లలోనే తిరిగిపొందడం, మళ్లీ ఎన్నికలకు వెళ్లడం.. అంతా ఆయనకు జనంలో ఉన్న గ్లామర్ తోనే సాధ్యమైంది. అయితే అంతటి జనాకర్షణ కలిగిన నాయకుడు 1989 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోయారు. ఆ ఎన్నికల్లో ఆయనే కల్వకుర్తిలో ఓడిపోయారు. గ్లామర్ కన్న గ్రామర్ ముఖ్యమని అప్పుడే అర్థమైంది.
ఎన్టీఆర్ ఎంతసేపూ కాంగ్రెస్ నాయకులను కుక్కమూతి పిందెలు, దగుల్బాజీలు వంటి మాటలతో దూషించేవారు. తాను అధికారంలో ఉన్నా అవే మాటలు ఉపయోగిస్తూ ఆవేశ పడడం ఆయనకు రాజకీయంగా నష్టం చేసింది. ప్రజల్లో విశేష ఆదరణ ఉంది కనుక తాను ఏం మాట్లాడినా చెల్లుతుందనుకోవడం కూడా మైనస్ అయింది. అధికారం కోల్పోయాక వీటన్నింటినీ సమీక్షించుకొని మళ్లీ జనంలోకి వెళ్లి వారి ఆదరణ పొందారు. 1994 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచారు. 1995 ఆగస్టులో రెండో సారి అల్లుడు చంద్రబాబు వెన్నుపోటుతో ఆయన పదవిని, ఆ తర్వాత ప్రాణాలను కోల్పోయారు.
చిరు ప్రయత్నం..
ఎన్టీఆర్ మాదిరిగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సినీ రంగంలో నంబర్ వన్ స్థానంలో ఉన్న చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఎన్నికల గోదాలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న ఆయన రాజకీయాల్లోకి రావడం ఒక సంచలనం. ఆయన వ్యక్తిగత దూషణలకు దూరంగా జెంటిల్‌మెన్ తరహాలో తన ప్రచారం సాగించారు. 2009 ఎనికల్లో ఓడిపోయిన కొన్నాళ్లకే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. తర్వాత ఎంపీగా, కేంద్రమంత్రిగా పనిచేసినా ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చిరంజీవి కూడా గ్లామర్‌నే నమ్ముకుని గ్రామర్‌ను మిస్ అవడం వల్లే సక్సెస్ కాలేకపోయారు.
Also Read : బద్వేలు ఉప ఎన్నిక – పెద్దిరెడ్డి సారథ్యంలో వైసీపీ టీం ఇదే..
పవన్ కల్యాణ్ రాక..
2014లో సినీనటుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీ-టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చారు. 2019 ఎన్నికల్లో పోటీ చేయగా ఆ పార్టీకి ఒకే సీటు రాగా ఆయన స్వయంగా పోటీ చేసిన రెండుచోట్లా ఓడిపోయారు. తన పార్టీ గెలుపు సునాయాసమనుకొని భావించిన ఆయన ఆ ఓటమితో కొన్నాళ్లు స్తబ్దుగా ఉండిపోయారు. ఆ తర్వాత సినిమాలు చేసుకుంటున్నారు. ఉనికి కోసం అన్నట్టు అప్పడప్పుడూ వార్తల్లో మెరిసే ఈయన సంచలనానికి ఇస్తున్న ప్రాధాన్యం పార్టీ నిర్మాణానికి ఇవ్వడం లేదనే విమర్శ ఎదుర్కొంటున్నారు.
తిట్లకు ఓట్లు రాలునా?
నువ్వు తమలపాకుతో ఒకటిస్తే.. నే తలుపు చెక్కతో రెండిస్తా.. అన్నట్టు రాజకీయాల్లో తిట్లు, దూషణలకు వెంటనే రియాక్షన్ ఉంటుంది. తమ పార్టీ అభిమానులను తాత్కాలికంగా ఉత్సాహ పరచడం కోసం పవన్ అధికార పార్టీ నేతలను దూషిస్తున్నారు. రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ లో ఆయన చేసిన దూషణలు శృతి మించడంతో ఇప్పటికీ తిట్ల ప్రకంపనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ తరహా వ్యవహార శైలి వల్ల ఆ పార్టీకి ఒరిగేదేమీ ఉండదు. షూటింగ్ లేని రోజుల్లో జనంలోకి వచ్చి ఏదో నాలుగు డైలాగులు వల్లించి వెళ్లిపోవడమే రాజకీయామా? పార్టీ నిర్మాణంపై, జనం సమస్యలపై దృష్టి పెట్టకుండా నాటకీయతకు ప్రాధాన్యమిస్తే ఆయనను ప్రజలు ఆదరిస్తారా అన్నది ఆలోచించకపోవడం విచిత్రం. రాజకీయాలను సీరియస్‌గా తీసుకోకుండా ఇలా పార్ట్‌టైమ్ వ్యవహారంలా పార్టీని నడిపితే ఎవరికి ప్రయోజనమో ఆయనకే తెలియాలి.
Also Read : పవన్ ఇక నుంచే రాజకీయ నాయకుడట.!