iDreamPost
android-app
ios-app

సోనూసూద్ తో భేటీ వెనుక కేజ్రీవాల్ రాజకీయ వ్యూహం ఏంటి..?

సోనూసూద్ తో భేటీ వెనుక కేజ్రీవాల్ రాజకీయ వ్యూహం ఏంటి..?

కరోనా కష్టకాలంలో యావత్ భారత దేశంలో మారుమోగిన పేరు ఏదైనా ఉందంటే అది వన్ అండ్ ఓన్లీ సోనూసూద్ పేరు మాత్రమే. కరోనా కట్టడి కోసం మోడీ ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో కాలినడకన సొంతూళ్లకు వెళ్లేందుకు వలస కూలీలు పడుతున్న వారి దీనావస్థను చూసి చలించిపోయిన సోనూసూద్ తన వంతు సాయంగా చేయడం కోసం ముందుకు వచ్చాడు. ఇలా మొదలైన సాయం అంచెలంచెలుగా ఎదిగి దేశ వ్యాప్తంగా సహాయం చేసే స్థితికి ఎదిగాడు. దాతలు, తన టీంతో కరోనా పరిస్థితుల్లో ఆకలి, వైద్యం,రవాణా సదుపాయాలు లేకుండా ఇబ్బందిపడుతున్న ఎంతోమందికి దేశంలో ఏ మూల నుండి విజ్ఞప్తి వచ్చిన వెంటనే స్పందించి తనకు చేతనైనంత సహాయం చేశాడు. చాలా మందికి చేయలేకపోతున్నానని ఆవేదన కూడా వ్యక్తం చేశాడు. పేద ప్రజలే కాదు సెలబ్రిటీలు,రాజకీయ నాయకులు,క్రీడాకారులు ఇలా అందరూ సోనూసూద్ నుంచి సహాయం పొందిన వారే.

దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పరుచుకోని సాయం చేసినా చేస్తున్నా సోనూసూద్ రాజకీయాల్లోకి రావాలని చాలా మంది ఒత్తిడి చేశారు. కానీ వాటన్నిటినీ సున్నితంగా తిరస్కరించిన సోను తనకు సగటు మనిషి లాగా బతకడం ఇష్టం అని సున్నితంగా తిరస్కరించాడు.అప్పట్లో సోనూసూద్ రాజకీయ ఎంట్రీపై పెద్ద చర్చ జరిగింది. సోనూ రాజకీయాల్లోకి రావడంపై భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఒక్కడిగా ఇంత సహాయం చేసిన సోను రాజకీయాల్లో చేరి ప్రభుత్వంలో భాగస్వామి అయితే ఎంతో మందికి సహాయం చేయవచ్చు అని కొందరు సమర్థించారు. నిస్వార్థంగా సాయం చేసే సోనుసూద్ ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరి పరిమిత సంఖ్యలో, కొన్ని హద్దుల్లో సహాయం చేయాల్సి వస్తుందని రాజకీయాల్లోకి వెళ్ళకూడదని మరికొంతమంది సోనూసూద్ కు సలహాలు ఇచ్చారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో రాజకీయాలపై ఆసక్తి లేదని సహాయం కొనసాగిస్తూనే సినిమాలు చేస్తూ తన పని తాను చేసుకుంటూ పోయాడు.

అయితే తాజాగా సోనూసూద్ రాజకీయ ఎంట్రీపై మరోసారి దేశవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ మొదలయింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చే ఏడాది జరిగే బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ రేసులో రితేశ్‌ దేశ్‌ముఖ్, మిలింద్‌ సోమణ్‌లతో పాటు సోనూసూద్ కూడా కాంగ్రెస్ తరపున నిలబడతాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై క్లారిటీ కోసం గూగుల్, సోషల్ మీడియాలో అభిమానుల వెతకడం మొదలుపెట్టారు. అయితే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు వచ్చిన వార్తలను ఖండించాడు. తాను కామన్ మ్యాన్ల బతకడమే ఇష్టమని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టేశాడు.

సోనుసూద్ —కేజ్రీవాల్ భేటీ..

అయితే శుక్రవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ను కలవడం మరోసారి పొలిటికల్ ఎంట్రీ పై ఆసక్తి నెలకొల్పింది. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకు వస్తున్న “దేశ్ కె మెంటర్” కార్యక్రమానికి అంబాసిడర్ గా ఉండేందుకు సోనూసూద్ ఒప్పుకున్నారని ఇందుకోసమే అరవింద్ కేజ్రీవాల్, సోనుసూద్ భేటీ జరిగిందని తర్వాత వీరిద్దరూ ప్రెస్ మీట్ తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం దేశ్‌కే మెంటర్స్ ప్రొగ్రామ్‌ను త్వరలోనే లాంచ్ చేయబోతోందని… దానికి సోనూసూద్‌ను బ్రాండ్‌గా నియమించినట్లు అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. లక్షలాది మంది విద్యార్థులకు మెంటర్‌గా వ్యవహరించే అవకాశం రావడం సంతోషంగా ఉందని సోనూ సూద్ అన్నారు.

ఆప్ వ్యూహం ఏంటి…

సోనుసూద్ ఢిల్లీ ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం వెనకాల కేజ్రీవాల్ రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ మిగతా రాష్ట్రాల్లో విస్తరించేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నాడని… ఇప్పటికే గుజరాత్లో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించాడు. మరియు వచ్చే ఏడాది పంజాబ్ లో జరిగే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటీకి సిద్ధం అయింది. ఇప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీలోకి ఇతర పార్టీ నేతలు వచ్చి చేరుతున్నారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీని బలపరిచేందుకు సోనూసూద్ చరిష్మాను వాడుకోవాలని ఆప్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. సోనూసూద్ ని బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నుకోవడం ద్వారా సోను సొంత రాష్ట్రమైన పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ ప్రయోజనం పొందవచ్చని సోనుసూద్ చరిష్మాతో పంజాబ్ లో అధికారంలోకి రావాలని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు భావిస్తున్నారు.

సోనూసూద్ కాంగ్రెస్ వైపా ఆప్ వైపా

పంజాబ్ ప్రభుత్వ కోవిడ్ వ్యాక్సినేషన్ కు సోనూసూద్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. తన సోదరి మాల్విక సచ్చర్ కూడా పంజాబ్లో అనేక సహాయ కార్యక్రమాల్లో పాల్గొటోంది.వచ్చే ఎన్నికల్లో మాల్విక సచ్చర్ కాంగ్రెస్ టికెట్ పై మెగా నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు ఊహాగానాలు కూడా వస్తున్నాయి.
ఇటువంటి తరుణంలో సోను సూద్ రాజకీయఎంట్రీ, భవిష్యత్తు పై చర్చ ప్రాధాన్యతను సంతరించుకుంది. వచ్చే ఎన్నికల్లో సోనూసూద్ రాజకీయ పార్టీలకు సపోర్ట్ చేస్తాడా లేక తటస్థంగా ఉంటాడా అనే విషయంలో క్లారిటీ లేదు. ఇంతకాలం సోనూసూద్ చేసిన సేవా కార్యక్రమాలను పొగిడిన దేశ ప్రజలు ఒకవేళ సోనుసూద్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే  ప్రజలు ఆదరిస్తారా లేక మిగతా రాజకీయ పార్టీల నాయకులు లాగా చూస్తారా లెట్స్ వెయిట్ అండ్ సీ.

Also Read : అక్కడ చదివితే రిజర్వేషన్.. స్టాలిన్‌ సంచలన నిర్ణయం