iDreamPost
android-app
ios-app

సినీనటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత

సినీనటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత

సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌ (52) అనారోగ్యంతో కన్నుమూశారు. తెలుగు,తమిళ,హిందీ భాషల్లో నటుడిగా గుర్తింపుపొందిన ఆయన విలన్ పాత్రల్లోనే కాకుండా కామెడీ పాత్రల్లో కూడా నటించారు.

1963 మే 15న హైద‌రాబాద్‌లో నర్సింగ్ యాదవ్ జన్మించారు. ఆయన అసలు పేరు మైలా నర‌సింహ యాద‌వ్‌ కాగా నర్సింగ్ యాద‌వ్ గా ప్రేక్షకులకు సుపరిచితుడు. 300 పైగా సినిమాల్లో నటించిన నర్సింగ్‌ యాదవ్ విజ‌య‌నిర్మ‌ల ద‌ర్శక‌త్వం వ‌హించిన హేమాహేమీలు సినిమాతో ప‌రిచ‌యం అయ్యారు. క్షణక్షణం సినిమాతో నటుడిగా గుర్తింపు లభించడంతో ఇక ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. క్ష‌ణ‌క్ష‌ణం, గాయం, ముఠామేస్త్రీ,అల్లరి ప్రేమికుడు, మాస్‌, శంక‌ర్ దాదా ఎంబీబీయ‌స్‌, అనుకోకుండా ఒక రోజు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా,పోకిరి,యమదొంగ, రేసుగుర్రం, పిల్ల‌జ‌మీందార్‌, సుడిగాడు,తదితర చిత్రాల్లో తెలుగు ప్రేక్షకులను అలరించారు.

కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో గత కొంతకాలంగా డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు. కాగా ఆయన ఆరోగ్యం విషమించడంతో గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. నర్సింగ్ యాదవ్ మృతితో తెలుగు సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.