iDreamPost
iDreamPost
ప్రజాసమస్యలే ఇతివృత్తంగా సినిమాలను తెరకెక్కించే దర్శకుడు, నటుడు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పటికే మూడు రాజధానుల విషయంలో , వైజాగ్ గ్యాస్ లీక్ బాధితులకు పరిహారం అందించడంలో, అలాగే జనాభా దామాషా ప్రకారం బీసీలకు 54% రిజర్వేషలు కల్పించే విషయంలో సీఎం జగన్ నిర్ణయాలను స్వాగతించిన పీపుల్స్ స్టార్ తాజాగా ఏలేరు, తాండవ రిజర్వాయర్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలేరు, తాండవ రిజర్వాయర్లను అనుసంధానించడం ద్వారా తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని మెట్ట ప్రాంత పొలాలకు సాగునీరు అందించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయొచ్చని, తూర్పుగోదావరి జిల్లా అంటే కోనసీమ, గోదావరి డెల్టా అని మాత్రమే కాదని 50 శాతానికిపైగా మెట్ట ప్రాంతాలు ఉన్నాయని ఇక్కడ సరైన నీటి సదుపాయంలేక ఈ ప్రాంతం నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో వలస పోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తాండవ రిజర్వాయర్ నుంచి మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించాలన్న తన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి జగన్ వెంటనే తగిన కార్యాచరణ చేపట్టడం ఆయనలో ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని, 500 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అనుసంధాన ప్రాజెక్టుతో తాండవ, ఏలేరు ఆయకట్టు ద్వార వెనకపడిన ప్రాంతాలకు సాగునీరు అందుతుందన్నారు. తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని మెట్ట ప్రాంత రైతు సమస్యల శాశ్వత పరిష్కారానికి చొరవ చూపిన అపర భగీరథుడు సీఎం వైఎస్ జగన్ అని పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి కొనియాడారు.