Idream media
Idream media
ఈ మధ్య రణరంగం సినిమా చూశాను. అది ఆల్రెడీ ప్లాప్. కానీ ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకంటే మన హీరోలకి యాక్షన్ సినిమాల పిచ్చి పట్టుకొంది. శర్వానంద్ అంటే ఒక లవర్ బాయ్‌గా మనం అంగీకరిస్తాం. కానీ అతను డాన్ అవతారంలో గన్స్ తీసుకుని ఎడాపెడా కాల్చేస్తే ఎలా? అందుకే అది ప్లాప్.
ఎప్పుడూ మామూలు హీరోల కంటే యాక్షన్ హీరోలకే మార్కెట్ ఎక్కువ. రజనీకాంత్‌తో సమాన నటుడైనా కమల్‌హాసన్‌కి, రజనీ స్థాయి హైప్ ఎప్పుడూ రాలేదు. కారణం రజనీ ఏం చేసినా ప్రేక్షకుడు నమ్ముతాడు. కమల్ చేస్తే నమ్మరు. “లింగ” సినిమాలో రజనీ ఒకన్ని తంతే రైలు బోగీని చీల్చుకుని మరీ బయటకి వస్తాడు. రజనీ చేస్తే లాజిక్‌లు అడగం. ఆ మ్యాజిక్ అందరి వల్ల కాదు.
అయితే మన హీరోలు తొందరగా మార్కెట్ పెంచుకోవాలనే కోరికతో తప్పటడుగులు వేస్తారు. కృష్ణార్జునయుద్ధం సినిమాలో నాని ఇదే తప్పు చేశాడు. మేర్లపాక గాంధీ-నాని కాంబినేషన్ అంటే నూరు శాతం కామెడీని ప్రేక్షకులు కోరుకుంటే ఫైటింగ్ సినిమా వచ్చింది. ఫలితం తెలిసిందే.
సరే నాని, శర్వానంద్‌లకి ఎంతో కొంత క్రేజ్ ఉంది. వాళ్లు యాక్షన్‌పై మోజు పడినా అర్థం ఉంది. సాయిధరమ్‌తేజ్, వరుణ్‌తేజ్, నాగశౌర్య వీళ్లు కూడా రౌడీలను గాల్లోకి లేపి తంతూ ఉంటే ఎట్లా? సునీల్ కూడా ఇదే బాటలో వెళ్లి దెబ్బతిన్నాడు. ఒక పల్లెటూరి మాస్ కమెడియన్‌గా సునీల్‌ని ఇష్టపడిన ప్రేక్షకులు ఆయన సిక్స్‌ప్యాక్‌తో జక్కన్న, కృష్ణాష్టమి సినిమాల్లో విలన్లని ఇరగదీస్తుంటే అయోమయంతో కంగారుపడ్డారు.
వీళ్లు చాలదని సప్తగిరి కూడా హీరో అవతారంతో ఫైటింగ్‌కి దిగాడు. అటు హీరో, ఇటు కమెడియన్ రెండింటికి కాకుండా పోయాడు. నితిన్ కూడా “లై” అనే యాక్షన్ సినిమాతో ప్రేక్షకులని భయపెట్టాడు. నాగచైతన్య కూడా సవ్యసాచి అని ముందుకొచ్చి చాచి కొట్టాడు.
రణరంగం సినిమాలో తాను డాన్ అని శర్వానంద్ మురిసిపోయాడు కానీ, ఒక డాన్‌కి సరిపడా బాడీ లాంగ్వేజి తనలో ఉందో లేదో చెక్ చేసుకోలేకపోయాడు.
ఈ సినిమా ప్రత్యేకత ఏమంటే మాటల కంటే గన్‌సౌండ్స్ ఎక్కువగా ఉంటాయి. చూస్తే పేలిపోతారు.