iDreamPost
iDreamPost
నిన్న లీడింగ్ టీవీ ఛానల్స్ లో ఆచార్య కథ తాలూకు కాపీ గొడవతో పెద్ద రచ్చే జరిగింది. తన స్టోరీని అనుమతి లేకుండా వాడుకున్నారని, చాలా ఏళ్ళ క్రితమే దాన్ని రైటర్ అసోసియేషన్ లో రిజిస్టర్ కూడా చేశానని రాజేష్ అనే రచయిత ఆరోపించడం, నిన్న అది కాస్తా ప్రధాన మీడియాలోకి రావడంతో దర్శకుడు కొరటాల శివ కూడా ఘాటుగా స్పందించారు. పబ్లిసిటీ కోసం ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని, స్వంతంగా నేను రాసుకున్న కథను కేవలం మోషన్ పోస్టర్ ఆధారంగా చేసుకుని ప్రచారం చేయడం చాలా తప్పని లీగల్ గా అతని కన్నా ముందు తానే వెళ్తానని కొరటాల శివ చెప్పడం గమనార్హం. ఆచార్య నిర్మాతలు మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ కూడా ఈ వ్యవహారాన్ని ఖండిస్తూ ఇప్పటికే ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది
మరోవైపు ఈ ఇష్యూకి సంబంధించి ఈ సినిమాతో సంబంధమే లేని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కూడా వివరణ ఇచ్చింది. బాలేని కథను ఎలా ఒప్పుకుంటామని అలా అయితే కొత్త దర్శకులకు తమ బ్యానర్లో అవకాశాలు ఎలా ఇచ్చామని డియర్ కామ్రేడ్, మత్తు వదలరా దర్శకుల ఉదాహరణలు కూడా ఇచ్చారు. తమ సంస్థను కొరటాల శివను ఇందులోకి అనవసరంగా తీసుకొచ్చినందుకు గాను ఖచ్చితంగా చట్టపరమైన చర్యలతో ముందుకు వెళ్తామని కూడా స్పష్టం చేశారు. నిజానికి ఆచార్య సబ్జెక్టు తనదే అని చెప్పడానికి రాజేష్ చెబుతున్న ఆధారం ఒకటే. ఆ యూనిట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పిన మాటను బట్టి తను ఖారారు చేసుకున్నాడట. అయితే ఆ విషయం చెప్పిన ఆ టీమ్ సభ్యుడు ఎవరో తను బయటికి వచ్చి క్లారిటీ ఇస్తే ఇది నమ్మడానికి లేదు.
కాపీ వివాదాలు గతంలోనూ చాలా సార్లు వచ్చినప్పటికీ నిజాయితీగా నిజం చెప్పినవాళ్లకు తగిన న్యాయం జరిగిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని లోలోపలి సెటిల్ మెంట్లు కూడా జరిగాయి. అవన్నీ ప్రూఫ్స్ ఉన్నప్పుడు చెల్లుతాయి. కానీ ఆచార్య విషయంలో అవేవి స్పష్టంగా కనిపించడం లేదు. డ్రై సీజన్ అందులోనూ ఇదేదో హాట్ టాపిక్ దొరికిందనుకున్న న్యూస్ ఛానల్స్ వరసబెట్టి రాజేష్ ఇంటర్వ్యూలు చేసేసి దీన్ని పెద్దది చేసేశారు. ఆచార్య ఇంకా చాలా షూటింగ్ బ్యాలన్స్ ఉంది. సగం కూడా కాకుండా అందులో ఏముందో తెలుసుకోకుండానే ఇలా చేయడం భావ్యమా అని ప్రశ్నిస్తున్న వాళ్ళు లేకపోలేదు. ఏదో చిన్నది అనుకుంటే చిలికి చిలికి గాలి వాన తరహాలో ఈ ఛానళ్లు ప్రవేశించాక ఆచార్య వివాదం కాస్త కింగ్ సైజులోకి మారిపోయింది