Idream media
Idream media
కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ సమయంలో మౌనంగా ఉన్న అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మళ్లీ పంజా విసిరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన సబ్ రిజిస్ట్రార్, రెవెన్యూ కార్యాలయాల్లో బుధవారం ఏకకాలంలో ఏసీబీ దాడులు చేసింది. లెక్కల్లోరాని నగదు, అనధికారికి దస్త్రాలును స్వాధీనం చేసుకుంది. రెవెన్యూ కార్యాలయల్లో 3.50 లక్షలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 9.23 లక్షల నగదు పట్టుబడడం అవినీతి ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది. రెవెన్యూ, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ మూకుమ్ముడి దాడులు చేయడం ఇది రెండోసారి కావడం విశేషం.
అవినీతి రహితంగా పాలన సాగాలన్న సీఎం జగన్ లక్ష్యానికి అనుగుణంగా ఏసీబీ పని చేస్తోంది. ఈ ఏడాది జనవరి 6వ తేదీన ఏసీబీకి కొత్త బాస్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు వచ్చారు. ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రి నంబర్ 14400కు వచ్చిన కాల్స్, ఇతర సమాచారం, స్వతహాగా ఎంపిక చేసిన కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని ఏసీబీ దాడులు చేస్తోంది. ఇప్పటికే పలువరును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేసింది.
ఓ వైపు ఏసీబీ అవినీతిపరుల భరతం పడుతూ అవినీతి కట్టడికి పని చేస్తుండగా.. ఇందుకు అధనంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానాలను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. అవినీతి నిర్మూలనకు ఏమి చేయాలో ఇటీవల అహ్మదాబాద్ ఐఐఎం ఓ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదికలోని అంశాలతో త్వరలో దిశ తరహాలో అవినీతి నిర్మూలనకు చట్టం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది.
లంచం తీసుకున్న వారికి వెంటనే, కఠినమైన శిక్షలు వేస్తేనే అవినీతిని కట్టడి చేయగలమనే భావనలో ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగా అధికారులను విధుల నుంచి తొలగింపు లాంటి కఠినమైన నిబంధనలతో నూతన చట్టం త్వరలో రాబోతోంది. అవినీతి నిర్మూలనపై స్పష్టమైన విధానంతో ఉన్న సీఎం జగన్ లక్ష్యం నూతన చట్టం ద్వారా నెరవేరే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.