Idream media
Idream media
అమరావతి భూ కుంభకోణంపై మరో విచారణ విభాగం రంగంలోకి దిగింది. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఆధారంగా మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. అతనితోపాటు మరో ఇద్దరు రెవెన్యూ అధికారులపై కూడా కేసులు పెట్టింది. సీఆర్‌డీఏలో పని చేసిన డిప్యూటీ కలెక్టర్, తుళ్లూరు మాజీ తహసీల్దార్లు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు సహకరించారని, సర్వే నంబర్లు తారుమారు చేశారనే అభియోగాలపై సీఐడీ ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. మాజీ ఏజీతో సహా రెవెన్యూ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, అవినీతికి పాల్పడినట్లు తేలడంతో ఏసీబీ కేసులు నమోదు చేసింది.
4,069 ఎకరాల భూమి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో కొనుగోలు చేశారని మంత్రివర్గ ఉపసంఘం తేల్చింది. అమరావతిలోని 29 గ్రామాల్లో రాజధాని ప్రకటించకముందే ఈ భూములు చంద్రబాబు, లోకేష్ సన్నిహితులు, అనుచరులు, టీడీపీ నేతలు కొనుగోలు చేశారన్న ఆరోపణలపై పక్కా ఆధారాలు లభించాయి. ఈ నేపథ్యంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారం నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ చేయించేందుకు నిర్ణయించింది. ఈ ఏడాది మార్చి 23వ తేదీన అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు సమ్మతిని తెలియజేస్తూ కేంద్ర హోం శాఖకు లేఖ కూడా రాసింది. అయితే సీబీఐ విచారణను అడ్డుకునేలా టీడీపీ నేతలు హైకోర్టుల్లో పిటిషన్లు వేశారు.
తాజాగా ఏసీబీ కూడా రంగంలోకి దిగడంతో ఈ వ్యవహారంలో టీడీపీ నేతలకు సహకరించిన అధికారుల్లో భయం మొదలైంది. ఓ వైపు సీఐడీ టీడీపీ తాజా, మాజీ ప్రతినిధులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఇంకో వైపు ఏసీబీ కూడా రావడంతో భూ కుంభకోణంలో అధికారుల పాత్రపై లోతైన విచారణ జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సీఐడీ, ఏసీబీల విచారణ జరుగుతుండగానే.. సీబీఐ విచారణ కూడా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ విచారణను ప్రారంభించేలా పార్లమెంట్‌లో పట్టుబడతామని వైసీపీ ఎంపీలు ఇప్పటికే ప్రకటించారు.