iDreamPost
android-app
ios-app

చంద్ర‌బాబును వెంటాడుతున్న అక్ర‌మాస్తుల కేసు..

చంద్ర‌బాబును వెంటాడుతున్న అక్ర‌మాస్తుల కేసు..

తెలుగుదేశం పార్టీ నేత‌ల‌ను కేసులు వెంటాడుతున్నాయి. అధికారంలో ఉండ‌గా చేసిన త‌ప్పుల‌కు కొంద‌రు శిక్ష అనుభ‌విస్తుంటే.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చ‌లాయించిన పెత్త‌నానికి మ‌రికొంద‌రు ఇప్పుడు ఫ‌లితం అనుభ‌విస్తున్నారు. ఈఎస్ఐ స్కాం, వాహ‌నాల త‌ప్పుడు రిజిస్ట్రేష‌న్లు, హ‌త్య కేసులు, రుణాల పేరిట మోసాలు… ఇలా ర‌క‌ర‌కాల కేసుల్లో ఇప్ప‌టికే చాలా మంది తెలుగుదేశానికి చెందిన నేత‌లు జైలు పాల‌య్యారు. బెయిలుపై బ‌య‌ట‌కు వ‌చ్చారు.

అవ‌న్నీ ఒక ఎత్త‌యితే అమ‌రావ‌తి ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ కు సంబంధించి జ‌రుగుతున్న ద‌ర్యాప్తు ఎంత మంది మెడ‌కు చుట్టుకుంటుందో తెలియ‌దు. ఇదే కోవ‌లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును కూడా అక్ర‌మాస్తుల కేసు వెంటాడుతోంది. ఈ కేసులో బాబును జైలుకు పంపేవరకూ తాను వదిలేది లేదని ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

కోర్టు ముందు బాబు ఆస్తుల చిట్టా

చంద్రబాబుపై తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్‌పై హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని, ఆయన ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలని లక్ష్మీ పార్వతి పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆయనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయాలని కోరారు. చంద్రబాబుపై స్టే వేకెట్‌ అయిన వివరాలను ఆమె స్వయంగా కోర్టుకు సమర్పించారు. 1978 నుంచి 2005 వరకు బాబు ఆస్తుల వివరాలను ఆమె కోర్టు ముందుంచారు. విచార‌ణ అనంత‌రం చంద్రబాబునాయుడి అక్రమాస్తుల కేసు విచారణ ఈ నెల 21కి వాయిదా పడింది. ఈ కేసులో చంద్ర‌బాబుకు శిక్ష ప‌డ‌డం ఖాయ‌మ‌ని ల‌క్ష్మీపార్వ‌తి ఖ‌రాకండిగా చెబుతుండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. కేసు విత్‌డ్రా చేసుకోమని గతంలో చంద్రబాబు నాకు ఫోన్‌ చేసి ఒత్తిడి చేశారని, తాను మాత్రం వెన‌క్కి త‌గ్గేది లేద‌ని చెబుతున్నారు.

ద‌ర్యాప్తు ముమ్మ‌రం

2004 ఎన్నికల అఫిడవిట్‌లో చంద్రబాబు చూపిన ఆస్తులుపై లక్ష్మీపార్వతి ఏసీబీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 1987 నుండి 2005 వరకు చంద్రబాబు అక్రమంగా తన వ్యక్తి గత ఆస్తులను పెంచుకున్నారంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏసీబీ కేసు కొనసాగుతున్న నేపథ్యంలో 2005లో హైకోర్టు నుండి చంద్రబాబు స్టే తెచ్చుకున్నారు. అయితే ఇటీవలే ఆ స్టే వెకేట్‌ అయింది. అలాగే నేతల కేసుల విచారణలో భాగంగా చంద్రబాబు అక్రమాస్తుల కేసు మళ్లీ తెరమీదకు వచ్చింది. ప్రజా ప్రతినిధుల కేసుల విచారణలో భాగంగా దర్యాప్తు ముమ్మరం కానుంది. దీంతో ఈ కేసుకు సంబంధించి కీల‌క ఆధారాలు ల‌క్ష్మీ పార్వ‌తి కోర్టుకు స‌మ‌ర్పించిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో దీనిపై అంత‌టా ఉత్కంఠ ఏర్ప‌డింది.