iDreamPost
iDreamPost
గంభీరమైన తన రాతల్లో నీతులు ఒలికించే ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ.. ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తన కలంతో గోతులు తవ్వుతుంటారు. తన కొత్తపలుకులో ముఖ్యమంత్రులు ఇరువురిపై ఎడాపెడా ప్రతివారం విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్న ఈయన ఈ వారం నీతి సూత్రాలు మరీ ఎక్కువగా వల్లించేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలూ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేశాయని, టీఆర్ఎస్ అయితే మరీ ఎక్కువగా అంటే దాదాపు రూ. 200 కోట్లు వెచ్చించిందని లెక్క కూడా కట్టేశారు. బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ రూ. 30- 40 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని అయితే ఆ డబ్బును పకడ్బందీగా పంచారని కితాబిచ్చారు. అదే కేసీఆర్ పంచిన సొమ్ములో కొంత భాగం మధ్యలో వారు నొక్కేశారని ఈయన స్వయంగా చూసినట్టు వివరించారు. అదే బద్వేల్ ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీలో లేకపోవడం వల్ల డబ్బు పంపిణీ అవసరం పడలేదు అని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ..
ఈ వారం రాతల్లో రాధాకృష్ణ ఎక్కువ భాగం కేసీఆర్ ను టార్గెట్ చేయడానికి కేటాయించారు. ఒకపక్క పీసీసీ అధినేత రేవంత్ రెడ్డిని, మరోవైపు బీజేపీ నేత ఈటెల రాజేందర్ ను వెనకేసుకొస్తూ కేసీఆర్ పై విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో ఈటెల గెలిచినా ఇక కేసీఆర్ పని అయిపోయినట్టే అన్నట్టు రాసేశారు. హరీశ్ రావు కాంగ్రెస్ వైపు చూస్తున్నందునే హుజూరాబాద్ ఎన్నికల్లో గెలుపు బాధ్యత ఆయనపై పెట్టారని వ్యాఖ్యానించారు.
ఓట్ల కోసం ఇలా డబ్బు పంచడం వల్ల ఎన్నికల్లో ఎవరు గెలిచినా అంతిమంగా ప్రజాస్వామ్యం ఓడిపోతుందనీ ఒక గొప్ప నీతి వాక్యాన్ని రాశారు. నిజమే ఓట్లను కొనుగోలు చేయడం ఎవరు చేసినా ముమ్మాటికీ తప్పే. మరి తన యజమాని చంద్రబాబునాయుడు అధికారంలో ఉండగా నంద్యాల ఉప ఎన్నికలో చేసిన నిర్వాకం గురించి మాట మాత్రంగానైనా ఎందుకు ప్రస్తావించరో? మొత్తం కేబినెట్ ను 20 రోజుల పాటు అక్కడ మొహరించి రూ.
వందల కోట్లు వెచ్చించి గెలుపు కోసం అన్ని రకాల అడ్డదారులు తొకినప్పుడు ఈ నీతులు గుర్తుకు రాలేదా? ఓటుకు నోట్ల కేసులో బాబుగారు ఆడియో ఆధారాలతో దొరికిపోయినప్పుడుగానీ, మంగళగిరిలో చినబాబు లోకేశ్ గెలుపు కోసం రూ.వందల కోట్లు ఖర్చు చేశారని మీడియా కోడై కూసినప్పుడు గానీ తమ పత్రికలో ఒక్క వాక్యం కూడా ప్రచురించలేదెందుకు?
కేసీఆర్, జగన్ ఒక్కటేనంటూ అక్కసు..
నీటి ప్రాజెక్టుల పేరుతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నా రాజకీయంగా వారిద్దరూ స్నేహంగానే ఉంటున్నారని రాశారు. వారి సొంత మీడియాల్లొ వస్తున్న వార్తలను పరిశీలిస్తే ఈ విషయం అర్థం అవుతుందని రాసి ఆ మీడియా హౌస్ ల పైనా, సీఎంల పైనా తన అక్కసు వెళ్లగక్కారు. ధనబలంతో కేసీఆర్, అధికారబలంతో జగన్ ప్రతిపక్షాలను తొక్కేయాలనుకుంటున్నారని రాసేశారు. నవరత్నాలతో జగన్మోహనరెడ్డి, దళితబంధుతో కేసీఆర్ బలపడాలని చూస్తున్నారని బాధపడిపోయారు. సంక్షేమ పథకాలతో జనం మెప్పుపొందాలనుకోవడం ఏదో నేరమైనట్టు ఈయన ఆవేదన వ్యక్తం చేయడం ఎందుకో అర్థం కాదు. అంటే ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి,అభివృద్ధి,సంక్షేమాలను అటకెక్కించి అందరూ చంద్రబాబు మార్కు పాలనే సాగించాలనేది ఈయన ఉద్దేశమా?
ఆంధ్రప్రదేశ్ లో ప్రజా వ్యతిరేకత పెరిగిపోతోందంట
అంధ్రప్రదేశ్ లో జగన్మోహనరెడ్డి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోతోందని రాధాకృష్ణ అడ్డగోలుగా రాసేశారు. ఒక పార్టీకి ప్రజాదరణ ఉందో?
లేదో? తేలాలంటే ఎన్నికలే గీటురాయి. 2019లో అధికారంలోకి వచ్చినది లగాయితు ఇప్పటివరకు వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విశేష జనాదరణతో జయకేతనం ఎగురవేసింది. తిరుగులేని ప్రజాదరణ ఉందని ఒకటికి రెండుసార్లు నిరూపించుకుంది. మరి ఏ పారామీటర్ల ప్రకారం లెక్కగట్టారో గానీ ఈయనగారు ప్రజా వ్యతిరేకత పెరిగిపోతోందని రాసేశారు. పైగా ఈ కారణంగానే కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెట్టాలనుకుంటున్నారేమోనని ముక్తాయింంచారు కూడా. కేసీఆర్ గతంలో తమను దోపిడీదారులని తిట్టినప్పటికీ ఆయన పార్టీ పెడితే ఉదార స్వభావులైన ఆంధ్రప్రదేశ్ జనం కొద్దోగొప్పో ఓట్లు వేస్తారని ఒక వింత వ్యాఖ్య చేశారు. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ జనం పౌరుషాన్ని కేసీఆర్ కు వ్యతిరేకంగా రెచ్చగొట్టానని రాధాకృష్ణ పొంగిపోయారు.
కక్ష తీరా అక్షరాలు పరచి..
ఇలా తను అనుకుంటున్నవి, ఊహిస్తున్నవి కథనంలో జొప్పించేసి ఇద్దరి ముఖ్యమంత్రులపై తనకు ఉన్న అక్కసును తీర్చుకున్నారు. ఎందుకంటే రెండు రాష్ట్రాల్లోనూ తన బాస్ చంద్రబాబుకు రాజకీయంగా నిలువ నీడ లేకుండా చేసిన కేసీఆర్, జగన్మోహనరెడ్డిలపై ఆయనకు అంత కక్ష. అది ఇప్పటిలో తీరేది కాదు. ఈ రాతలు ఆగేవి కావు. ఎందువల్లనంటే సమీప భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ రెండు చోట్లా బలపడే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే రాధాకృష్ణ కొత్తపలుకు పేరిట రాసే ఫ్రస్టేషన్ రాతలు ముందుముందు కొత్తపుంతలు తొక్కుతుంటాయని ఘంటాపథంగా చెప్పవచ్చు.