iDreamPost
iDreamPost
పట్టువదలని విక్రమార్కుడు చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజంపై వేసుకొని మౌనంగా నడవడం మొదలు పెట్టాడు అన్నట్టుంది ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వైఖరి. ఎప్పటిలాగే తన పడిగట్టు పదాలు.. ఏడుపుగొట్టు రాతలతో ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్రదిష్టపాల్జేసే ప్రయత్నాన్ని ఆయన అలుపు ఎరగకుండా కొనసాగిస్తున్నారు. అక్షరాలకు విషం పూసి మరీ అచ్చోసి జనంలోకి వదిలేసే తన కొత్తపలుకును ఈ వారం కూడా పాత పద్దతిలోనే బరికేశారు.
సంక్షేమ పథకాలపై అక్కసు..
సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోయిందని బాధపడిపొయారు. అధికారం చేపట్టిన రెండున్నరేళ్లకే ఈ దుస్థితి రావడానికి కారణమైన జగన్ ఏమి సమాధానం చెబుతారని ఆవేశ పడిపోయారు. చంద్రబాబు ఖాళీ ఖజానా అప్పజెప్పారనే సొల్లు కబుర్లు జనం నమ్మే స్థితిలో లేరని తాను కనిపెట్టిన విషయాన్ని కూడా మనకు దయతో తెలియజేశారు. జగన్మోహనరెడ్డికి పాలన, అభివృద్ధి చేతకాదని అర్థమై పోయిందని తీర్మానించేశారు. సంక్షేమ పథకాలను ఒక యజ్ఞంలా కొనసాగిస్తూ బడుగు బలహీన వర్గాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి రోజురోజుకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి రాధాకృష్ణ ఎంతగా బెంగటిల్లిపోతున్నారో ఈ రాతలతో తెలుస్తోంది.
అప్పు అంటూ సంక్షేమ పథకాల అమలు రాష్ట్రానికి ఏదో అరిష్టము అన్నట్టు కలర్ ఇవ్వడానికి ప్రయత్నించారు. అప్పులకు సంబంధించి వాస్తవ పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివరిస్తోంది. గత తెలుగుదేశం ప్రభుత్వం నిర్వాకం, కరోనా దెబ్బకు తీవ్రంగా తగ్గిన ఆదాయం, కొత్త ఉద్యోగాల కల్పనతో విపరీతంగా పెరిగిన ఖర్చులు అనివార్యంగా అప్పు చేయాల్సిన పరిస్థితిని కల్పించాయి. అప్పు చేసైనా సంక్షేమ పథకాలను కొనసాగించబట్టే కరోనా కష్టకాలంలో పెద్దఎత్తున ఉపాధి కోల్పోయిన లక్షలాది కుటుంబాలు రోడ్డున పడకుండా ప్రభుత్వం ఆదుకోగలిగింది.
అప్పులనేవి ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కాక కేంద్రం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. మోదీ ప్రభుత్వం ఈ ఏడున్నర ఏళ్లలో రూ.80 లక్షల కోట్ల అప్పు చేసింది. రాష్ట్రాలు కూడా అవకాశం ఉన్న మేర అప్పులు చేసి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చిస్తున్నాయి. చంద్రబాబు కూడా తన ఐదేళ్ల పాలనలో రూ.లక్షా 65 వేల కోట్ల అప్పు చేశారు. చంద్రబాబు ఖాళీ ఖజానా అప్పజెప్పారనే సొల్లు కబుర్లు జనం నమ్మే స్థితిలో లేరని రాధాకృష్ణ రాసేస్తే నిజమై పోతుందా? ఈయన రాసిందే సొల్లు అన్న సంగతి గమనించలేని స్థితిలో జనం ఉన్నారనుకుంటున్నారా? పాలన, అభివృద్ధి జగన్ కు చేతకాదు అంటున్న రాధాకృష్ణ పాలన అంటే గంటల తరబడి సమీక్షలు చేస్తూ అధికారుల సహనాన్ని పరీక్షించడం అనుకుంటున్నారా? స్టార్ హోటల్లో నెలల తరబడి కుటుంబ సమేతంగా కొలువుదీరి ప్రభుత్వ ఖజానా నుంచి బిల్లులు చెల్లించడమా? ప్రభుత్వ ఖర్చుతో ఢిల్లీకి ప్రత్యేక రైళ్లు, విమానాల్లో వెళ్లి టీడీపీ తరపున కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయడమా? అభివృద్ధి అంటే వార్తల సేకరణకు సైకిల్ పై తిరిగిన ఓ జర్నలిస్టు ఆ పత్రికకే యజమాని అయిపోవడమా? రెండు ఎకరాల ఆస్తి నుంచి రూ. లక్షల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి కావడమా? కాళ్ళకు చెప్పులు కూడా లేని తమ్ముళ్లు కార్లలో తిరిగే స్థాయికి చేరడమా?
Also Read : రాధాకృష్ణ ధైర్యం చెప్పడానికి వెళ్లారట!
ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వం లొంగదీసుకుందట..
పీఆర్సీ అమలుకు ముఖ్యమంత్రితో చర్చలు జరపడానికి వెళ్ళే ఉద్యోగ సంఘాల నేతలు నల్లబ్యాడ్జీలు తొలగించడానికి అంగీకరించడం వారి
బలహీనతను సూచిస్తోందని వేమూరివారు అభివర్ణించారు. అసలు ముఖ్యమంత్రిని కలవడానికి ఉద్యోగ సంఘాల నేతలను ఎందుకు అనుమతించడం లేదని వాపోయారు. అదే చంద్రబాబు జమానాలో అయితే ఎప్పుడుపడితే అప్పుడు కలిసేవారని నాటి స్వర్ణయుగం గుర్తుకు తెచ్చారు. ఉద్యోగ సంఘాల నేతలను భయపెట్టి లొంగదీసుకుంటున్నారని రాశారు. అంటే ఇటు ప్రభుత్వాన్ని బదనాం చేయడంతోపాటు, అటు ఆ నేతల సామర్ఢ్యాన్ని ఉద్యోగులు శంకించేలా లింకు పెట్టాలనేది రాధాకృష్ణ ఉద్దేశం అన్నమాట!
జగన్ ఉలిక్కిపడ్డారట..
అమరావతి రాజధాని కోసం రైతులు నిర్వహించిన మహా పాదయాత్రతో సీఎం జగన్మోహనరెడ్డి ఉలిక్కిపడ్డారని, అందుకే రాష్ట్రంలో విద్వేషాలు రగిలించడానికి ప్రయత్నం చేస్తున్నారని రాసేశారు. అందుకు రాయలసీమలో మేధావులను, ఉత్తరాంధ్రలో తమ పార్టీ వారిని ఉపయోగిస్తున్నారని ఒక బండ అబద్దం వల్లించారు. అంటే ఇప్పుడు ఆ ప్రాంతాల్లో మూడు రాజధానులకు మద్దతుగా సాగుతున్న ఉద్యమాలను తన ఈ వ్యాఖ్యలతో జనంలో చులకన చేయాలనేది ఈయన వ్యూహం. రాష్ట్ర గవర్నర్ హెల్త్ బాగోకపోతే హైదరాబాద్ వెళ్లి వైద్యం చేయించుకున్నారని రాసి ఇక్కడ జగన్మోహనరెడ్డి వైద్య సదుపాయాలు కల్పించలేకపోయారని పాయింట్ అవుట్ చేశారు. అయితే హైదరాబాద్ ఇప్పటికీ ఉమ్మడి రాజధానే అన్న సంగతి మర్చిపోయారు. అయినా గవర్నర్ హైదరాబాద్ లో వైద్యం చేయించుకున్నంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ లో వైద్య సౌకర్యాలు లేవని రాధాకృష్ణ నిర్ధారణకు వచ్చేయడం ఏమిటో? అలాగే మాజీ న్యాయమూర్తి చంద్రు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుపై ఇటీవల చేసిన వ్యాఖ్యలను వేమూరివారు తీవ్రంగా ఖండించడమే కాక ఆయనకు ఆంద్రప్రదేశ్ పరిస్థితులపై అవగాహన లేదని తేల్చేశారు. న్యాయ వ్యవహారాలపై వ్యాఖ్యానించడానికి ఇక్కడి రాజకీయ పరిస్థితులపై అవగాహన దేనికో రాధాకృష్ణకే తెలియాలి!
ఆంధ్రా పోలీసుల మాదిరి తెలంగాణ పోలీసులు చెడిపోలేదట!
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ విచారణను అడ్డుకున్నారని తనపై నమోదైన ఎఫ్ఐఆర్ పై రాధాకృష్ణ విచిత్రంగా స్పందించారు. పంచనామా పూర్తి అయ్యేవరకు తనను అక్కడే ఉండమని రిక్వెస్ట్ చేసిన సీఐడీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తాను విచారణను అడ్డుకున్నట్టు ఫిర్యాదు చేయడం ఏమిటని రాధాకృష్ణ ఆశ్చర్యపోయారు. అలా ఫిర్యాదు చేసినందుకు సత్యనారాయణ ఆరోజు నిద్ర పోయి ఉండరని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఒత్తిడి మేరకే ఆయన అలా ఫిర్యాదు చేశారని, రేపు ప్రభుత్వం మారితే ఇన్స్పెక్టర్ సత్యనారాయణ నిజం చెబుతారని జోస్యం చెప్పారు.
జగన్ తన పగ, ప్రతీకారం తీర్చుకోవడానికి పోలీసులను వాడుకుంటున్నారని రాసేశారు. తనపై కేసు నమోదు చేయడంపై ఆరోజు అక్కడ ఉండి పరిస్థితిని ఆసాంతం గమనించిన జూబ్లీహిల్స్ పోలీసులు ఆశ్చర్యపోయారని ప్రకటించారు. ఆంధ్రా పోలీసుల మాదిరి తెలంగాణ పోలీసులు చెడిపోలేదని కూడా వ్యాఖ్యానించారు. ఈ కేసును ఎదుర్కోవడానికి తాను న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తానని రాశారు. ఇలా ప్రభుత్వాన్ని, పోలీసులను, రాయలసీమ మేధావులను, వైఎస్సార్ నేతలను, ఉద్యోగ సంఘాల నాయకులను, ఒక మాజీ న్యాయమూర్తిని తన రాతల్లో జొప్పించారు. వారిని కించపరుస్తూ ఇస్టానుసారం వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కారణంగా వారిపై తన కడుపుమంటను ఆ విధంగా తీర్చుకుని రాధాకృష్ణ తెగ ఆనందపడిపోయారు.
Also Read : తిరుపతి సభ మీద ABN దమ్ములేని ఆక్రోశపు కథనాలు..