iDreamPost
android-app
ios-app

ABN RK Kotha Paluku, Chandrababu Crying – చంద్రబాబు కన్నీళ్లకు రాధాకృష్ణ భాష్యం

  • Published Nov 21, 2021 | 10:24 AM Updated Updated Nov 21, 2021 | 10:24 AM
ABN RK Kotha Paluku, Chandrababu Crying – చంద్రబాబు కన్నీళ్లకు రాధాకృష్ణ భాష్యం

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మీడియా సాక్షిగా శుక్రవారం పెట్టుకున్న కన్నీళ్లను తుడిచే శక్తి ఓటర్లకే ఉందని, ఆయన కన్నీటికి పరిహారంగానైనా మరోసారి బాబును ముఖ్యమంత్రిని చేయాలనేది ఈ వారం కొత్తపలుకు సారాంశం. ఆంధ్రజ్యోతి ఎండీగానే కాక తెలుగుదేశం పార్టీ సిధ్ధాంత కర్తగా విమర్శకులు భావించే వేమూరి రాధాకృష్ణ ఈ వారం కూడా రాష్ట్ర ప్రభుత్వంపై శక్తి వంచన లేకుండా విషం కక్కారు. చంద్రబాబుకు జరిగిన అవమానం మహాభారతంలో ద్రౌపదికి జరిగిన వస్త్రాపహరణంతో పోల్చి ఉన్నతీకరించారు. అసెంబ్లీని కౌరవ సభగా చిత్రీకరించారు. నిండు సభలో చంద్రబాబునాయుడుకు తీరని అవమానం జరిగిందని బాధాకృష్ణ వాపోయారు.

సీఎం జగన్ విర్రవీగుతున్నారట..

కుప్పం మునిసిపాలిటీలో వైఎస్సార్ సీపీ విజయంతో సీఎం జగన్ విర్ర వీగుతున్నారని రాధాకృష్ణ సూత్రీకరించారు. ఇప్పుడు కుప్పంలో టీడీపీ ఓడిపోవడం 1996లో వైఎస్ రాజశేఖరరెడ్డి కడప నుంచి 5,445 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఎంపీగా గెలవడం ఒకటేనని నిర్థారించేశారు. ఆ విధంగా చూసుకున్నప్పుడు కుప్పంలో టీడీపీ ఓటమి చెందినట్టు కాదనేది ఈయనగారి లాజిక్. అంటే రాజశేఖరరెడ్డి గెలుపు = కుప్పంలో టీడీపీ ఓటమి అన్న మాట! అందువల్ల కుప్పంలో గెలిచినందుకు వైఎస్సార్ సీపీ అధినేతగా జగన్మోహనరెడ్డికి ఆనందపడే అర్హత లేదన్నమాట. అయినా జగన్ సంతోష పడుతున్నాడంటే విర్ర వీగడం కాక మరేమిటి అన్నది రాధాకృష్ణ పాయింట్. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి.. ఒక మీడియా హౌస్ కు యజమాని కావడం అంటే మాటలా? ఇలాంటి తెలివితేటలు ఉన్నాయి కనుకనే ఆయన ఆ స్థాయికి వెళ్లారు.

అసెంబ్లీపైనా వ్యాఖ్యలు..

కౌరవ సభతో అసెంబ్లీనీ పోల్చడమేకాక చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రస్థావన తేవడం దుశ్శాసన పర్వం కింద అభివర్ణించారు. కురు సభలో ద్రౌపది.. తానోడి నన్నోడెనా? నన్నోడి తానోడెనా? అని ప్రశ్నించిందని అసెంబ్లీలో కనీసం ఆ అవకాశం కూడా లేకుండా బాబును తద్వారా భువనేశ్వరిని అవమానించారని వ్యాఖ్యానించారు. చిరునవ్వులు చిందించారంటూ దుర్యోధనుడితో సీఎం జగన్మోహనరెడ్డికి పోలిక తెచ్చారు.
సిగ్గు పడాల్సిన విషయాల్లో కూడా ఎమ్మెల్యేలు బరితెగించి మాట్లాడారని మొత్తం ఆరోజు ఈ అంశంపై సభలో ప్రసంగించిన అందరిపై తన అక్కసు వెళ్లగక్కారు. భువనేశ్వరి వంటి వారికి రక్షణ ఉండదా? ఇళ్లల్లోని మహిళలను అవమానించడానికే అసెంబ్లీ పరిమితం అవుతుందా? అని ప్రశ్నించారు. రాజకీయాలను వికృత క్రీడగా మార్చిన అసెంబ్లీలోని నాయకులకు నమస్కారం అంటూ రాధాకృష్ణ తన అసహనాన్ని వెళ్లగక్కారు. ఆ విధంగా బాబు బహిష్కరించిన అసెంబ్లీపై ఎడాపెడా వ్యాఖ్యలు రాసేసి తన స్వామి భక్తిని చాటుకున్నారు.

Also Read : RK కొత్త పలుకు – తెలంగాణ ప్రజల గొప్పతనం అర్ధం చేసుకుంటే ఏపీ ప్రజలకు మంచిరోజులొస్తాయంట..!

బాబు ఏడుపుపై రాధాకృష్ణ పెడబొబ్బలు..

స్టోన్ ఫేస్ తో ఎప్పుడూ గంభీరంగా ఉండే ఏడు పదులు దాటిన, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 12 ఏళ్లకు పైబడి ప్రతిపక్ష నేతగా పనిచేసిన చంద్రబాబు కన్నీరు పెట్టడం ఆంధ్రప్రదేశ్ ప్రజల దుస్థితికి నిదర్శనంగా రాధాకృష్ణ అభివర్ణించారు. చంద్రబాబు ఏడవడాన్ని డ్రామా అంటున్నవారు కుసంస్కారులని అసలు కుసంస్కారులు పరిపాలించడం వల్లే రాష్ట్రం ఇలా అయిపోయిందని ప్రభుత్వంపై తన ఆక్రోశం బయట పెట్టారు. అసలు మీరెందుకు ఏడ్చారని రాధాకృష్ణ చంద్రబాబునాయుడిని ప్రశ్నించారట.

అధికారం నా కోసం, నా కుటుంబం కోసం కాదు. ప్రజల కోసమే. నా భార్యను అంత దారుణంగా నిందిస్తే తట్టుకోలేక పోయాను. అలాంటి వ్యాఖ్యలు విని ఆపుకోలేక పోయాను. వచ్చే ఎన్నికల్లో జనాన్ని రాష్ట్రానికి నా అవసరం ఉందనుకుంటే నన్ను గెలిపించుకోండి అని అడుగుతాను’ అని చెప్పారట. అవిధంగా బాబుతో జరిపిన సంభాషణను బయట పెట్టి ఆయనను గెలిపించుకోవాలని పరోక్షంగా పాఠకులకు సూచించారు. అంతేకాక ఇప్పటికే వయసు పైబడిన చంద్రబాబు ఒక పర్యాయానికి మించి ముఖ్యమంత్రిగా పనిచేయలేకపోవచ్చని అందువల్ల వచ్చే ఎన్నికల్లో ఆయనను గెలిపిస్తే బావుంటుందని పరోక్షంగా ఓటర్ల ను వేడుకున్నారు.

చంద్రబాబు విజన్ ను రాజశేఖరరెడ్డి మెచ్చుకున్నారట!

ఆంగ్లం అంత బాగా మాట్లాడలేకపోయినా చంద్రబాబు అంతర్జాతీయ సంస్థలను తీసుకువచ్చి రాష్ట్రం తలెత్తుకొనెలా పరిపాలించారని సర్టిఫికెట్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అంతర్గత సంభాషణల్లో బాబు పరిపాలనా విధానాన్ని మెచ్చుకొనేవారని రాసేశారు. ఒక పారిశ్రామిక వేత్త వద్ద కూడా రాజశేఖరరెడ్డి ఈ విషయం ప్రస్తావించి బాబు విజన్ ను మెచ్చుకున్నారన్న ఒక వాస్తవాన్ని ప్రపంచానికి రాధాకృష్ణ వెల్లడించారు! బహుశా ఈ విషయం రాజశేఖరరెడ్డికి అయినా తెలుసో? లేదో?!

Also Read : RK Kothapaluku – రాతల్లో నీతులు.. ముఖ్యమంత్రులకు గోతులు..

వివేకా హత్య కేసు విచారణను సీఎం ప్రభావితం చేస్తున్నారట..

వివేకానందరెడ్డి హత్య కేసులో టీడీపీ వాళ్ళ ప్రమేయం ఉందేమోనని సీఎం జగన్మోహనరెడ్డి వ్యాఖ్యానించి నిందితులను వెనకేసుకు వస్తున్నారని, విచారణను ప్రభావితం చేస్తున్నారని రాధాకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనివల్ల ఈ కేసులో ముఖ్యమంత్రికే ప్రమేయం ఉందేమోనని అనుమానం రాదా? అని ప్రశ్నించారు కూడా. మరి ఈ హత్యకేసులో నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా రోజంతా మీ ఏబీఎన్ చానెల్ లో చర్చలు పెట్టడం విచారణను ప్రభావితం చేయడం కిందకు రాదా? ఎవరిని రక్షించడానికి ఆ చర్చలు నిర్వహించారనుకోవాలి? ఒక్క చర్చలే కాకుండా దోషులు వీరే అని నిర్థారించే హక్కు ఆ ఛానల్ కు ఎవరిచ్చారు?

జనానికి శాపనార్థం..

రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన చంద్రబాబునాయుడు వంటి నేత గెలిస్తే కాని మళ్లీ అసెంబ్లీకి రానని శపథం చేసి వెళ్లిపోయారు కనుక ఆయనను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని రాధాకృష్ణ గుర్తు చేశారు. మేధావులు, ఒక వర్గం ప్రజలు ఓటు వేసేటప్పుడు సరిగా ఆలోచించక పోబట్టే రాష్ట్రానికి ఈ దుస్థితి దాపురించిందని తేల్చేశారు. సమాజంలో జడత్వం ఉన్నప్పుడే ఇలాంటి ప్రభుత్వాలు వస్తాయని ఓటర్లను నిందించారు. ఎన్టీఆర్ కుమార్తెపై దారుణ నిందలు వేసినవారు ఫలితం అనుభవించక పోరు అంటూ బాబు సతీమణి భువనేశ్వరి కోలుకోవాలని కోరుకుంటూ అని రాధాకృష్ణ భావోద్వేగంతో తన కొత్త పలుకును ముగించారు. దానాదీనా చెప్పొచ్చేది ఏమంటే రాష్ట్రంలో ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న చంద్రబాబునాయుడుకు అవమానం జరిగింది కనుక అందుకు పరిహారంగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి ఆయనను ముఖ్యమంత్రిని చేయాలి. లేదంటే ఈ రాష్ట్రంలోని ప్రజలకు ముఖ్యంగా మేధావులకు నిష్కృతి లేదు.

Also Read : RK Kotha Paluku – పట్టాభికి వత్తాసు.. ఎప్పటిలా తిరకాసు..