iDreamPost
iDreamPost
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటెల రాజేందర్ గెలవడంతో తెలంగాణలో ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ పని అయిపోయినట్టేనని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్థారించేశారు. హుజూరాబాద్ లో రాజేందర్ గెలుపును బీజేపీ కన్నా రాధాకృష్ణ ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారని ఈ వారం కొత్త పలుకు చదివితే మనకు అర్థమవుతుంది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమిని ఆసరాగా చేసుకుని కేసీఆర్ ను పలు కోణాల్లో పలుచన చేసేలా ఆర్కే తన విశ్లేషణ కొనసాగించారు. ప్రస్తుతం తెలంగాణ సమాజం కేసీఆర్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయిందని, ఎక్కువ మంది ఆయనను వ్యతిరేకిస్తున్నారని కూడా తేల్చేశారు.
కేటీఆర్ కోసం సీనియర్లను సాగనంపుతున్నారట..
కేసీఆర్ తన తనయుడు కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయడం కోసం సీనియర్లను టీఆర్ఎస్ నుంచి బయటకు పంపుతున్నారని, ఈటెలను అలాగే బయటకు పంపి ఓటమిని కొనితెచ్చుకున్నారని రాశారు. ఈటెలను కేబినెట్ నుంచి అవమానకరంగా బయటకు పంపడాన్ని మొత్తం తెలంగాణ సమాజం జీర్ణించుకోలేక పోయిందని ఈయన పరిశోధించి కనిపెట్టిన విషయాన్ని బయట పెట్టారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేసీఆర్ పట్ల చంద్రబాబు వ్యవహరించినట్టే.. ఇప్పుడు ఈటెల పట్ల కేసీఆర్ వ్యవహరించారని సూత్రీకరించారు. అప్పట్లో కేసీఆర్ కు చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చుంటే హాయిగా ఎంజాయ్ చేసేవారని, తెలంగాణ ఉద్యమం ఉండేది కాదని రాశారు. అలాగే ఈటెలను కేబినెట్లో ఉంచుకుని ఉంటే హుజూరాబాద్ ఓటమి ఉండేది కాదని కేసీఆర్ లోపాన్ని ఎత్తిచూపారు.
Also Read : RK Kotha Paluku – పట్టాభికి వత్తాసు.. ఎప్పటిలా తిరకాసు..
జనం అధికార పార్టీని ఓడించాలని నిర్ణయానికి వచ్చేశారట..
హుజూరాబాద్ లో గెలుపు బీజేపీది కాదని..అధికార పార్టీకి వ్యతిరేకంగా ఏ పార్టీ అభ్యర్థి బలంగా ఉంటే అతడిని గెలిపించాలని జనం ముందుగా నిర్ణయించుకోవడం వల్ల అక్కడ ఆ పార్టీ విజయం సాధించిందని విశ్లేషించారు. తెలంగాణలోని చాలా నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉందని టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఏ పార్టీ బలమైన అభ్యర్థిని నిలబెడితే ఆ పార్టీ విజయం సాధిస్తుందని అని ఒక నిజాన్ని వెల్లడించారు! అంటే తెలంగాణ జనం మొత్తం టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఏ పార్టీ అభ్యర్థిని అయినా గెలిపిస్తారని.. ఆ లెక్కన కేసీఆర్ పని అయిపోయినట్టేనని రాసేసి ఈయన ఆనంద పడిపోయారు. అంటే కేసీఆర్కు వ్యతిరేకంగా అన్ని పార్టీలూ ఏకం కావాలి అనేది కొత్త పలుకు సారాంశం అన్నమాట. పైగా టీఆర్ఎస్ సామ,దాన,భేద, దండోపాయాలను ఉపయోగించిందని, రూ. వందల కోట్లు ఖర్చు చేసిందని, ఓటుకు రూ.6వేల నుంచి రూ.10 వేల వరకు వెచ్చించారని
లేదంటే ఈటెల 50 వేల ఓట్ల మెజారిటీతో గెలిచేవారని కూడా లెక్క గట్టేశారు.
ఇలా కేసీఆర్ పై విషం చిమ్మడమే ధ్యేయంగా తన కలాన్ని రాధాకృష్ణ పరుగులు పెట్టించారు. అధికార పార్టీ ఉప ఎన్నికలో ఓడిపోతే ఇక ఆ పార్టీకి భవిష్యత్తు లేదని, ప్రజలంతా ఎదురుతిరిగి పోయారని రాయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. పైగా అక్కడ గెలిచిన ఈటెల గతంలో వరుసగా ఆరుసార్లు అదే స్థానంలో విజయం సాధించారు. ఆయనా డబ్బులు ఖర్చు చేశారు. కేసీఆర్ అంటే గిట్టని రాధాకృష్ణ లాంటి మీడియా పెద్దలు అంతా ఏకమై ఈటెలకు మద్దతుగా నిలిచారు. మరోపక్క బీజేపీ అండదండలు ఉన్నాయి. ఈ వాస్తవాలు అన్నీ ప్రస్తావించకుండా తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్ ను వ్యతిరేకిస్తోందని, దళితబంధు పథకం ఆదుకోలేక పోయిందని, అదే ఆయనకు గుదిబండ కాబోతోందని వేమూరి వారు జోస్యం చెప్పేయడం ఏమిటో?
Also Read : RK Kothapaluku – రాతల్లో నీతులు.. ముఖ్యమంత్రులకు గోతులు..
ఆంధ్రా ప్రజలకు సలహా..
తెలంగాణ ప్రజల గొప్పతనాన్ని ఆంధ్రప్రదేశ్ సమాజం అర్థం చేసుకుంటే వారికి కూడా మంచిరోజులు వస్తాయని రాశారు. ఆ విధంగా జగన్మోహనరెడ్డి ప్రభుత్వంపై తన అక్కసును రాధాకృష్ణ మరోసారి వెళ్లగక్కారు. అంటే ఈయనకు ఇష్టమైన పార్టీని గెలిపించే ప్రజలు విజ్జులు..ఈయన ద్వేషించే వైఎస్సార్ సీపీని బంపర్ మెజారిటీతో గెలిపించిన జనం తెలివి తక్కువ వారు కింద లెక్క! రాధాకృష్ణ ఆలోచనలకు అనుగుణంగా ఓటు వేయని.. అంటే చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా ఉండే ప్రజలు అమాయకులు అన్నమాట! వారిని చూసి బాధాకృష్ణ వారం వారం ఇలా తెగ జాలిపడి పోతుంటారు…