iDreamPost
android-app
ios-app

ఒక కలం..రెండు కలలు – వన్నె తగ్గని ‘కుట్ర’పలుకు

  • Published Feb 06, 2022 | 3:13 AM Updated Updated Mar 11, 2022 | 10:19 PM
ఒక కలం..రెండు కలలు – వన్నె తగ్గని ‘కుట్ర’పలుకు

తన కలం నిండా పక్షపాతం సిరా నింపుకొని తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలపై అక్షరాలా విషం చిమ్మే ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం కూడా షరా మామూలుగా రెచ్చిపోయారు. తన కలం పోటుతో రెండు ప్రభుత్వాలను కూల్చేయాలని కలలుగనే ఆయన తన కుట్రపలుకుకు మరింత పదును పెట్టారు. పీఆర్సీ అమలుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలో మనకెవ్వరికీ కనబడని రకరకాల కోణాలను ఆయన కనిపెట్టారు. దానికి తన పైత్యాన్ని ఇతోధికంగా జోడించారు.

గురువారం విజయవాడలో ఉద్యోగులు నిర్వహించిన ఆందోళన విజయవంతం కావడం వెనుక అన్ని వర్గాల ప్రజల మద్దతు ఉందని నిర్ధారించేశారు. ప్రశ్నించేవారిని అణచివేయడానికి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని జగన్ ప్రభుత్వం ఉపయోగిస్తోందని తరచుగా రాసే అబద్దాన్ని ఈ వారమూ రాసేశారు. రెండున్నరేళ్లుగా ప్రదర్శిస్తున్న ఈ అధికార జులుం కు ఉద్యోగులు తాము నిర్వహించిన ర్యాలీ ద్వారా చెక్ పెట్టారని వ్యాఖ్యానించారు. ప్రజల్లో ఉన్న అసహనం ఉద్యోగుల ఆందోళన రూపంలో ప్రతిబింబించిందని భాష్యం కూడా చెప్పేశారు. ఉద్యోగులు నిర్బంధాలను తట్టుకొని మారువేషాల్లో కూడా ర్యాలీకి వచ్చారంటే వారి కసి అర్థమవుతోంది అని రాధాకృష్ణ చంకలు గుద్దుకున్నారు.

ఉద్యోగుల తెగువకు ప్రజలు జేజేలు పలికారని రాసి మనల్ని నమ్మించడానికి ప్రయత్నించారు.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరిలో మార్పురాకపోతే ఈ ప్రభుత్వం వేగంగా పతనం అవుతుందని రాధాకృష్ణ తన పచ్చనోటితో ఒక శాపనార్థం పెట్టేశారు.

మధ్యలో అమరావతి పలవరింత..

ఈ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం మొదటిసారిగా అమరావతి రైతులు నిర్వహించిన న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రలో బయట పడిందట! అంటే పచ్చబ్యాచ్ దర్శకత్వంలో సాగిన ఆ పాదయాత్ర పరమ సూపర్ హిట్ అయినట్టు మనం ఒప్పేసుకోవాలన్న మాట. ఎందుకంటే కొన్నివేల కోట్ల రూపాయల పసుపు పచ్చ కలలు కల్లలైపోవడాన్ని రాధాకృష్ణ జీర్ణించుకోలేకపోతున్నారు మరి. ఇలా రాతల్లో అయినా రాజధాని అమరావతిని సజీవంగా ఉంచుకుంటారాయన. ఆయనకు అదో తుత్తి!

పోలీసులపై వ్యూహాత్మక ప్రేమ..

రాష్ట్రంలో పోలీసులు స్వతంత్రంగా వ్యవహరించడం లేదు. సీఎం జగన్మోహనరెడ్డి చెప్పినట్టు వింటున్నారు అని ఇన్నాళ్లూ శోకరణాలు పెట్టిన రాధాకృష్ణ ఈ వారం మాత్రం తన రాతలకు సమర్థింపుగా వారిపై వ్యూహాత్మక ప్రేమను ఒలకబోశారు. ముఖ్యంగా అన్ని జిల్లాల
పోలీసులు..ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సహకరించారని రాసి అందుకు కారణం పోలీసులు కూడా ఉద్యోగుల కదా అని సూత్రీకరించారు. ఇన్నాళ్లు ఊడిగం చేసి చేసి అలసిపోయిన పోలీసులు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారట! పైగా వారికి కూడా పీఆర్సీపై అసంతృప్తి ఉందట.

మూడు లక్షల కోట్లు అప్పు తెచ్చి ఒక్క అభివృద్ధి కార్యక్రమం నిర్వహించలేదు. పోలవరం పూర్తి చేయలేదు అని ప్రజల్లో ఆగ్రహం ఉందని రాశారు. అప్పులు చేసి ఓట్లు తెచ్చే పథకాలపై ఖర్చు చేస్తున్న ప్రభుత్వం తమను కట్టడి చేయడం ఏమిటని ఉద్యోగులు అనుకుంటున్నారట. ఆవిధంగా పేదలకు సంక్షేమ పథకాల అమలు చేయడంపై తనకున్న కడుపు మంటను రాధాకృష్ణ బయట పెట్టుకున్నారు. మీడియాను చెరబట్టి ఉద్యోగుల ఆందోళనను కొన్ని చానల్స్ లో ప్రసారం కాకుండా ప్రభుత్వం అడ్డుకుందని ఒక అభాండం వేసేశారు. ఇది ఎమర్జెన్సీని ఎదిరించిన దేశమని, తాజాగా ఉద్యోగుల ఆందోళనపై ప్రభుత్వం అందుకే దిగివచ్చింది అని ముక్తాయించారు.

సూచనలు.. సలహాలు..

సో.. సీఎం జగన్ పై అన్ని వర్గాల ప్రజల్లో ఉన్న ఆగ్రహం
సినిమా కష్టాల మాదిరిగా ఆయనను చుట్టు ముడుతున్నాయని మనం అనుకోవాలి అని వేమూరి వారి ఉద్దేశం. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఈ ఆగ్రహానికి కారణం జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి అని ఒక ఉచిత సలహా పడేశారు. జగన్ తాడేపల్లి ప్యాలెస్ ను వీడి బయటకు రావాలి. అసలు ఆయన ఎందుకు బయటకు రావడం లేదు. రెండున్నరేళ్లు అయినా పాదయాత్ర చేసిన కాళ్ల నొప్పులు ఇంకా తీరలేదా? అని తన తెలివితేటలు మొత్తం రంగరించి రాధాకృష్ణ ప్రశ్నించారు. చెత్త పన్ను వసూలు, ఓటీఎస్ పై ప్రజల్లో ప్రతిఘటన ఎక్కువగా ఉందని, భయపెట్టి పాలించలేమని తెలుసుకోవాలని సూచన కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి కోలుకోకుంటే ప్రజల్లో ఉన్న అసంతృప్తి, అసహనం కసిగా మారుతుంది అని రాధాకృష్ణ తనదైన శైలిలో నిర్దారించేశారు.

పుట్టగతులు ఉండవనే గుక్కపెట్టి మరీ ..

ఆంధ్రప్రదేశ్ లో ఒక యజ్ఞంలా సాగుతున్న సంక్షేమ పథకాల అమలును టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన పెంపుడు మీడియా అధిపతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే వివిధ వర్గాల ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించిన జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగితే తమకు
పుట్టగతులు ఉండవని వారి బాధ. అందుకే న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రను వెనుక ఉండి నడిపించడం, ఉద్యోగుల ర్యాలీని వారు కూడా ఊహించని స్థాయిలో విజయవంతం అయ్యేలా కొమ్ముకాయడం. ఒక్కో వర్గం ప్రజలను ప్రభుత్వంపై రెచ్చగొట్టాలని చూడడం. అయితే వీరెంతగా అరచి గీ పెట్టినా జనం నమ్మరు. ఎందుకంటే గత ప్రభుత్వ నిర్వాకాన్ని, ప్రస్తుత సర్కారు చిత్తశుద్ధిని వారు ఇప్పటికే అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు.

కేసీఆర్ పైనా కడుపు మంట..

తెలంగాణ సీఎం కేసీఆర్ పై కూడా రాధాకృష్ణ ఎప్పటిలాగే తన ఆక్రోశం వెళ్లగక్కారు. పనిలో పనిగా అక్కడ పీసీసీ పీఠంపై చంద్రబాబు ప్రతిష్టించిన రేవంత్ రెడ్డిని ఒక హీరోగా ఫోకస్ చేసే ప్రయత్నం చేశారు. రేవంత్ ను అడ్డుకోవడమే లక్ష్యంగా కేసీఅర్ పిల్లిమొగ్గలు వేస్తున్నారని రాసి అమాంతంగా రేవంత్ కు మైలేజీ కల్పిద్దామని ట్రై చేశారు. రాజ్యాంగం మార్చాలని డిమాండ్ చేసి అది రాసిన అంబేడ్కర్ ను కేసీఆర్ అవమానించారని రాసేశారు. దీంతో దళితులు కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని లింకు పెట్టేశారు. అంతటితో ఆగక రాజ్యాంగ రచనలో పాల్గొన్న ప్రముఖుల పేర్లు ప్రస్తావించి వారందరి కన్నా కేసీఆర్ తెలివైన వాడా అని ప్రశ్నించారు. ప్రస్తుత దేశ పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగం రాసుకోవాలి అని కేసీఆర్ అనడం వారందరినీ అవమానించడం ఎలా అవుతుందో ది గ్రేట్ రాధాకృష్ణకే తెలియాలి.

అసలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు రాజ్యాంగ బద్దంగా పాలిస్తున్నారా అని ఒక ప్రశ్న ను వేమూరివారు సంధించారు. సీఎంలే అంతా తామై ప్రభుత్వాన్ని నడిపించేస్తున్నారని రాశారు చంద్రబాబు మాదిరిగా జగన్, కేసీఆర్.. రాధాకృష్ణ సలహాలు అడగాలేమో మరి! ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు, జులైలో రాష్ట్రపతి ఎన్నిక ముగిశాక కేసీఆర్ కు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా సినిమా చూపించడానికి స్కెచ్ వేసినట్టు సమాచారం అని బరికేశారు. ప్రధాని, హోం మంత్రి మనసులో మాట రాధాకృష్ణకు ఎలా తెలిసింది అని మనకు సందేహం రాకూడదు. ఎందుకంటే రాధాకృష్ణ లాంటి మేధావులకు కర్ణ పిశాచాలు ఇలాంటి రహస్యాలు చెబుతుంటాయి మరి!