iDreamPost
android-app
ios-app

అమూల్ తో హెరిటేజ్ కు పోలికా?

అమూల్ తో హెరిటేజ్ కు పోలికా?

ఏపీ ప్రభుత్వం దేశంలో ప్రఖ్యాత పాల ఉత్పత్తుల కంపెనీ అమూల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో పాడి రైతుల కష్టాలు తేరిపోవడమే గాక పాడి పరిశ్రమ బలోపేతం కానుందని నిపుణులు, మేధావులు అభిప్రాయపడ్డారు. కానీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చంద్రబాబుకు నిద్రలేమికి గురి చేసింది. తమ ప్రధాన ఆర్థిక వనరుగా ఉన్న హెరిటేజ్ సంస్థ ఆదాయం గణనీయంగా తగ్గిపోనుందనే ఆందోళనలో చంద్రబాబు ఉన్నారు. దీంతో రంగంలోకి దిగిన బాబు గారి వీర విధేయులు రాధాకృష్ణ అలియాస్ ఆర్కే గారు గుజరాత్ రాష్ట్రానికి చెందిన అమూల్ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం తప్పంటూ తమదైన శైలిలో కథనాలు వండి వార్చారు.

రాష్ట్రంలో ఉన్న డెయిరీలను కాదని గుజరాత్‌కు చెందిన సంస్థతో ఒప్పందం చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని రాసిన కథనంపై నిపుణులు, మేధావులు మండిపడ్డారు. రైతులకు ఉపయోగపడే నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్ పై విమర్శలు చేయడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా జగన్‌ చేపట్టిన పాదయాత్రలో పాడిరైతులను ఆదుకుంటామని, లీటర్‌ పాలకు రూ.4 బోనస్‌ ఇస్తామని వాగ్దానం చేశారని దానిని ఇప్పటి వరకు అమలు చేయలేదంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. ఈ సందర్భంలో వాస్తవాలలోకి వెళితే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అమూల్‌ నేపథ్యం

భారతదేశం ఒకప్పుడు పాడి పరిశ్రమ ఉత్పత్తుల లోటుతో ఇబ్బందులు పడేది. పాలపొడి కూడా విదేశాల నుంచి దిగుమతులు చేసే పరిస్థితి నెలకొంది. దిగుమతితో ఖర్చు భారీగా పెరిగి పోతుండటంతో పాలపొడి సామాన్యులకు అందుబాటులో ఉండేది కాదు. దీంతో భారతదేశంలో క్షీర విప్లవానికి నాంది పలికి, పాడి పరిశ్రమ సమగ్రాభివృద్ధికి వర్గీస్ కురియన్ అనే మహనీయుడు ఎంతో కృషి చేశారు. ఆయన వినూత్న ఆలోచనలతో మన దేశం పాల ఉత్పత్తులలో అగ్రస్థానానికి చేరుకుంది. కురియన్ దూరదృష్టితో పాల ఉత్పత్తుల కంపెనీ అమూల్‌ ని ప్రారంభించారు.

కురియన్ నేతృత్వంలో ‘అమూల్’ సంస్థ అంతకంతకు ఎదిగి దేశంలోనే ప్రఖ్యాత పాల ఉత్పత్తుల కంపెనీగా అవతరించింది. భారత రైతాంగాన్ని పరిపుష్టం చేసిన ఘనత దక్కించుకున్న కురియన్ ఆలోచనలతో అమూల్ కంపెనీ పాల ఉత్పత్తులను దేశంలో ప్రతి ఒక్కరూ వినియోగించే స్థాయికి చేరుకుంది. గుజరాత్ లో మొదలైన ఈ క్షీర విప్లవాన్నీ దేశవ్యాప్తంగా అభివృద్ధి చేయాలని అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కురియన్ ను కోరారు. దీంతో దేశవ్యాప్తంగా మన దేశం పాల ఉత్పత్తులలో ముందంజ వేసింది.

హెరిటేజ్ కు వచ్చిన ఇబ్బందేంటి

రెండు తెలుగు రాష్ట్రాలలో పాలు, పాల ఉత్పత్తులలో హెరిటేజ్ కంపెనీ అగ్రస్థానంలో ఉంది. 2014లో చంద్రబాబు అధికారంలోకి రాగానే హెరిటేజ్ ఉత్పత్తులను కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకుంది. దీంతో హెరిటేజ్ కంపెనీ ఆదాయం భారీగా పెరిగింది. టీటీడీలో పాలు, నెయ్యి కూడా హెరిటేజ్ సంస్థ అందించేది. ప్రభుత్వ పాల కేంద్రాలను మూతవేసి చంద్రబాబు ప్రభుత్వం హెరిటేజ్ కే పెద్ద పీట వేసిందని విమర్శలు వచ్చినా టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు.

హెరిటేజ్ లో ప్రధాన వాటాను ఫ్యూచర్ గ్రూప్ కు విక్రయించినా పాలు, పాల ఉత్పత్తులను చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి చూసుకుంటున్నారు. రాష్ట్రంలో ‘హెరిటేజ్’ మోనోపాలితో పాడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పాడి రైతుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేసి హెరిటేజ్ మార్కెట్ లో ఎక్కువ ధరకు అమ్ముతున్నారని విమర్శలు ప్రచారం జరుగుతున్నాయి.

జగన్ సర్కార్ చొరవ

పాడి రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకొని ఏపీ ప్రభుత్వం దేశంలో ప్రఖ్యాత పాల ఉత్పత్తుల కంపెనీ అమూల్‌తో ఒప్పందం చేసుకుంది. వారికి కష్టానికి తగ్గ ధరలు అమూల్ ఇచ్చేలా ప్రభుత్వం షరతు విధించింది. ఎన్నికల ప్రచారంలో తాను ఇచ్చిన హామీ మేరకు పాడి రైతులకు నాలుగు రూపాయలే కాక ఐదు రూపాయలు లాభం వచ్చేలా ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వ సహకార డెయిరీలను నిర్వీర్యం చేసి పోటీ వాతారణం లేకుండా చేయడమే కాకుండా తమకు చెందిన కంపెనీ ఉత్పత్తులకు అప్పటి ప్రభుత్వం పెద్ద పీట వేసింది. దీంతో జగన్ సర్కార్ చొరవ చూపించి అమూల్ తో ఒప్పందం చేసుకుంది. అమూల్‌తో భాగస్వామ్యం ద్వారా ఈ రంగంలో మంచి మార్పులను ఆశిస్తున్నామని ..తమకు, సహకార రంగానికి మేలు జరగాలని ఆరాటపడుతున్నామని పాడి రైతులు కోరుకుంటున్నారు.

దేశానికే మకుటం లాంటి ‘అమూల్’ సంస్థను కేవలం గుజరాత్ సంస్థగా ముద్ర వేసి కథనాలను రాసిన శ్రీమాన్ ఆర్కే గారికి తమ కష్టాలు పట్టవా అంటూ పాడి రైతులు, మేధావులు, నిపుణులు మండిపడుతున్నారు.