iDreamPost
android-app
ios-app

విపక్షాలది విశాఖ ఉక్కు పరిశ్రమ మీద ప్రేమనా? జగన్ మీద రాజకీయ పోరాటమా?

  • Published Feb 11, 2021 | 10:37 AM Updated Updated Feb 11, 2021 | 10:37 AM
విపక్షాలది విశాఖ ఉక్కు పరిశ్రమ మీద ప్రేమనా? జగన్ మీద రాజకీయ పోరాటమా?

సరిగ్గా 55 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరు ఉద్యమించి కేంద్రం మెడలు వంచి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ భవితవ్యం నేడు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వలన ప్రమాదంలో పడింది. విశాఖ ఉక్కు పరిశ్రమను గుట్టుచప్పుడు కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేయబోతున్నారు అని తెలుసుకున్న రాష్ట్ర ప్రజలు ఆ నిర్ణయన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే విశాఖ కేంద్రంగా మోడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు కార్మికులతో పాటు ప్రజా సంఘాలు కూడా ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి. అధికార పార్టీ సైతం వారు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా నిలిచింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి జగన్ విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రానికి లేఖ రాయగా, విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ పరం చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని రాజ్యసభలో వైయస్సార్ కాంగ్రెస్ సభ్యులు కేంద్రం దృష్టికి తీసుకుని వచ్చారు.

భారతీయ జనతా పార్టీకి మద్దతు పలికిన జనసేన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై ఢిల్లీ వెళ్ళి కేంద్రం నిర్ణయమే ఫైనల్ అన్న సంకేతాలు ఇవ్వగా ఇక రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం పార్టీ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటికరణ ను జగన్ ప్రభుత్వానికి అంటకట్టే ప్రయత్నంలో నిమగ్నం అయింది. తెలుగుదేశానికి మద్దతుగా ఉన్న పత్రికల్లో, సోషల్ మీడియా ఖాతల్లో జగన్ పై బురదజల్లే కథనాలని ప్రచారంలోకి తీసుకుని వస్తున్నారు. వారు వండి వారుస్తున్న కధనాలు చూస్తుంటే వారిని విశాఖ ఉక్కు పరిశ్రమపై ఉన్న ప్రేమ కన్నా జగన్ పై ఉన్న ద్వేషమే స్పష్టంగా కనిపిస్తుంది.

విశాఖ ఉక్కుపై జగన్ ప్రభుత్వంలోకి రాగానే జరిగిందేంటి?

విశాఖలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు పై జగన్ ప్రభుత్వం రాగానే జరిగిన పరిణామాలు చూస్తే …. చంద్రబాబు అధికారంలో ఉండగానే 2018 లోనే పొస్కో కంపెనీ విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వంతో కలిసి చర్చలు జరిపినట్టు ఎంపీ విజయసాయి రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజ్యసభలో స్పష్టం చేశారు.

2019లో చంద్రబాబు అధికారం కోల్పోయి వైసీపీ అధినేత జగన్ అధికారంలోకి రాగానే జూన్ 20న పోస్కో ప్రతినిధులు సీఎం జగన్ ని కలిసి విశాఖలో తాము స్టీల్ ప్లాంట్ పెట్టాలని అనుకుంటున్నటు ప్రతిపాదించారు. దానికి జగన్ విశాఖలో ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ఉన్నందున మీరు పెట్టాలనుకుంటున్న ప్లాంట్ ని కడపలో పెట్టండి అని కోరారు. దానికి వారు పరీశీలించి చెబుతాం అని చెప్పి వెళ్లారు ఆ నాడు జరిగినది సాక్షి దినపత్రిక ఏ దాపరికం లేకుండా జరిగినది రాసింది.. కానీ ఆంధ్రజ్యోతి మాత్రం రాష్ట్రానికి పోస్కో వారు పెట్టుబడులు పెట్టెందుకు వస్తున్నారని తమకి ముందే తెలుసని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేసిందే కానీ విశాఖ గురించి కాని కడప గురించి కాని రాయలేదు.

2019 అక్టోబర్ లో ముందుగా పోస్కో తో ఒప్పందం అనుకున్నట్టే కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ మిగులు భూముల్లో… పోస్కో వారి స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పంద వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండానే జరిగిందని 2020 ఫిబ్రవరీ 3న లోక్ సభలో రఘురామ కృష్ణం రాజు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు ఉక్కు శాఖా మంత్రి. నాడు ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి పత్రిక కూడా రాసింది. కానీ నేడు తెలియనట్టు ఆ ఒప్పందం ఇప్పటిదాకా ఎవ్వరికి తెలియకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే రహస్యంగా ఉంచారా అంటూ ఇంకో కథ అల్లింది.

కేంద్రప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా ఎవరికి తెలియకుండా, స్టీల్ ప్లాంట్ లో ఉన్న మిగులు భూముల్లో పోస్కో వారి పరిశ్రమను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఇచ్చి ఆ తరువాత విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రయివేటు పరం పేరుతో వారికి మొత్తం కట్టబెటే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. నిజాలు ఇలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం సంబంధం లేని ఈ వ్యవహారాన్ని చంద్రబాబుకు వంతపాడే పత్రికలు , తెలుగు తముళ్ళు కలిసి చేస్తున్న విష ప్రచారం చూస్తుంటే విశాఖ ఉక్కుపై వారికి ఉన్న ప్రేమ కన్న జగన్ పై వారికి ఉన్న ద్వేషమే కనిపిస్తుంది.

ప్రతిపక్షానికి నిజంగా విశాఖ ఉక్కుపై ప్రేమ, చిత్తశుద్ది ఉంటే వారు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్దిని ఆకాంక్షించే వారే అయితే జగన్ గారిలా కేంద్రానికి తమ అభిప్రాయాన్ని లేఖ ద్వారా తెలియచేయాలి. జగన్ గారిలా పోస్కో ప్లాంట్ విశాఖలో కాకుండా రాష్ట్రంలో ఇంకో ప్రాంతంలో పెట్టేలా చూడాలని, అలాగే విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం కాకుండా చూడాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలి.. వారి సభ్యుల చేత తమ వైఖరిని కేంద్రానికి తెలిసేలా చేయాలు. కానీ ఇవ్వన్ని పక్కన పెట్టి సత్య దూరంతో కూడిన కథలు అల్లితే ప్రజలు హర్షించరని వారు గుర్తించాలి.