iDreamPost
iDreamPost
ప్రజలను సంక్షేమ పథకాలు ఇచ్చి కట్టడి చేశారు.. అంతేకదా ఏదోటి పడేస్తున్నారు. కింది స్థాయి వాళ్లందరినీ సంక్షేమ పథకాలనే ఉచ్చులో వేసి వాళ్లందరినీ స్వార్థపరులుగా మార్చేశారు..ప్రజలు అర్థం చేసుకోకుండా ఏదోటి పడేస్తుంటారు కదా.. అందుకే ఎంత ట్రై చేసినా ఎక్కడం లేదు. ఇవీ ఏబీఎన్ రాధాకృష్ణ ఇంటర్యూలో ఆయనతో పాటు అమరావతి రైతుల పేరుతో ఉన్న వారి మాటలు. ప్రజలను, రాష్ట్రాన్ని అవమానించిన తీరు ఇట్టే అర్థమవుతోంది. ఇప్పటికే ఈ తీరుని సీఎం జగన్ గుర్తించారు. అందుకే ఆయన జనవరి 1నాడు ప్రత్తిపాడులో నిర్వహించిన సభలో వీళ్లందరినీ పేదల వ్యతిరేకులుగా పేర్కొన్నారు. పేదలకు ప్రయోజనం దక్కడాన్ని సహించలేకపోతున్నారని విమర్శించారు. నిజానికి జగన్ మాటలు విమర్శలు కాదని, వాస్తవాలని తాజాగా మరోసారి ఏబీఎన్ లో ప్రసారమయిన ఓపెన్ హార్ట్ నిరూపించింది.
అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థల యజమానులు చేస్తున్న హడావిడిని రాష్ట్ర ప్రజలు గుర్తించడం లేదని ఇప్పటికే తేలిపోయింది. చివరకు విజయవాడ, గుంటూరు నగర పాలక సంస్థలు కూడా వైఎస్సార్సీపీ గూటిలో చేరడం దానికి ఇటీవలి ఉదాహరణ. చివరకు మీకు సిగ్గులేదా అంటూ చంద్రబాబు ఎన్నికల ప్రచారంలోనే వాపోయినా జనం ఖాతరు చేయలేదు. ఆయనకే సిగ్గులేదనిపించేలా తీర్పునిచ్చారు. అయినప్పటికీ బుద్ధిమారని టీడీపీ అనుకూల వర్గాలన్నీ బాహాటంగా ప్రజల మీద తమ వ్యతిరేకతను చాటుకోవడానికి పదే పదే ప్రయత్నిస్తున్నాయి.
ఇప్పటికే పప్పుబెల్లాలంటూ ప్రజలకు అందిస్తున్న సహాయాన్ని ఎద్దేవా చేస్తున్నారు. సీఎం కేవలం కూర్చుని బటన్ నొక్కడమే తప్ప ఎటువంటి పనులు చేయడం లేదంటూ కువిమర్శలకు దిగుతున్నారు. మధ్య దళారులు లేకుండా నేరుగా ప్రజలకు మేలు చేసే ఆలోచనను అభినందించాల్సింది పోయి ప్రజలకు చేదోడుగా నిలుస్తున్న ప్రభుత్వం మీద విషంకక్కుతున్నారని ఆ వ్యాఖ్యలు రుజువుచేస్తున్నాయి. కులం, మతం, ప్రాంతం బేధం లేకుండా అందరికీ అన్ని పథకాల్లో అర్హత ఉంటే చాలన్నట్టుగా మారిన పరిస్థితులు పచ్చబ్యాచ్ జీర్ణించుకోలేకపోతోందని రాధాకృష్ణ సహా ఇతర రియల్ ఎస్టేట్ దారుల మాటలు రూఢీ చేస్తున్నాయి.
కరోనా వంటి విపత్తుల్లో ఏపీ ప్రభుత్వం అందించిన సహాయం ఇప్పటికే రాష్ట్రంలో ప్రజలకు కొండంత ఊరటనిచ్చింది. తమకోసం ప్రభుత్వం ఉందనే ధీమా కలిగించింది. మీడియాలో ప్రచారం, సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎలా ఉన్నప్పటికీ ప్రజలకు భరోసా కల్పించే పాలన సాగుతోంది. ఇదే ఇప్పుడు టీడీపీ వర్గాలకు మింగుడుపడడం లేదు. జగన్ సర్కారు జనాలకు మేలు చేయడం వారు సహించలేకపోతున్నారు. దానికి అనుగుణంగానే వారి ఓపెన్ హార్ట్ మాటలున్నాయి. జనాలను స్వార్థపరులని, ప్రభుత్వం వారికి ఏదో పడేస్తుందని ఇలాంటి చవకబారు వ్యాఖ్యలకు సిద్దమవుతున్నారు. ప్రభుత్వమంటే తమ కులస్తుల కోసమో, కొందరి ప్రయోజనాల కోసమో కాకుండా అందరికీ సంక్షేమం అందించాలనే బాధ్యత ఉందని జగన్ నిరూపించడం వారికి నచ్చడం లేదని ఈ పరిణామాలు చాటుతున్నాయి.
నిజానికి ప్రజలను ఈరకంగా నిందించే ధోరణి టీడీపీ అధినేత నుంచే మొదలయ్యింది. ఇప్పుడు రాధాకృష్ణ వంటి వారు అదే బాధను వ్యక్తం చేస్తుండగా, అమరావతి ఆందోళన అంటూ హడావిడి చేసే వాళ్లు కూడా ఆ పాటనే అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా స్వార్థపరులన్నట్టుగా చిత్రీకరించే యత్నం చేస్తున్నారు. చంద్రబాబుకి పదవి కట్టబెడితే త్యాగధనులు లేదంటే స్వార్థపరులని ముద్రవేసేందుకు సైతం వెనుకాడని వారి నైజం రాష్ట్ర ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. తమకు అధికారం లేకపోతే అందరినీ అవమానించేందుకు సైతం వెనుకాడమని చెబుతున్న తీరు వారిలో అసహనాన్ని చాటుతోంది. జనం ఇలాంటి వాటిని అర్థం చేసుకుంటూ ఉన్నందుకే ఇప్పటికీ వారిలో ఆక్రోశం అనేక విధాలుగా బయటపడుతున్నట్టు చెప్పవచ్చు.