iDreamPost
android-app
ios-app

Badvel Bypoll ABN Andhra Jyothy – దిగ్విజయమా. అయిననూ అక్కసు వెళ్లగక్కవలె ….

  • Published Nov 03, 2021 | 7:18 AM Updated Updated Nov 03, 2021 | 7:18 AM
Badvel Bypoll ABN Andhra Jyothy – దిగ్విజయమా. అయిననూ అక్కసు వెళ్లగక్కవలె ….

బద్వేల్ ఉప ఎన్నిక ఫలితం విపక్షాలకే కాదు . కొన్ని మీడియా సంస్థలకు కూడా మింగుడు పడకపోవటం విచిత్రం ఏమీ కాదు కానీ తొంభై వేల పై చిలుకు ఓట్ల మెజారిటీని కూడా తక్కువ చేసి చూపే ప్రయత్నం మాత్రం విడ్డూరం అనిపించక మానదు . మిగతా పత్రికలు , ఛానెల్ల సంగతి పక్కన పెడితే బద్వేల్ ఉప ఎన్నిక ఫలితాలలో వైసీపీ పార్టీకి దక్కిన భారీ మెజారిటీ సైతం వైసీపీ శ్రేణులకు సంతృప్తి కలిగించలేదు . నిరాశని మిగిల్చింది అంటూ ఆంధ్రజ్యోతి రాసుకొచ్చిన కధనాలు చూస్తే పొరపాటున వైసీపీ ఓడిపోయిందేమో ఆ మెజారిటీ బిజెపిదేమో అని అనుమానం కలగొచ్చు .

2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున మొదటిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ వెంకట సుబ్బయ్య నలభై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు . అనంతరం ఆయన అనారోగ్యంతో కన్ను మూయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ పార్టీ వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధను వైసీపీ తరుపున బరిలో దించగా టీడీపీ , జనసేన ఎన్నికల బరి నుండి తప్పుకొన్నాయి . జాతీయ పార్టీలైన బిజెపి , కాంగ్రెసులు మాత్రం పోటీలో నిలిచాయి . ప్రస్తుతం రాష్ట్రంలో ఏ ఎన్నిక అయినా ప్రధాన ప్రత్యర్ధులు వైసీపీ , టీడీపీలుగా జరుగుతుండగా ఈ ఎన్నిక మాత్రం వైసీపీకి పోటీదారుగా బిజెపి నిలిచింది .

గెలుపు ముందే ఖాయమైన ఎన్నిక అయినా తన పాలనకు రిఫరెండంగా భావించిన ముఖ్యమంత్రి జగన్ తిరుపతి ఎన్నిక లాగానే ఈ ఎన్నిక కూడా డబ్బు , మద్యరహితంగా జరగాలని సూచించడంతో పాటు , ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడం ద్వారా 2019 ఎన్నికల్లో డా’ వెంకట సుబ్బయ్యకు వచ్చిన 44000 మెజారిటీ కన్నా ఎక్కువగా వీలైతే రెట్టింపు మెజారిటీతో విజయం సాధించి ఆయనకు ఘనమైన నివాళిగా అందించాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు .

Also Read : Badvel Bypoll – అంత చేసినా.. బిజెపి బలం ఇంతేనా..?

మరోవైపు తాము ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినా తమ మద్దతు మిత్రపక్షమైన బీజేపీకే అని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ మీడియా సాక్షిగా వెల్లడించగా , టీడీపీ పైకి మద్దతు ప్రకటించకపోయినా తమ పార్టీ కేడర్ ను బిజెపికి మద్దతుగా ఆ పార్టీ తరుపున పని చేయించడంతో పాటు బిజెపి కౌంటింగ్ ఏజంట్లుగా కూడా కూర్చోబెట్టడంతో ఎన్నికల్లో బీజేపీ తరపున టీడీపీ పాత్ర స్పష్టమయింది . మరోవైపు తెదేపా నుండి బీజేపీలోకి ఫిరాయించిన ఆదినారాయణ రెడ్డి లాంటి వారు మాకు సెంట్రల్ బలగాల అండ ఉందంటూ హల్చల్ చేయడంతో బాటు పలు వర్గాల నుండి బిజెపికి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేసారు .

వీటన్నిటితో పాటు కొన్ని మీడియా సంస్థల వ్యతిరేక ప్రచారాన్ని కూడా ఎదుర్కొన్న వైసీపీ గత మెజారిటీ 44 వేలకి రెట్టింపు కన్నా ఎక్కువగా 90 వేల పై చిలుకు మెజారిటీతో గెలుపొందడాన్ని ఆంధ్రజ్యోతి పత్రిక అస్సలు జీర్ణించుకోలేనట్లుంది . జగన్ రెట్టింపు మెజారిటీ నిర్ధేశించాడు అని కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన వార్తకన్నా ఎక్కువగా వచ్చిన మెజారిటీని కూడా తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తూ ఎంత చేసినా కూడా ఈ విజయం వైసీపీ శ్రేణుల్లో నిరాశ కలిగించింది అంటూ మెయిన్ ఎడిషన్ లో సొంత భాష్యం రాసుకోవడం చూస్తే ఈ మానసిక వ్యాధికి మందే లేదా అనిపించక మానదు .

మరోవైపు గతానికి భిన్నంగా బిజెపి అత్యధిక ఓట్లు సాధించిందన్న జ్యోతి ఆ ఓట్లు డిపాజిట్ నిలుపుకోవటానికి సహకరించలేదన్న విషయాన్ని తెలపకుండా ఉద్దేశ్యపూర్వకంగా విస్మరించింది . అంతే కాదు బిజెపికి గతంలో కన్నా ఎక్కువగా పోలైన ఓటింగ్ వెనక టీడీపీ , జనసేన పోటీ చేయకపోవడం , అంతర్గతంగా బిజెపికి సహకరించడం లాంటి కారణాలు వెల్లడించకుండా మరుగు పరిచే ప్రయత్నం చేస్తూ ఓ ఎన్నికల ఫలితం తాలూకూ వార్తని తమకు నచ్చని వారి గెలుపు కారణంగా తగ్గించి చూపే ప్రయత్నంలో భాగంగా నమ్మశక్యం కాని రీతిలో వక్రభాష్యాలు వార్తలుగా ప్రచురించడం ఆంధ్రజ్యోతికే చెల్లు .

Also Read : బద్వేల్‌లో బీజేపీది నైతిక విజయమట!