iDreamPost
iDreamPost
ఆమ్ ఆద్మీ పార్టీ (ఏపీపీ` ఆప్) ఏర్పాటు ఒక సంచలనం. రెండుసార్లు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు మరో సంచలనం.ఢిల్లీలో గెలవడమే కాదు… గత ఎన్నికల్లో పంజాబ్, గోవాలలో సైతం తన ఉనికి చాటుకోవడం… త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు చోట్ల బలమైన పోటీదారునిగా నిలవడనుండడం పెను సంచలనం కానుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో బోల్తా కొట్టిన పంజాబ్‌లో ఇప్పుడు ఆప్ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో తొలిసారి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో గణనీయంగా ఓట్లు… కొన్ని సీట్లు సాధించనుంది. తద్వారా ఉత్తరాది రాష్ట్రాలలో ఆప్ ఒక వెలుగు వెలగనుంది.
అరవింద్ కేజ్రివాల్ సారథ్యంలో 2012లో ఏర్పడిన ఆప్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు సంచలన విజయం సాధించింది. 2020లో జరిగిన ఎన్నికల్లో ఆప్ ఏకంగా 53.57 శాతం ఓట్లతో 70 స్థానాలకు గాను 62 స్థానాలను గెలుచుకుంది. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ 67 సాధించడం విశేషం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశరాజధాని ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇంతటి సంచలన విజయం సాధించిన ఆప్ పంజాబ్‌లో సైతం ఉనికి చాటుకుంది. 2017న జరిగిన ఎన్నికల్లో 23.72 శాతం ఓట్లతో 20 అసెంబ్లీ స్థానాలు సాధించింది. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాలు సాధించిన ఆప్ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం ఒక్కస్థానానికే పరిమితమైంది. దిగువనకు పడిపోయిన ఆప్ ఇప్పుడు పంజాబ్ ఎన్నికల్లో సత్తాచాటేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం వెళ్లడవుతున్న సర్వేల ప్రకారం ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read : Bjp.Modi – గెలుపు కోసం ప్రయాస.. మోడీ లక్ష్యం చేరేనా..?
అధికార కాంగ్రెస్ పార్టీలోని లుకలుకలు ఆప్‌కు కలిసి వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరపున సీఎంగా ఉన్న కెప్టెన్ అమరేంద్రసింగ్ ఆ పార్టీకి దూరం కావడం, సొంతంగా పార్టీ పెట్టనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ వివాదాస్పద వ్యవహారశైలి కాంగ్రెస్‌కు వ్యతిరేకతను తెస్తోంది. దీనికితోడు ఐదేళ్లు అధికారంలో ఉన్నందున ప్రజల్లో సహజమైన వ్యతిరేకత ఉంది. అయితే గడిచిన రెండు నెలలుగా అధికార కాంగ్రెస్ కొంత వరకు పుంజుకుంటోంది. కాంగ్రెస్ మీద వ్యతిరేకత గతంలో అధికారంలో ఉన్న శిరోమణి అకాలీదళ్‌కు అనుకూలం కావాలి. కానీ ఆ పార్టీ కుటుంబ వారసత్వ పార్టీగా మారడం, అధికారంలో ఉన్న సమయంలో వెల్లువెత్తిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రజల మొగ్గు ఆప్‌కు అనుకూలంగా మారింది. త్వరలో జరిగే ఎన్నికల్లో ఆప్‌కు 47 నుంచి 53 స్థానాలు వస్తాయని ఏబీపీ` సీ ఓటరు తేల్చింది. పార్టీకి 36.5 శాతం ఓట్లు రానున్నాయని అంచనా వేసింది. ఇది గత మార్చి కన్నా తక్కువ. అప్పట్లో అయితే 51 నుంచి 57 స్థానాలు వస్తాయని తెలిపింది. ఆప్ ఓటింగ్ శాతం అప్పటి కన్నా తగ్గకున్నా కాంగ్రెస్ పార్టీ పుంజుకుని ఆప్‌కు గట్టిపోటీ ఇస్తుంది. ఇక్కడ బీజేపీ నామమాత్రంగా మారింది. కొత్త వ్యవసాయ సాగు చట్టాలు బీజేపీకి పంజాబ్‌లో స్థానం లేకుండా చేయనుంది.
ఆప్ పంజాబ్‌తో పాటు గోవాలో సైతం గతంలో ఉనికి చాటుకుంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్కసీటు సాధించలేదు కాని 6.3శాతం ఓట్లు సాధించింది. వచ్చే ఏడాదిలో జరిగి ఎన్నికల్లో ఆ పార్టీ ఏకంగా 23.6 శాతం ఓట్లతో మూడు నుంచి ఏడు సీట్లు సాధిస్తుందని సర్వేలో తేలింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కన్నా ఆప్‌కు ఓట్లు, సీట్లు పెరగనున్నాయి. ఇక్కడ ఆప్ పార్టీ రోజురోజుకు పుంజుకుంటున్నందున సీట్లు సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. త్వరలో ఎన్నికలు జరిగే మరో రాష్ట్రం ఉత్తరాఖండ్. గత ఎన్నికల్లో ఇక్కడ ఆప్ పోటీ చేయలేదు. తొలిసారి పోటీకి సిద్ధమవుతున్న ఆ పార్టీకి ఏకంగా 11.8 శాతం ఓట్లు రానున్నాయి. సీట్లు కేవలం రెండే వస్తాయని అంచనా కాగా, ఆ స్థాయిలో ఓటింగ్ రావడం విశేషం. ఇక్కడ బీజేపీ ఓటింగ్ నెమ్మదిగా తగ్గుతుండగా, ఆ స్థానంలో కాంగ్రెస్, ఆప్ పార్టీల ఓటింగ్ పెరుగుతుండడం విశేషం. అతి పెద్ద రాష్ట్రం యూపీలో సైతం త్వరలో జరిగే ఎన్నికల్లో సత్తా చాటాలని ఆప్ ఉవ్విళ్లూరుతోంది. ఆ పార్టీకి ఇక్కడ చెప్పుకునే బలం లేదు. కాని న్యూఢిల్లీ ఆనుకుని యూపీ పరిధిలో ఉన్న నోయిడా, గుర్గావ్, ఘజియాబాద్ వంటి చోట ఆప్‌కు ఆదరణ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ఆప్‌తో పొత్తుకు సై అంది. బీజేపీకి గట్టిపోటీ ఇస్తున్న ఎస్‌పీతో పొత్తు ఆప్‌కు ఎన్నో కొన్ని సీట్లు సంపాదించి పెట్టనుంది. తద్వారా యూపీ ఎన్నికల్లో ఆప్ ఈసారి బోణి కొట్టే అవకాశం లభించనుంది.
Also Read : Up Congress – పోరాడుతున్నా ప్రయోజనం లేదు. యూపీలో కాంగ్రెస్ నామమాత్రమేనా?