తెలుగు సినిమాల్లో ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ప్రకారం తెలుగు సినిమా హీరో ఎంతమందినైనా ప్రేమించొచ్చు.. కలిసి తిరగొచ్చు.. కానీ ఆ హీరోని ప్రేమించే హీరోయిన్ మాత్రం ఆ హీరోని తప్ప ఇంకెవర్నీ ప్రేమించకూడదు… ఎంతమందితో తిరిగినా ఆ హీరోనే లోకంగా బ్రతకాలి(RX 100 ఆ ఫార్ములా బ్రేక్ చేసి సూపర్ హిట్ అయింది) అందుకే ఒకే హీరో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేసే మూస కథలే సినిమాలుగా తెలుగులో ఎక్కువగా తీస్తున్నారు. అందుకే హీరోయిన్ హీరోతో కాకుండా మరొకరితో సన్నిహితంగా ఉందంటే తట్టుకోలేరు. ఇదే ఫార్ములా పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ ల విషయంలో నిజం కూడా అయ్యింది.
తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ భక్తుల రూపంలో ఉంటారు. ఎక్కువగా అయన ఫ్యాన్స్ జోలికి వెళ్లే ప్రయత్నం ఎవరూ చేయరు. కారణం పవన్ ఫ్యాన్స్ ప్రవర్తన ఒక్కోసారి శృతిమించడం వల్ల కలిగే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. గతంలో అల్లు అర్జున్, నాగబాబు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ మూడవ పెళ్లి విషయంలో పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా కామెంట్స్ చేసిన మాజీ రెండో భార్య రేణు దేశాయ్ విషయంలో పవన్ అభిమానులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కొందరైతే ఏకంగా ఆమెను బెదిరించాడానికి ప్రయత్నాలు చేసారు. పవన్ కళ్యాణ్ వదిలేసినా పవన్ నామ స్మరణ చేస్తూ ఆమె జీవితాంతం గడపాలన్నది పవన్ అభిమానుల ఉద్దేశ్యం కావొచ్చు. నాకంటూ సెపరేట్ లైఫ్ ఉందని ఆమె వేడుకుంటున్నా పవన్ అభిమానులు కనికరించలేదు. అందుకే రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ దురభిమానులకు భయపడుతూ రెండో భర్తను బయట ప్రపంచానికి తెలియనివ్వకుండా వివాహం చేసుకుంది.
ఆ తరువాత అడపాదడపా ఆమె పవన్ కళ్యాణ్ గురించి చేసిన కామెంట్స్ కొన్ని వివాదాస్పదం అయ్యాయి.రీసెంట్ గా రేణుదేశాయ్ ఇంస్టాగ్రామ్ లో ఆద్య, అకీరాలు కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసి క్రేజీ ఫెలోస్… వాళిద్దరు నా సొంతం అని పోస్ట్ చేసారు. ఈ పోస్ట్ పై ఓ నెటిజన్ స్పందిస్తూ ఎంతైనా పవన్ రక్తం కదా అని కామెంట్ చేశాడు. దీంతో రేణూ దేశాయ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘సైన్స్ పరంగా చెప్పాలంటే వారిద్దరిలో ప్రవహించేది నా రక్తం. మీకు సైన్స్ తెలిస్తే ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు’ అని ఘాటుగా సమాధానం ఇచ్చారు. రేణూ దేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ లో కలకలం మొదలైంది. మళ్ళీ రేణూ దేశాయ్ పై కామెంట్ల రూపంలో దాడి చేయడం మొదలుపెట్టారు. ప్రశాంతంగా ఉన్న సమయంలో అనవసరంగా బురదలో రాయి వెయ్యడం ఎందుకనుకుందో ఏమో పవన్ ఫాన్స్ ని శాంతింప చేయడానికి కొత్త ఎత్తుగడ వేసింది రేణూ దేశాయ్.
ఇటీవలకాలంలో పవన్ కళ్యాణ్ పేరును అంతగా ప్రస్తావించని రేణూ దేశాయ్ ఇప్పుడు కొత్తగా తన కుమార్తె ఆద్యతో పవన్ కళ్యాణ్ కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేసింది. దానికి తోడు పవన్ కళ్యాణ్ తో కుమార్తెను పోలుస్తూ.. “అద్భుతంగా చాలా అందంగా పిల్లలు తల్లిదండ్రుల నుంచి పోలికలు పొందుతారు. ఆద్య కొన్నిసార్లు నాలానే కనిపిస్తుంది.. కానీ చాలాసార్లు వాళ్ల నాన్న, నాన్నమ్మకు కాపీలా కనపిస్తోంది. ఆధ్య నా కెమెరాకి ఇష్టమైన వ్యక్తి” అని ఇంస్టాగ్రామ్ లో చెప్పుకొచ్చింది. ఇప్పటికిప్పుడు పవన్ ప్రస్తావన ఎందుకా అని ఆలోచిస్తే అంతకుముందు పవన్ కళ్యాణ్ అభిమానులను రెచ్చగొట్టేవిధంగా వ్యాఖ్యలు చేయడమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది.
గత జీవితం తాలూకు చేదు జ్ఞాపకాలు వాటిని అధిగమించి, మరో వివాహం చేసుకుని పుణేలో ప్రశాంత జీవనం గడుపుతున్న రేణుదేశాయ్ ఇప్పుడు మళ్ళీ వివాదాస్పద కామెంట్స్ చేసి తన మాజీ భర్త అభిమానుల ట్రోల్స్ ని ఎదుర్కోవడం ఇష్టం లేకే వారిని సంబాళింప జేసే పనిలో పడ్డారు. ఎలాగూ అభిమానులు రేణు దేశాయ్ పై ఎలాంటి ట్రోల్స్ చేసినా పవన్ కళ్యాణ్ స్పందించరు. గతంలో రేణు దేశాయ్ పవన్ అభిమానుల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మళ్ళీ వారిని రెచ్చగొట్టి తన వ్యక్తిగత జీవితానికి ఇబ్బందులు కొనితెచ్చుకోవడం ఇష్టం లేకే పవన్ ప్రస్తావన తీసుకొచ్చినట్లు సమాచారం.. ఏదేమైనా తన వ్యక్తిగత జీవితంలో కూడా తలదూరుస్తున్న అభిమానులను కట్టడి చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ పై ఉంది.