iDreamPost
android-app
ios-app

సచివాలయ వ్యవస్థ మరింత పటిష్టం.. జగన్ కీలక ఆదేశాలు

  • Published Feb 04, 2022 | 8:00 AM Updated Updated Feb 04, 2022 | 8:00 AM
సచివాలయ వ్యవస్థ మరింత పటిష్టం.. జగన్ కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో పాలనా పరంగా అతి పెద్ద సంస్కరణ అయిన గ్రామ సచివాలయ వ్యవస్థను మరింత పటిష్ట పరిచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా కారుణ్య నియామకాల్లో సచివాలయ పోస్టుల భర్తీకి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

ఉగాది నాటికి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది అందరికీ యూనిఫామ్స్‌ ఇవ్వనున్నారు. ఉగాది సందర్భంగా ఉత్తమ సేవలందిస్తున్న వలంటీర్లను సత్కరించి, వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రజలకు మెరుగైన సేవలు అందాలంటే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఉత్తమ పనితీరు, సమర్థత కనబరచాలి. ఇందుకోసం ప్రజలకు వారు అందించాల్సిన సేవల విషయంలో అనుసరించాల్సిన తీరు పట్ల నిరంతరం వారికి అవగాహన కల్పించాలని అధికారులు నిర్ణయించారు.

ప్రజలకు అందుబాటులో ఉండడం అన్నది అత్యంత ప్రాధాన్యతా అంశంగా సచివాలయాల ఉద్యోగులు గమనించాలని సూచిస్తున్నారు. సేవల కోసం ఎవరైనా లంచం అడిగితే.. వెంటనే ఫిర్యాదు చేసేందుకు వీలుగా తగిన వ్యవస్థ ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించడంతో అందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇదివరకే ప్రకటించిన విధంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను రెగ్యులర్‌ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియ జూన్‌ నాటికి పూర్తిచేసి జూలై నెల నుంచి వారికి పెరిగిన వేతనాలు అందిస్తారు.

సిటిజన్‌ అవుట్‌ రీచ్‌ కార్యక్రమం చాలా ముఖ్యమైనందున సమర్థవంతంగా ఈ కార్యక్రమం కొనసాగించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల ప్రజల నుంచి సమస్యలు, సూచనలు అందుతాయి. ప్రజలకు మరింత అందుబాటులో ఉన్నామని మనం తెలియజేయడానికి ఒక అవకాశం లభిస్తుంది. సచివాలయాల సిబ్బంది, ప్రభుత్వ విభాగాల మధ్య నిరంతరం సమన్వయం ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. దీనికోసం గ్రామ, వార్డు స్థాయిలో, మండల, రెవెన్యూ డివిజన్, జిల్లాల స్థాయిలో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విధంగా సచివాలయ వ్యవస్థను అన్ని విధాలుగా పటిష్ట పరిస్తే ప్రజలకు పాలన మరింత చేరువ అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

మే నాటికి సచివాలయాల్లో ఆధార్‌ సేవలు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో మే నాటికి పూర్తిగా ఆధార్‌ సేవలు అందుబాటులోకి వచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు అవసరమైన సాంకేతిక పరికరాలను కొనుగోలు చేయనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో హార్డ్‌ వేర్‌ ఎప్పటికప్పుడు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. నెలకోసారి కంప్యూటర్లు, పరికరాల స్థితిగతులపై నివేదికలు తెప్పించుకుంటారు. ఆ మేరకు అవి సక్రమంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటారు.

Also Read : ఏపీ మహిళా కమిషన్ కు మరో ముగ్గురు సభ్యుల నియామకం