iDreamPost
android-app
ios-app

‘ఐకాన్’గా రాబోతున్న అల్లు అర్జున్

  • Published Apr 08, 2020 | 5:13 AM Updated Updated Apr 08, 2020 | 5:13 AM
‘ఐకాన్’గా రాబోతున్న అల్లు అర్జున్

ఇవాళ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమాల హడావిడి జోరుగా ఉంది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమాకు పుష్ప టైటిల్ ని ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ ని ఇందాకే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇంకా ఆ ఆనందంలో ఉండగానే మరో నిర్మాణ సంస్థ కొత్త అప్ డేట్ ఇచ్చింది. పుష్ప తర్వాత బన్నీ చేయబోయే 21వ మూవీ టైటిల్ ని ‘ఐకాన్’ గా ఫిక్స్ చేస్తూ కనపడుట లేదు క్యాప్షన్ ని ఇచ్చారు. నిజానికి ఇది గతంలో ప్రకటించినదే. కానీ అల వైకుంఠపురములో కన్నా ముందు ఏది ముందు చేయాలి అనే మీమాంసలో ఉండగా సీరియల్ నంబర్స్ మారిపోయాయి.

సుకుమార్ ది ముందుకు వచ్చి ఐకాన్ వెనక్కు వెళ్ళింది. ఇప్పుడు అఫీషియల్ గా చెప్పేశారు కాబట్టి బన్నీ 21 ఐకాన్ అనే విషయంలో ఇంకెలాంటి అనుమానం అక్కర్లేదు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించబోయే ఈ చిత్రం రోడ్ జర్నీ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందబోతోందని సమాచారం. వేణు శ్రీరామ్ ప్రస్తుతం దిల్ రాజునే నిర్మిస్తున్న పింక్ రీమేక్ వకీల్ సాబ్ కోసం పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇది అవ్వగానే అల్లు అర్జున్ సినిమా అంటే జాక్ పాట్ కొట్టినట్టే. ఇది అతనికి నాలుగో సినిమా.

మొదటిది ఓ మై ఫ్రెండ్ ఆశించిన విజయం సాధించలేదు. రెండోది నాని ఎంసిఎ. కమర్షియల్ గా బాగా వర్కవుట్ అయ్యింది. మూడోది వకీల్ సాబ్ కాగా నాలుగోది ఐకాన్. అన్ని దిల్ రాజు బ్యానర్ వే కావడం గమనార్హం. ప్రస్తుతం కరోనా వల్ల షూటింగులు ఆగిపోయాయి పుష్ప ఎప్పుడు తిరిగి ప్రారంభం అవుతుందనే దాన్ని బట్టి ఐకాన్ షెడ్యూల్స్ ని ప్లాన్ చేస్తారు. వినిపిస్తున్న టాక్ ప్రకారం పుష్ప 2021 సమ్మర్ కి టార్గెట్ చేశారు. అయితే ఐకాన్ వచ్చే ఏడాది చివర్లో లేదా 2022 సంక్రాంతికి వస్తుంది. నా పేరు సూర్య తర్వాత సుమారు రెండేళ్ళు గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ఎట్టకేలకు వరస ప్రాజెక్టులతో బిజీ కావడం అభిమానులకు మంచి కిక్ ఇస్తోంది