సామాన్య ప్రజలకు కొందరికి ఫోన్ చేసి రుణాలు వచ్చాయి కొంత మొత్తంలో డబ్బులు చెల్లించాలంటూ డబ్బులు వసూలు చేసి మోసం చేసే కేటుగాళ్ళు ఈ మధ్య ఎక్కువయ్యారు. ఇప్పుడు కొందరి కేటుగాళ్ల దృష్టి ఏకంగా ప్రజా ప్రతినిధులపై కూడా పడింది. తాజాగా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీని మోసగించబోయి ఓ కేటుగాడు దొరికిపోయాడు.
వివరాల్లోకి వెళితే బాబూ జగ్జీవన్‌రావు అలియాస్ తోట బాలాజీనాయుడు అనే వ్యక్తి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీకి ఫోన్ చేసి తాను సచివాలయంలో పనిచేస్తున్నానని నమ్మించాడు. అనంతరం కోవిడ్ నిధులు 2 కోట్లు మంజూరు అయ్యాయని నమ్మబలికి వీటిని 25 లక్షల చొప్పున ఎనిమిది మందికి రుణాల రూపంలో మంజూరు చేస్తారని చెప్పుకొచ్చాడు. కానీ రుణం పొందబోయేవారు 50,000 చొప్పున ఎనిమిది మంది కలిసి రూ.4 లక్షలు ఆర్టీజీఎస్ ద్వారా అర గంటలో తన ఖాతాకు పంపాలని, లేదంటే చిలకలూరిపేట నియోజకవర్గానికి రుణాలు దక్కవని నమ్మబలికాడు.
కాగా అతని మాటలపై అనుమానం రావడంతో ఎమ్మెల్యే విడదల రజినీ సీఎంవోలోని అధికారులను ఆ వ్యక్తి గురించి ఆరా తీయడంతో అలాంటి వ్యక్తి సచివాలయంలో ఎవరు పనిచేయడం లేదని తేలింది. దీంతో ఆమె నేరుగా డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఫోన్ ద్వారా విషయం తెలపడంతో ఈ విషయంపై విచారణ చేపట్టాలని ఎస్పీ అమ్మిరెడ్డిని ఆదేశించారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడు విశాఖలో ఉన్నట్లు తేలడంతో పోలీసులు విశాఖలో తోట బాలాజీ నాయుడును అరెస్ట్ చేశారు. నిందితుడు గతంలోను ఇదే తరహాలో మోసాలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, హిందూపురం, హైదరాబాద్‌లలోనూ ఫోన్ ద్వారా పలువురిని మోసగించినట్లు సమాచారం. కాగా పోలీసులు ఈ వ్యవహారంపై నిందితుడి మోసాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.