iDreamPost
android-app
ios-app

కొత్త వేషం.. ఉత్తుత్తి రోషం.. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ..

  • Published Sep 10, 2021 | 7:12 AM Updated Updated Sep 10, 2021 | 7:12 AM
కొత్త వేషం.. ఉత్తుత్తి  రోషం..  సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ..

సినీనటులు ఒక్కో సారి పాత్రోచితంగా తమ శరీరాకృతి మార్చుకుంటారు. సన్నగా ఉన్నవారు లావెక్కడం. లావుగా ఉంటే నాజూకుగా మారడం చేస్తుంటారు. బాహుబలి కోసం దగ్గుబాటి రాణా కండలు పెంచగా హీరోగా నిలదొక్కుకోవడానికి సునీల్ సిక్స్ ప్యాక్ సాధించాడు. లావుగా, బొద్దుగా ఉండే జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు రాజమౌళి సూచన మేరకు స్లిమ్ అయి యమదొంగగా కొత్త లుక్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. దాదాపు అన్ని భాషల సినిమాల్లోను ఈ ధోరణి కనిపిస్తుంది.

రాజకీయాల్లోనూ..

వెస్ట్ బెంగాల్ ఎన్నికల ప్రచార వేళ ప్రధానమంత్రి మోదీ అచ్చం రవీంద్రనాథ్ టాగూర్ మాదిరిగానే తన తెల్ల గడ్డాన్ని మరింత కిందికి పెంచి అక్కడి ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నం చేశారాని తృణమూల్ నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు.

మన రాష్ట్రంలో తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అప్పట్లో తరచు గెటప్పులు మార్చేసేవారు. సినిమాల్లో ఆయన మారువేషాలకు మంచి డిమాండు ఉండేది. ఈ కారణంగానేమో రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఆయన ఈ మారువేషాలు కొనసాగించారు. పార్టీని స్థాపించిన కొత్తలో తానొక కార్మికుడిని అంటూ ఖాకీ దుస్తులను ధరించి చైతన్య రథంపై రాష్త్రం అంతా ప్రచారం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చాక తెలుగు సంస్కృతి అంటూ పంచె, పైజమా ధరించారు. కొన్నాళ్లకు తాను సర్వసంగ పరిత్యాగిని అని ప్రకటించి కాషాయం కట్టేవారు. అయితే ఆయన చేసే పనుల్లో చిత్తశుద్ధి, దాపరికం లేని వ్యక్తి త్వం వల్ల అలా వ్యవహరించే వారని జనం భావించేవారు. ఆదరించేవారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మార్క్షిస్ట్ మేధావుల తరహాలో తెల్ల దుస్తులు, నల్ల గెడ్డంతో ప్రచారం నిర్వహించారు. తమ హీరో అలా కనిపించడాన్ని ఆయన అభిమానులు ఇష్టపడ్డారు. ఇప్పుడు తాజాగా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్లిమ్ లుక్ తో జనంలో తిరుగుతున్నారు.

Also Read : లోకేషా.. ఇంత కథ ఉందా..?

ఐడియా ఎవరిదో?

లావుగా ఉండి, ముద్దముద్దగా మాట్లాడే ఆయనను పప్పు అంటూ వైఎస్సార్ సీపీ నేతలు గేలి చేసేవారు. అదేమిటో అప్పట్లో గూగుల్లో పప్పు అని టైప్ చేస్తే లోకేష్ చిత్రం దర్శనం అయ్యేది. వీటిని దృష్టిలో పెట్టుకున్నారో లేక ఎవరైనా సలహా ఇచ్చారో మొత్తం మీద కొత్తగా కనిపిస్థున్నారు.

భాషా మారెను..

కడుపునిండా తిని, కంటి నిండా నిద్రపోతే రాజకీయాల్లో రాణించడం కష్టం. ఊరురా తిరిగి నోరారా వాగితేనే జనం నోళ్లలో నానతాము అని కూడా ఎవరైనా సుచించారో, తనకే తోచిందో తెలియదుగానీ కొత్త వేషంతో సరిపెట్టకుండా తన భాషకు కూడా లోకేష్ పదును పెట్టారు. అవసరం ఉన్నా లేకున్నా జనంలోకి వచ్చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ నాయకుల అంతు చూస్తా, అధికారంలోకి రాగానే పోలీసుల పనిపడతా అంటూ ఇన్నాళ్ళూ మాట్లాడిన ఆయన గొంతులో ఆవేదన, ఆవేశం పాలు పెరిగిపోయింది. 

అసలే తెలుగు భాషలో అంతంత మాత్రం పరిజ్ఞానం ఉందని విమర్శలు ఎదుర్కొనే ఆయన ఈ తెచ్చి పెట్టుకున్న ఆవేశంతో మరింత నవ్వుల పాలవుతున్నారు. పల్లవికి, చరణానికి సంబంధం లేని పాటలా సాగే ప్రసంగం, సెకండ్ రేట్ ఇన్సిపిరేషన్ తో వచ్చిన ఉద్రేకం ఆయనను విచిత్రమైన వక్తగా మార్చేశాయి. ఎప్పుడో ఏడు నెలల క్రితం జరిగిన దుర్ఘటనకు సైతం తాజాదనాన్ని అద్ది బాధితుల కన్న ఎక్కువ బాధ పడిపోవటం జనం ఎలా అర్థం చేసుకుంటారో ఆయన పట్టించుకోవడం లేదు. అధికార పార్టీకి వ్యతిరేకంగా జనాన్ని రెచ్చగొడుతున్నానని భావిస్తూ అభాసుపాలవుతున్నారు. అనాగరికంగా, అసందర్భంగా బూతులు మాట్లాడుతూ రాజకీయాల స్థాయిని దిగజారుస్తున్నారు.

తిట్ల దండకానికి ఓట్లు వర్షివర్షిస్తాయా ?

ప్రతిపక్ష పాత్ర అంటే పూనకం వచ్చినట్టు ఊగిపోవడం కాదు. సమస్యలపై అధ్యయనం చేయాలి. పరిష్కారాలు సూచించాలి. తాను ప్రసంగిస్తూంటే అధికార పక్ష నేతలు కళ్లప్పగించి వినేలా ఉండాలి. విమర్శ నిర్మాణాత్మకంగా సాగాలి. అప్పుడే ప్రతిపక్షంపై ప్రభుత్వానికి భయం పుడుతుంది. ప్రజల్లో గౌరవం పెరుగుతుంది. అంతేగానీ వేషం మార్చి, బజారు భాష మాట్లాడుతూ ఊళ్ళమ్మట తిరిగితే పార్టీకి, ఆయనకు ఒరిగేదేమీ ఉండదు. నిజాయితీగా ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించకుండా ఇలా అమావాస్యకో, పున్నమికో ఆవేశ పడితే మీడియాలో చోటు దక్కుతుందేమోగాని ప్రజల హృదయాల్లో కాదు. ఎనికల్లో ఓట్లు కూడా రాలవు గాక రాలవు.

Also Read : లోకేష్ కి గతం గుర్తు చేయాలి..!