Idream media
Idream media
ఇసుక పేరుతో రాజకీయ దుమారం రేపుతున్న ప్రతి పక్షాలకు, అక్రమ వ్యాపారులకు చెక్ పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో ఏర్పాటయిన స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో ఎక్కడికక్కడ అక్రమ దందాకు చెక్ పెడుతోంది. పాదరదర్శకంగా ఇసుక సరఫరాకు చర్యలు చేపడుతోంది.
పొరపాటున ఏ కారణం చేతనైన చిన్న సమస్య ఏర్పడితే ప్రతిపక్ష టీడీపీ నేతలు రంధ్రాన్వేషణ చేసి.. దానిపై అగ్గి రాజేస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ పని కట్టుకుని మరీ ఇసుక అంశాన్ని వివాదం చేయడానికి చాలా సార్లు ప్రయత్నించారు. ఎప్పటికప్పుడు అధికారులకు తగిన ఆదేశాలు ఇస్తూ.. వివాదాలను చెరిపేస్తున్న జగన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్షాలకు ఇసుకపై ఆందోళనలు చేసే అవకాశం లేకుండా చేశారు. అలాగే అవినీతికి కూడా ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టారు.
ప్రత్యేక కార్పొరేషన్
జగన్ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ఇసుక అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీని ద్వారా ఏపీఎండీసీ కి పని భారం తగ్గించడంతో పాటు పారదర్శకంగా ఇసుక సరఫరాలో మరో అడుగు ముందుకేసింది ఏపీ ప్రభుత్వం. ఇసుక కార్పొరేషన్ పై ఏకంగా ముగ్గురు మంత్రుల కమిటీ పర్యవేక్షణ ఉంటుంది. పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తో కూడిన కమిటీ ఈ కార్పొరేషన్ పని తీరును పర్యవేక్షిస్తుంది. రాష్ట్రంలో గృహ నిర్మాణాలకు సంబంధించిన ఇసుక కోసం ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చరిత్రలోనే ఇదే ప్రథమం. ఓ అంశానికి సంబంధించి జగన్ ఎంత దూరం ఆలోచిస్తారో.. అనడానికి ఈ నిర్ణయం ఓ ఉదాహరణగా చెప్పవచ్చనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
గతంలోనూ…
ఇసుక ఇబ్బందులు, అక్రమాలకు సంబంధించి కొన్ని అంశాలు గతంలో జగన్ దృష్టికి వచ్చినప్పుడు కూడా ఆయన వెంటనే స్పందించారు. సంబంధిత అధికారులను పిలిచి మాట్లాడారు. ఇసుక విధానంలోని లోపాలపై సీరియస్ అయ్యారు. బల్క్ బుకింగ్స్ ని పోర్టల్ నుంచి తీసేయాలని ఆదేశించారు.
బల్క్ ఆర్డర్ కావాలంటే జాయింట్ కలెక్టర్ అనుమతి ఉండాల్సిందే అని తెలిపారు.ప్రభుత్వ పనుల కోసమంటూ ఇసుక తరలించడానికి కూడా ఎస్ ఈ లేదా జేసీ అనుమతించాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో పాటు ఇసుక బుకింగ్స్ కోసం సాయంత్రం 6గం.ల వరకూ అనుమతించాలని చెప్పేశారు.
గ్రామ సచివాలయం నుంచే ఇక ఇసుక బుకింగ్స్ ను తక్షణం అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. ఇసుక సమస్యపై జగన్ నేరుగా రంగంలోకి దిగి ఆదేశాలు ఇచ్చిన అనంతరం ఇప్పటి వరకు రోజుకు సగటున 1.25 లక్షల టన్నుల ఇసుక తవ్వకాలు 3 లక్షల టన్నులకు పెంచే దిశగా చర్యలు మొదలయ్యాయి.