Idream media
Idream media
మన దగ్గర ఎంత పెద్ద తాళం వున్నా, దాన్ని తీయడానికి చిన్న కీ వుండాలి. సినిమా కథ కూడా ఇంతే. కథను లాక్ చేయడం ఈజీ. తీయడమే కష్టం. 90ఎం.ఎల్. సినిమాలో కూడా ఇదే జరిగింది.
మందు తాగకపోతే బతకలేని ఒక కుర్రాడు, మందు వాసన గిట్టని ఒక అమ్మాయి. ఇద్దరూ ప్రేమలో పడితే ఏమవుతుంది? వినడానికి బాగానే ఉంది. కానీ తీయడంలో మాత్రం డైరెక్టర్ శేఖర్‌రెడ్డి సర్కస్ ఫీట్స్ చేశాడు. దాంతో తాగకపోయినా మనకు హ్యాంగోవర్ వస్తుంది.
దేవదాస్‌కి (కార్తీకేయ) చిన్నప్పటి నుంచి ఒక జబ్బు వుంటుంది. రోజుకి మూడుసార్లు మనం భోజనం చేసినట్టు ఆయన రోజుకి మూడుసార్లు 90ఎం.ఎల్. మందు తాగకపోతే చచ్చిపోతాడు. అందువల్ల చిన్నప్పటి నుంచి అమ్మా నాన్నే మందు పోసి పెంచుతారు.
హీరో బాగా చదువుకున్నప్పటికీ ఈ మందు అలవాటు వల్ల ఉద్యోగం రాదు. ఒకరోజు ప్రమాదంలో వున్న పిల్లవాన్ని హీరో కాపాడతాడు. (కాపాడకపోతే హీరో ఎలా అవుతాడు).
హీరో మొదటిసారి హీరోయిన్ని ఎలా కలుసుకున్నాడు అనేది, తలనొప్పి వ్యవహారం. దర్శకులు, రచయితలు జుత్తు పీక్కొనేది ఇక్కడే. కానీ మన డైరెక్టర్ మాత్రం రిస్క్ లేకుండా అనేక సినిమాల్లో చూసిన ఫార్మాట్‌నే ఫాలో అయిపోయాడు. ట్రాఫిక్ జాంలో హీరో హీరోయిన్‌ని చూస్తాడు. చేయడానికేమీ సోషల్ సర్వీస్ లేనట్టు ఆమె ట్రాఫిక్‌ని కంట్రోల్ చేసే పనిలో వుంటుంది. హీరో పిల్లవాడిని కాపాడిన వీడియోని తీసినవాళ్లలో ఆమె కూడా ఒకరు. అందువల్ల హీరో మంచివాడని ఆమె నమ్ముతుంది. ఇద్దరి మధ్య లవ్. ఆమె ఇంట్లో తండ్రి రావురమేష్‌తో సహా అందరూ అదో టైప్. కూతురిని కూడా సువాసనగారు అని పిలుస్తాడు. సువాసన అనే కూతురికి పేరు పెట్టడంలోనే ఆయనేంటో మనకి అర్థమవుతుంది. ఆయన చిన్న కూతురు కరాటే స్పెషలిస్ట్. ఆయన భార్య కర్ర తిప్పడంలో ఎక్స్‌ఫెర్ట్.హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ, హీరో తన అలవాటుని కప్పి పుచ్చుకోవడం, విలన్ (రవికిషన్) అనుచరుల కామెడీ ఇదంతా కలిసి (3 పాటలు కూడా) ఫస్టాఫ్ నడుస్తుంది. హీరో తాగుబోతు అని తెలియడంతో ఫస్టాఫ్ బ్యాంగ్.
సెకండాఫ్ ఓపెనింగ్‌లోనే హీరో తన సమస్య చెప్పినా, హీరోయిన్ విన్నా ఇక కథ అయిపోతుంది కాబట్టి డైరెక్టర్ రకరకాల ట్రాక్‌లు పెట్టి లాగించేశాడు. సెకండాఫ్‌లో కూడా నాలుగు పాటలు (అందులో రెండు ట్రాజెడీ). సినిమా మొత్తం నాలుగు ఫైట్స్. చివరికి ఎలాగో అయిపోతుంది.సినిమాలో కార్తికేయ ఎనర్జీ లెవెల్స్ బావున్నాయి. థియేటర్‌లో అవే కూర్చోబెడతాయి. హీరోయిన్ నేహాసొలంకి పరవాలేదు. రావురమేష్‌కి తన క్యారెక్టరైజేషన్ అర్థమైనట్టు లేదు. చాలా సీన్స్‌లో కన్‌ఫ్యూజింగ్‌గా చూస్తాడు. తన ఇంటికి వచ్చి బెదిరించినవాడ్ని అల్లున్ని చేసుకోవాలని అనుకోవడంతోనే అతని గ్రాఫ్ పడిపోయింది.
క్లైమాక్స్‌లో ఐటెం సాంగ్ టార్చర్. ఫస్టాఫ్‌లో కొంచెం కామెడీ వర్కవుట్ అయ్యింది. రవికిషన్ మెడిటేషన్ ట్రాక్ సహనాన్ని పరీక్షిస్తుంది. సన్నివేశాలు కృతకంగా వచ్చి పోతుంటాయి తప్ప సహజంగా వుండవు. హీరో ఫైట్స్, డ్యాన్సులు మాస్ ఆడియన్స్‌కి నచ్చితే నచ్చవచ్చు.
మొత్తంగా సినిమా మందు వాసనతో వుంటుంది. మందు అలవాటు ఉన్న ప్రేక్షకుడికైతే నో ప్రాబ్లం. థియేటర్ నుంచి రాగానే 90ఎం.ఎల్. వేసుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది. అలవాటు లేని వాళ్లకే కష్టం. మద్యం హానికరం అని స్క్రీన్ మీద ట్యాగ్‌లైన్‌లా కనిపిస్తూ వుండడమే విశేషం.
రేటింగ్– 2/5