రాజు మంచివాడైతే రాజ్యంలోని ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారంటారు. ప్రజలకు ఎలా మేలు చేయాలో ఆలోచించే నేతల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ముందు వరసలో ఉంటారనడంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, ప్రవేశపెట్టిన పథకాలే ప్రత్యక్ష నిదర్శనం. తమ ఊరిలోనే ప్రభుత్వ సేవలను ప్రజలు పొందేలా గ్రామ సచివాలయ వ్యవస్థ పెట్టడం, ఫించన్ డోర్ డెలివరీ చేయడం వంటి నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సౌకర్యవంతమైన జీవనం అందేలా సీఎం జగన్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఆపన్నులకు ప్రభుత్వం అండగా ఉండాలనే లక్ష్యంతో జగన్ సర్కార్ తీసుకున్న ఓ నిర్ణయం వల్ల రాష్ట్రంలో 8.09 లక్షల మందికి మేలు జరిగింది.
గత చంద్రబాబు ప్రభుత్వం ఫించన్ వయస్సును 60 నుంచి 65కు పెంచి వీలైనంత మందికి పథకం దూరం చేసింది. అయితే జగన్ సర్కార్ అధికారంలోకి రాగానే ఆ నిబంధనను తిరిగి యథావిధిగా మార్చారు. 60 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలని నిర్ణయించారు. అంతేకాదు పింఛన్ అర్హతలను సడలించారు. భూ పరిమితిని 5 ఎకరాల నుంచి 10 ఎకరాలకు పెంచారు. దీని ఫలితంగా రాష్ట్రంలో లక్షల మందికి లబ్ధి చేకూరింది.
జగన్ సర్కార్ అధికారంలోకి రాక ముందు రాష్ట్రంలో వివిధ కేటగిరీల్లో 53.19 లక్షల మందికి ఫించన్ తీసుకుంటున్నారు. అర్హత ఉంటే చాలు ఎప్పుడైనా పింఛన్ ఇస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రతి నెలా పింఛన్ నూతనంగా అందుకునే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఆగస్టు 1న అంటే.. రేపు ఏపీలో మరో 2.20 లక్షల మంది కొత్తగా పింఛన్ తీసుకోబోతున్నారు. ఫలితంగా రాష్ట్రంలో ఫించన్ తీసుకునే వారి సంఖ్య 61.28 లక్షల మందికి చేరుకుంటోంది. మొత్తం మీద ఇప్పటికీ జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదనంగా 8.09 లక్షల మంది కొత్తగా పింఛన్ అందుకున్నారు. ప్రతి నెలా కొత్తగా అర్హత పొందే వారికి కూడా పింఛన్ మంజూరు చేసే విధానం అమలు చేస్తుండడంతో ఈ సంఖ్య ప్రతి నెలా ఎంతో కొంత పెరిగే అవకాశం ఉంది.