తెలుగు ప్లస్ సౌత్ సినిమా స్థాయి దినదిన ప్రవర్ధమానమవుతూ బాలీవుడ్ కే సవాల్ విసిరే స్థాయికి చేరుకుంటోంది. బాహుబలి ఏదో గ్రాఫిక్స్ వల్ల నార్త్ లోనూ తెగ ఆడేసిందనే అంచనాలను తలకిందులు చేస్తూ 2021లో మన హీరోలు తమ సత్తా ముంబై లెవెల్ లో చాటబోతున్నారు. కేవలం 100 రోజుల వ్యవధిలో ఏకంగా 6 పాన్ ఇండియా సినిమాలు దేశవ్యాప్తంగా విడుదల కాబోతుండటం భవిష్యత్తులో మన డామినేషన్ ఏ రేంజ్ లో ఉండబోతోందో చాటబోతున్నాయి. వీటి కనీస బిజినెస్ విలువ 2000 వేల కోట్ల దాకా వెళ్లినా ఆశ్చర్యం లేదు. థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్, డబ్బింగ్ అన్నీ కలుపుకుని ఇంకా ఎక్కువే అవ్వొచ్చని ట్రేడ్ అంటోంది.
ఈ జాతర జూలై 2న ‘మేజర్’తో మొదలుకానుంది. ప్రస్తుతానికి అంచనాలు పైకి తక్కువగానే కనిపిస్తున్నప్పటికీ విడుదల సమయానికి యుఆర్ఐ వసూళ్లను క్రాస్ చేస్తుందనే ధీమాలో యూనిట్ ఉంది. అడవి శేష్ ఇమేజ్ తో సంబంధం లేకుండా పూర్తిగా కంటెంట్ ని నమ్ముకుని రూపొందుతున్న ఈ సినిమాకు సోనీతో పాటు మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆ తర్వాత దేశం మొత్తం ఎదురు చూస్తున్న ‘కెజిఎఫ్ 2’ జులై 16న కనివిని ఎరుగని స్థాయిలో థియేటర్లలో అడుగు పెడుతుంది. ఇప్పటికే బయ్యర్లు వేలంవెర్రిగా రేట్లు పెట్టి హక్కులు కొంటున్నారు. షాకింగ్ ఫిగర్స్ నమోదవుతున్నాయి.
ఆపై కేవలం రెండు వారాల గ్యాప్ లో ‘రాధే శ్యామ్’ జులై 30 న వచ్చేస్తుంది. సాహో తర్వాత ప్రభాస్ సినిమా కావడంతో హైప్ కి ఆకాశమే హద్దుగా మారుతోంది. ఐదు బాషల్లోనూ క్రేజ్ తక్కువేమి లేదు. ఆపై ఆగస్ట్ 13న అల్లు అర్జున్ ‘పుష్ప’ కూడా వస్తోంది. ఈసారి బన్నీ అన్ని మార్కెట్ల మీద కన్నేయడంతో బడ్జెట్ కూడా భారీగా పెట్టారు. ఆపై నెల సెప్టెంబర్ 9న విజయ్ దేవరకొండ ‘లైగర్’ వస్తాడు. ఇదీ పాన్ ఇండియానే. కరణ్ జోహార్ నిర్మాతల్లో ఒకరు కావడంతో అక్కడా పెద్ద రిలీజ్ కు ప్లాన్ చేస్తారు. ఇక మోస్ట్ వాంటెడ్ మూవీ అఫ్ ఇండియా ‘ఆర్ఆర్ఆర్’ అక్టోబర్ 13న వచ్చేస్తుంది. రాజమౌళి-రామ్ చరణ్-జూనియర్ ఎన్టీఆర్ కాంబో కావడంతో దీని క్రేజ్ గురించి వర్ణించాలన్నా కష్టంగానే ఉంది. ఈ లెక్కన టాలీవుడ్ ఎక్కడికి వెళ్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు