iDreamPost
android-app
ios-app

విశాల్ ‘చక్ర’కు 8 కోట్ల బ్రేక్

  • Published Oct 10, 2020 | 10:19 AM Updated Updated Oct 10, 2020 | 10:19 AM
విశాల్ ‘చక్ర’కు 8 కోట్ల బ్రేక్

విశాల్ కొత్త సినిమా చక్ర ఓటిటిలో డైరెక్ట్ రిలీజ్ అవుతుందంటూ చాలా రోజుల క్రితమే ప్రచారం జరిగింది. అయితే ఇప్పటిదాకా ఎలాంటి ప్రమోషన్ మొదలుకాలేదు. దానికి కారణం కోర్టు కేసు. ఇతని గత సినిమా యాక్షన్ తమకు 8 కోట్లకు పైగా నష్టాన్ని మిగిల్చిందని, పెట్టుబడి పెట్టిన ఇరవై కోట్లు రాకుంటే ఆ మొత్తాన్ని తాను వెనక్కు ఇస్తానని బాధ్యత తీసుకుని విశాల్ అగ్రిమెంట్ రాసి ఇచ్చాడట. తీరా చూస్తే యాక్షన్ అతి కష్టం మీద యావరేజ్ టాక్ తో 11.7 కోట్లు మాత్రమే రాబట్టింది. దీంతో ఆ బ్యాలన్స్ 8.3 కోట్లు మాకు చట్టప్రకారం రావాలని యాక్షన్ ప్రొడ్యూసర్లు కోర్టు మెట్లు ఎక్కారు. మొదట విశాల్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చిన కోర్టు అప్పీల్ తర్వాత ఫ్రెష్ గా నష్టపరిహారం చెల్లించాల్సిందేనని ఆదేశించింది.

ఇప్పుడు దీని గురించి పై న్యాయస్థానాన్ని తీసుకెళ్లేందుకు విశాల్ ప్రయత్నిస్తున్నాడు. చక్ర రిలీజ్ కు ఇప్పుడీ యాక్షన్ వ్యవహారం చాలా పెద్ద తలనెప్పిగా మారింది. నిజానికి విశాల్ ఈ చక్రను కూడా యాక్షన్ నిర్మాతలకే చేస్తానని మాట ఇచ్చాడట. తీరా తన బ్యానర్ లోనే తీసుకున్నాడు. ఇప్పుడదే ఇష్యూగా మారింది. నెల రోజుల్లోగా ఆ మొత్తాన్ని చెల్లించకపోతే అదో కోర్టు ధిక్కార కేసు అవుతుంది. అందుకే దీని గురించి పెద్ద స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని కోలీవుడ్ టాక్. గత కొంత కాలంలో వివాదాల్లో ఇరుక్కోవడం విశాల్ కు రొటీన్ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు ఏకంగా సినిమా రిలీజ్ కు బ్రేక్ పడటం అంటే చిన్న విషయం కాదు.

శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన చక్రకు ఎంఎస్ ఆనందన్ దర్శకత్వం వహించాడు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు. ట్రైలర్ వచ్చాక అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. ఓటిటి డీల్ జీ ప్లెక్స్ తో కుదిరిందన్న టాక్ వచ్చింది కానీ అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు. ఒకవేళ ఇప్పుడు చక్ర విడుదల వాయిదా పడితే ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ క్యాన్సిల్ అవ్వడమే కాక అడ్వాన్స్ ని వెనక్కు ఇవ్వాల్సి ఉంటుంది. అదే జరిగితే రిలీజ్ ఆలస్యమై రేట్ తగ్గే ప్రమాదం లేకపోలేదు. అందుకే చక్రబంధనం నుంచి ఈ సినిమా ఎలా బయటపడుతుందాని అభిమానులు ఎదురు చూస్తున్నారు