iDreamPost
android-app
ios-app

అక్కడా దళిత బంధు.. ప్రతిపక్షాలకు షాకిస్తున్న కేసీఆర్

  • Published Sep 03, 2021 | 5:41 AM Updated Updated Sep 03, 2021 | 5:41 AM
అక్కడా దళిత బంధు.. ప్రతిపక్షాలకు షాకిస్తున్న కేసీఆర్

ఒకవైపు దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు గురించిన పనుల్లో బిజీగా ఉంటూనే.. మరోవైపు దళిత బంధు గురించి కీలక ప్రకటన చేశారు సీఎం కేసీఆర్. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ పథకం ప్రస్తుతం హుజురాబాద్‌లో పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తుండగా.. తాజాగా మరో నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో అమలు చేయాలని నిర్ణయించారు. ఎస్సీలకు రిజర్వ్ అయిన ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం, నాగర్‌ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలం, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలాలను ఎంపిక చేశారు. ఈ మండల్లాలోని అర్హత కలిగిన దళిత కుటుంబాలకు వెంటనే దళిత బంధు పథకాన్ని వర్తింప చేయాలని ఆదేశాలిచ్చారు. అయితే కేసీఅర్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కారణం ఏంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత, అసెంబ్లీలో కాంగ్రెస్ పక్ష నేత భట్టి విక్రమార్క ప్రాతినిథ్యం వహిస్తున్న మధిరను ఎంపిక చేయడం చర్చనీయాంశం అవుతోంది.

విమర్శలకు చెక్ పెట్టేందుకేనా?

తెలంగాణలో 17 లోక్‌సభ, 119 శాసనసభ స్థానాలున్నాయి. వీటిలో ఎస్సీలకు 19, ఎస్టీలకు 12 రిజర్వు అయ్యాయి. 19 ఎస్సీ నియోజకవర్గాలు ఉండగా.. ప్రత్యేకంగా ఆ నాలుగు నియోజకవర్గాలనే ఎందుకు ఎంపిక చేశారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. అందులో తుంగతుర్తి, జుక్కల్, అచ్చంపేటలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మధిరలో మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఉన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన మధిర, ఉమ్మడి మహబూబ్‌నగర్‌‌కు చెందిన అచ్చంపేట, ఉమ్మడి నల్గొండకు చెందిన తుంగతుర్తి, ఉమ్మడి నిజామాబాద్‌కు చెందిన జుక్కల్ నియోజకవర్గాల ఎంపికలో రాజకీయ కోణం ఉందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో ప్రతిపక్షంలో ఎక్కువ వాయిస్ వినిపిస్తున్న నేతలు ఈ జిల్లాలకు చెందిన వాళ్లే. భట్టి విక్రమార్కది ఖమ్మం కాగా, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిది మహబూబ్‌నగర్‌‌, కోమటిరెడ్డి బ్రదర్స్‌ది నల్గొండ, బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ది నిజామాబాద్. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ది కరీంనగర్. దళిత బంధు మొదలైంది ఆ జిల్లాలోనే. దళిత బంధు విషయంలో ఎక్కువగా విమర్శలు చేస్తున్నది ఈ ఐదుగురే కాబట్టి.. ఆ నియోజకవర్గాల్లో పథకాన్ని అమలు చేయడం ద్వారా విమర్శలకు చెక్ పెట్టారని వాదనలు వినిపిస్తున్నాయి. దశల వారీగా అమలు చేస్తామని సీఎం ప్రకటించారని.. ఇలా రానున్న రోజుల్లో మరిన్ని నియోజకవర్గాలకు పథకాన్ని విస్తరిస్తారని నేతలు చెబుతున్నారు. దళిత బంధు పథకం హుజూరాబాద్‌లో పుట్టి, హుజూరాబాద్‌లోనే అంతమయ్యే పథకం కాదని చెప్పకనే చెబుతున్నారు.

భట్టి విక్రమార్క కోసమా? విమర్శలు చేసేటోళ్ల నోర్లు మూయించేందుకా?

సీఎల్పీ నేతగా ఉన్న భట్టి విక్రమార్క.. పీసీసీ చీఫ్ పదవి ఆశించారు. కానీ ఆ పదవికి రేవంత్ రెడ్డిని ఎంపిక చేయడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ పార్టీలోని నేతలు సర్దిచెప్పడంతో కాస్త తగ్గినట్లు కనిపించినా అసమ్మతి మాత్రం తగ్గలేదనే టాక్ ఉంది. అంతకుముందు మొన్న మరియమ్మ లాకప్ డెత్ విషయంలో మాట్లాడేందుకు భట్టి విక్రమార్క ప్రగతి భవన్‌కు వెళ్లారు. తర్వాత బాధితులకు ఆర్థిక సాయం పంపిణీలోనూ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్నారు. దీంతో భట్టి విక్రమార్క అప్పట్లోనే టీఆర్ఎస్‌లో చేరుతారంటూ పుకార్లు వచ్చాయి. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ కోవర్టులు నిజమేనంటూ అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీనిపై భట్టి కూడా తీవ్రంగానే స్పందించారు. భట్టిని తన వైపు తిప్పుకునేందుకు కేసీఆర్ ప్రయత్నించారనే వాదనలు ఉన్నాయి. కనీసం తమపై సాఫ్ట్‌కార్నర్ ఉండేలా చేసుకుంటున్నారని పొలిటికల్ సర్కిల్స్‌ చర్చించుకుంటున్నాయి. అప్పట్లో అసెంబ్లీలో సీఎల్పీనేతగా ఉన్న జానారెడ్డిని.. ‘పెద్దలు జానారెడ్డి గారు’ అని అంటూ చల్లబరిచేవారు కేసీఆర్. అలానే ఇప్పుడు భట్టిని కూల్ చేస్తున్నారనే వాదనలు ఉన్నాయి. మరోవైపు దళిత బంధు విషయంలో భట్టి సహా కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకే కేసీఆర్ ఇలాంటి స్టెప్ వేశారనే చర్చ కూడా జరుగుతోంది. వాళ్ల నోర్లు మూయించేందుకే తాజా నిర్ణయం తీసుకుంటున్నారని అంటున్నారు. ఉప ఎన్నిక కోసమే దళిత బంధు తీసుకొచ్చారని విమర్శిస్తున్న నేతలకు.. ఇలా వీలు చిక్కినప్పుడల్లా తన నిర్ణయాలతో అవాక్కయ్యేలా చేస్తున్నారు కేసీఆర్. రానున్న రోజుల్లో ఇంకెన్ని నిర్ణయాలు తీసుకుంటారో..?!

Also Read : కేసీఆర్ కు మోదీ అపాయింట్ మెంట్ పై బీజేపీలో టెన్ష‌న్